Telangana: చేనేత కార్మికుడు కళా నైపుణ్యానికి నిదర్శనం.. రంగులకే వన్నె తెచ్చిన అద్భుతమైన పట్టుచీర..!
చేనేత కళాకారుల నైపుణ్యానికి.. వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి. ఇక్కడ చేనేత కార్మికులు నేసిన ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది.
మగువలు మెచ్చే పట్టు చీరలకు నిలయం.. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యానికి ప్రతీక పోచంపల్లి చేనేత వస్త్రాలు. ఇక్కడి కళాకారులు నేసిన వస్త్రాలు అంతర్జాతీయ స్థాయిలో తళుకులీనుతున్నాయి. ఏడు రంగుల హరివిల్లు వర్ణాలను చూస్తూ విస్తు పోతుంటాం.. అలాంటిది చేనేత ఇక్కత్ వస్త్రాన్ని పదివేల రంగుల షేడ్స్‌తో మగ్గంపై నేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు నేత కార్మికుడు. కొత్తగా శాలువాపై పదివేల రంగుల డిజైన్లతో ఇండియా మ్యాప్‌ను ఆవిష్కరించి అందరినీ అబ్బుర పరుస్తున్నారు. తన సృజనాత్మకతతో ‘సంత కబీర్’ పురస్కారాన్ని పొందారు.
చేనేత కళాకారుల నైపుణ్యానికి.. వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరు యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి. ఇక్కడ చేనేత కార్మికులు నేసిన ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. ఈ వస్త్రాలు ఫ్యాషన్ ప్రియులు, డిజైనర్లను ఆకట్టుకుంటాయి. ప్రకృతి సహజ సిద్ధంగా లభించే రంగులను వస్త్రాల తయారీలో వినియోగిస్తారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన చేనేత దంపతులు భోగ బాలయ్య, సరస్వతీ వినూత్న ఆవిష్కరణకు పెట్టింది పేరు. చేనేత రంగంలో సాంప్రదాయ పద్ధతులను పాటిస్తూనే, కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇక్కత్ వస్త్రాల తయారీలో వినూత్న ప్రయోగాలు చేస్తున్న ఈ దంపతులు మరో అద్భుతమైన వస్త్ర కళాఖండాలను రూపొందించారు.
పదివేల రంగుల షేడ్స్ తో ఇక్కత్ వస్త్రం…
సాంప్రదాయ చేనేత వస్త్రాల తయారీలో కొన్ని రంగులు మాత్రమే వాడుతుంటారు. కానీ బాలయ్య నేసిన ఇక్కత్ వస్త్రంపై ఒకటి కాదు రెండు కాదు పదివేల రంగులు వాడటం చాలాఅరుదు. డబుల్ ఇక్కత్ వస్త్రంపై పదివేల రంగుల షెడ్స్ వచ్చేలా చేనేత వస్త్రాన్ని బాలయ్య దంపతులు నేశారు. పర్యావరణహితమైన (వ్యాట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ) రంగులను ఉపయోగించి సుమారు 100 పూక చిటికీలు, 100 నిలువు చిటికీలను రూపొందించి అందులో పదివేల రంగులు వచ్చే విధంగా వివిధ రకాల షేడ్‌లను అద్ది తన చేనేత కళా ప్రతిభ ద్వారా పోచంపల్లి పట్టు చీరలు రూపొందించారు. అంతేగాక ఈ పట్టు చీరలు రెండు కొంగులు ఉండే విధంగా రూపొందించడం మరొక విశేషం. 11 నెలల పాటు ఈ దంపతులు శ్రమించి ప్రత్యేక చీర తయారు చేశారు. సుమారుగా ముడి సరుకు, నూలు, రంగులు, రసాయనాలు తదితర ఖర్చులతో కలిపి కేవలం వస్త్ర తయారీకి సుమారు లక్ష రూపాయలు ఖర్చు చేశారు. బాలయ్య గతంలో 1,400 రంగులలో చీర నేశారు. ఒక చీరలో 121 రంగులు, 121 వివిధ ఆకృతులతో మగ్గంపై చీర చేశారు.
డబుల్ ఇక్కత్ వస్త్రంపై ఇండియా మ్యాప్..!
బాలయ్య దంపతులు మగ్గంపై డబుల్ ఇక్కత్ విధానంలో రుమాలు(స్కార్ప్)పై ఇండియా మ్యాప్ నేసి అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆజాదీ కా అమృత మహోత్సవాలను పురస్కరించుకుని తన దేశభక్తి చాటేందుకు బాలయ్య ఇండియా మ్యాప్, మధ్యన చరఖా రాట్నం వచ్చేట్లుగా స్కార్ప్ నేశారు. ఇందుకోసం మృదువుగా ఉండే ప్రత్యేకమైన నూలు, పర్యావరణ హితమైన పదివేల రంగులను వినియోగించారు. ఏకంగా పదివేల రంగుల (షేడ్స్)తో కూడిన షేడ్స్‌తో అద్భుతమైన డిజైన్లు రూపొందించారు. 46/46 అడుగుల సైజులో పదివేల రంగుల షేడ్స్‌తో కాటన్ ఇక్కత్ వస్త్రాన్ని తయారు చేశారు. సాంప్రదాయ చేనేత వస్త్రాల్లో ఇన్ని రంగులు వాడటం చాలాఅరుదు. అయినా సరే బోగ బాలయ్య సాహసం చేశాడు. రెండేళ్లుగా తాను అనుకున్న విధంగా కష్టపడి మగ్గంపై నేసిన వస్త్రంపై రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించారు.
జాతీయ అవార్డు లక్ష్యంః బాలయ్య
ఇప్పటికే బాలయ్య దంపతులు రాష్ట్ర ప్రభుత్వం సంత కబీర్ అవార్డుతో పాటు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును అందుకున్నారు. వినూత్నమైన వస్త్ర తయారీతో పదివేల వర్ణ చిత్రాలతో రూపొందించిన ఇక్కత్ స్కార్ప్‌కు మరింత గుర్తింపు లభించేందుకు కృషి చేస్తున్నాని బాలయ్య చెబుతున్నారు. ఈ వినూత్నమైన ఆవిష్కరణతో జాతీయస్థాయిలో గుర్తింపు సాధించాలనేది నా కోరిక. నా కష్టానికి తగిన గుర్తింపు వస్తుందనే నమ్మకంతో ఉన్నానని బాలయ్య అంటున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..