అభిమాన టీచర్ మృతితో తల్లడిల్లిన పసి హృదయాలు.. చిన్నారులను ఓదార్చడం ఎవరి తరం..!
ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. తమను రోజూ పలకరించే నేస్తం కనిపించలేదనీ, ఆప్యాయంగా దగ్గరకు తీసుకునే సారూ రాలేదని చిన్నారులు వెక్కివెక్కి ఏడ్చారు. తమను కన్న బిడ్డల మాదిరిగా చూసుకునే సారు ఇక లేరని తెలుసుకున్న పసి హృదయాలు తల్లడిల్లి పోయాయి. సారూ.. సారూ.. అంటూ చిన్నారుల రోదన అందరినీ కన్నీరు పెట్టించింది.
ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. తమను రోజూ పలకరించే నేస్తం కనిపించలేదనీ, ఆప్యాయంగా దగ్గరకు తీసుకునే సారూ రాలేదని చిన్నారులు వెక్కివెక్కి ఏడ్చారు. తమను కన్న బిడ్డల మాదిరిగా చూసుకునే సారు ఇక లేరని తెలుసుకున్న పసి హృదయాలు తల్లడిల్లి పోయాయి. సారూ.. సారూ.. అంటూ చిన్నారుల రోదన అందరినీ కన్నీరు పెట్టించింది. పసి హృదయాలను కలచివేసిన హృదయవిదారక ఘటన నల్లగొండ జిల్లాలో చోటు చేసుకుంది.
గురు శిష్యుల బంధం ఎంతో పవిత్రమైంది. విద్యార్థులను కన్న బిడ్డల వలె చూసుకోవాల్సిన బాధ్యత గురువులపై ఉంటుంది. ఈ బాధ్యతను ఓ గురువు నిర్వర్తించాడు. ఆ గురు శిష్యుల బంధమే పసి హృదయాలను తల్లడిల్లేలా చేసింది. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని మున్సిపాలిటీ వద్ద మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో హడ్మాస్టర్ సత్యనారాయణతోపాటు టీచర్ బచ్చుపల్లి శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. ఐదేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరావు అనే ఉపాధ్యాయులు అంటే విద్యార్థులకు ఎనలేని అభిమానం.
పాఠశాలకు వచ్చే చిన్నారుల పట్ల శ్రీనివాసరావు ప్రేమాభిమానాలు చాటుకునే వారు. విద్యార్థులను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. పిల్లలు అల్లరి చేసినా కోపగించుకోకుండా దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలకరిస్తూ పాఠాలు బోధించేవారు. నిత్యం పాఠశాలకు రావాలని చెప్పే టీచర్ శ్రీనివాస్ రావు విద్యార్థులతో కలుపుగోలుగా ఉండేవాడు. అయితే తమ అభిమాన టీచర్ శ్రీనివాసరావు పాఠశాలకు రాకపోవడంతో పిల్లలంతా ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే టీచర్ శ్రీనివాస రావు అనారోగ్యంతో చనిపోయాడనీ పాఠశాల హెడ్మాస్టర్ చెప్పాడంతో పిల్లలంతా ఒక్కసారిగా బోరుమని ఏడ్చేశారు. తమ అభిమానాన్ని చూరగొన్న శ్రీనివాసరావు సారు ఇక లేరని తెలుసుకున్న పసి హృదయాలు తల్లడిల్లి పోయాయి. టీచర్ శ్రీనివాసరావు ను గుర్తు చేసుకుంటూ విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు.ఆయన బీరువాలో ఎప్పుడూ చాక్లెట్స్ ఉండేవని, తాము ఏడ్చినప్పుడు ఇచ్చి బుజ్జగించేవారని విద్యార్థులు చెబుతున్నారు. ఎంత అల్లరి చేసిన తమను కొట్టేవాడు కాదని సున్నితంగా మాత్రమే మందలించేవాడని విద్యార్థులు వాపోయారు.
శ్రీనివాసరావు సారు కోసం రోదిస్తున్న చిన్నారులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. తల్లడిల్లిన పసి హృదయాలను పాఠశాల హెడ్మాస్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యే సతీమణి వేముల పుష్ప ఓదార్చారు. శ్రీనివాసరావు అంతిమయాత్రలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్న అశ్రునివాళులు అర్పించారు. శ్రీనివాసరావు మృతదేహం వద్ద ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిలు నివాళి అర్పించగా, అంత్యక్రియలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…