Interesting Facts: షర్ట్ బటన్లకు 2 రంధ్రాలు ఉంటే ఏమవుతుంది? 4 రంధ్రాల డిజైన్ వెనుక అసలు స్ట్రాటజీ ఇదే!
మనం ప్రతిరోజూ రకరకాల దుస్తులు ధరిస్తుంటాం. కానీ, ఆ బట్టలలో ఉండే చిన్న చిన్న మార్పులను లేదా డిజైన్లను పెద్దగా పట్టించుకోము. ఉదాహరణకు, మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా చొక్కా బటన్లకు నాలుగు రంధ్రాలు ఉంటాయి. కేవలం రెండు రంధ్రాలతో కూడా పని నడుస్తుంది కదా, మరి నాలుగే ఎందుకు? ఇది కేవలం డిజైన్ అనుకుంటే పొరపాటే.. దీని వెనుక బలమైన శాస్త్రీయ సాంకేతిక కారణాలు ఉన్నాయి.

మగవారి చొక్కాలకు ఒకవైపు, ఆడవారి చొక్కాలకు మరోవైపు బటన్లు ఉండటం వెనుక కూడా వందల ఏళ్ల చరిత్ర ఉంది. మనం నిత్యం చూసే చిన్న వస్తువుల వెనుక కూడా ఎంతో పరిశోధన, చరిత్ర దాగి ఉంటాయి. చొక్కా బటన్ల నాలుగు రంధ్రాల కథ కూడా అలాంటిదే. వచ్చేసారి మీరు చొక్కా వేసుకునేటప్పుడు ఈ ఆసక్తికరమైన విషయాలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి! మనం చిన్నవిగా భావించే ఈ గుండీల వెనుక ఉన్న ఆసక్తికరమైన కథాకమీమామిషు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పట్టుత్వం :
బటన్‌కు నాలుగు రంధ్రాలు ఉన్నప్పుడు, దారం ‘X’ ఆకారంలో లేదా సమాంతరంగా ఎక్కువ సార్లు తిరుగుతుంది. దీనివల్ల బటన్ బట్టకు మరింత గట్టిగా అతుక్కుంటుంది. రెండు రంధ్రాలు ఉన్న బటన్ కంటే నాలుగు రంధ్రాలు ఉన్న బటన్ అంత త్వరగా ఊడిపోదు.
2. సులభంగా కుట్టడం:
మెషిన్లతో బటన్లు కుట్టేటప్పుడు నాలుగు రంధ్రాలు ఉండటం వల్ల బటన్ బ్యాలెన్స్ తప్పకుండా ఉంటుంది. ఇది బట్టపై స్థిరంగా కూర్చుని, కుట్టు వేసేటప్పుడు అటు ఇటు కదలకుండా సహాయపడుతుంది.
3. సౌందర్యం :
కేవలం ఉపయోగమే కాకుండా, నాలుగు రంధ్రాల గుండా దారం వెళ్లే విధానం చూడటానికి అందంగా ఉంటుంది. ఫ్యాషన్ డిజైనర్లు దుస్తుల రూపాన్ని మెరుగుపరచడానికి ఈ డిజైన్‌ను ఎక్కువగా ఇష్టపడతారు.
మగవారికి కుడి.. ఆడవారికి ఎడమ.. ఎందుకు?
చొక్కా బటన్ల అమరికలో స్త్రీ, పురుషుల మధ్య తేడా ఉండటం వెనుక ఒక చారిత్రక కారణం ఉంది. పూర్వ కాలంలో మహిళలు పాలిచ్చేటప్పుడు తమ పిల్లలను ఎడమ చేత్తో పట్టుకునేవారు. ఆ సమయంలో కుడి చేత్తో బటన్లను సులభంగా తెరవడానికి వీలుగా ఎడమ వైపున బటన్లను అమర్చేవారు. మగవారికి మాత్రం కుడి చేత్తో పని చేయడం సులభంగా ఉండటానికి కుడి వైపున బటన్లు ఉంటాయి.
చొక్కా ఒకప్పుడు లగ్జరీ!
మీకు తెలుసా? 13వ శతాబ్దంలో చొక్కా ధరించడం అంటే అది ఒక పెద్ద హోదాకు చిహ్నం. అప్పట్లో చొక్కాలు కొనడం సామాన్యులకు అందనంత దూరంలో ఉండేది. కాలక్రమేణా టెక్నాలజీ పెరగడంతో చొక్కాలు మరియు బటన్లు మన దైనందిన జీవితంలో అంతర్భాగమయ్యాయి.
