Kumki Elephants: కఠోర శిక్షణ.. వెనక్కి తిరిగి వస్తేనే విజయం.. కుంకీ ఏనుగులను ఎలా తయారు చేస్తారో తెలుసా?
గ్రామాల్లోకి చొచ్చుకొచ్చి బీభత్సం సృష్టిస్తున్న గజరాజుల గుంపునకు అడ్డుకట్ట వేసేందుకు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు రానున్నాయి. ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన ఈ ఏనుగులు అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగులను మచ్చిక చేయడంలో, వాటిని తిరిగి అడవిలోకి పంపించడంలో, అలాగే మదపుటేనుగులను శాంతింపజేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. కుంకీ ఏనుగులను పట్టుకునే విధానం మొదలుకొని వాటికి శిక్షణ ఇవ్వడం, ఆపై వాటిని ఆపరేషన్లలో ఉపయోగించడం వంటి ప్రతి అంశం ఆసక్తికరంగా ఉంటుంది.

అడవుల్లో సంచరించే ఏనుగుల సమూహం నుండి వేరుపడిన, కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగిన మగ ఏనుగులను గుర్తిస్తారు. వీటిని బంధించేందుకు తక్కువ వయస్సు ఉన్న వాటినే ఎక్కువగా ఎంపిక చేస్తారు. అయితే, ఇటీవల కేరళలో ఒక ఆడ ఏనుగును కూడా కుంకీగా మార్చారు. ఇలా పట్టుకున్న ఏనుగులకు శిక్షణ ఇస్తారు. వాటిని గుర్తించడానికి ప్రత్యేకమైన పేర్లు కూడా పెడతారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. మైసూరు దసరా వేడుకల్లో పాల్గొనే ఏనుగులు కూడా ఈ తరహాకు చెందినవే.
శిక్షణ అనంతరం అడవిలోకి:
అటవీ ప్రాంతాల నుంచి పట్టుకొచ్చిన గజరాజులను శిక్షణ శిబిరాలకు తరలిస్తారు. అక్కడ వాటిని ప్రత్యేకమైన కంచెల్లో ఉంచుతారు. మొదటగా ఏనుగులను ప్రశాంతంగా ఉండేలా చూస్తారు. వాటి ప్రవర్తనను బట్టి నెమ్మదిగా శిక్షణ ప్రారంభిస్తారు. తొలుత మావటీలు వాటి దగ్గరకు చేరుకొని వివిధ రకాల సంజ్ఞలను వాటికి అలవాటు చేస్తారు. అలా అలవాటయ్యాక చిన్న చిన్న ఆదేశాలు ఇవ్వడం మొదలుపెడతారు. ఆ ఆదేశాలను పాటిస్తే చెరకు, బెల్లం వంటివి అందిస్తూ వాటిని మచ్చిక చేసుకుంటారు. దీంతో క్రమంగా మావటీలకు, ఏనుగులకు మధ్య బలమైన అనుబంధం ఏర్పడుతుంది.
వెనక్కి వస్తేనే కుంకీ ఏనుగులు..
ఆ తర్వాత కుంకీ ఏనుగులను కంచె నుంచి బయటకు తీసుకొచ్చి అటవీ ప్రాంతాల్లోకి తీసుకెళ్తారు. అక్కడ అడవి ఏనుగులు వీటిని చూసి ఎలా స్పందిస్తున్నాయి? వాటి ప్రవర్తన ఎలా ఉంది? వంటి విషయాలను పరిశీలించి తిరిగి తీసుకొస్తారు. శిక్షణలో ఈ ముఖ్యమైన దశ దాటాక వాటిని ఒంటరిగా అడవిలో వదిలేస్తారు. అవి తమంతట తామే శిక్షణ శిబిరానికి తిరిగి వస్తే, అవి పూర్తిగా కుంకీ ఏనుగులుగా మారినట్లే భావిస్తారు. వైద్యులు, అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో దాదాపు మూడు సంవత్సరాల పాటు ఈ కఠినమైన శిక్షణ కొనసాగుతుంది.
ఏపీలోనే శిక్షణ కేంద్రం:
ఆంధ్రప్రదేశ్‌లో 2006లో కుంకీ ఏనుగుల శిక్షణ శిబిరం ఏర్పాటైంది. కుప్పం అటవీ డివిజన్ పరిధిలోని ననియాలలో దీనిని స్థాపించారు. వినాయక్, జయంత్ అనే రెండు కుంకీ ఏనుగులు ఇక్కడ ఉండేవి. దాదాపు 17 సంవత్సరాల పాటు అవి సేవలు అందించాయి. ప్రస్తుతం అవి వృద్ధాప్యం కారణంగా సేవలు అందించే స్థితిలో లేవు. దీంతో త్వరలోనే ఈ ఏనుగులు ఏపీకి రానున్నాయి. వాటికి శిక్షణ ఇచ్చిన మావటీలు కూడా వాటితో పాటు రానున్నారు.
చెవిపై తన్నినా, తలపై తట్టినా ఒక సూచన:
కుంకీ ఏనుగులకు ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో నేర్పుతారు. మావటీలు వాటి చెవిని కాలుతో తాకితే ముందుకు వెళ్లమని అర్థం. చెవి వెనుక భాగాన్ని గట్టిగా తాకితే వెనక్కి వెళ్లమని సూచన. చెవి మధ్య భాగాన్ని తాకితే అక్కడే ఆగిపోవాలని అర్థం. ఆ తర్వాత అడవి ఏనుగులను ఎలా ఎదుర్కోవాలో కూడా సంకేతాల ద్వారా నేర్పుతారు. మావటీల ఆదేశాలకు అనుగుణంగా ఇవి ప్రవర్తిస్తాయి. అటవీ ఏనుగులను తరిమే ఆపరేషన్లలో కుంకీ ఏనుగులకు మావటీలు ఇచ్చే ఆదేశాలే కీలకం. అందుకే ఈ శిక్షణ ప్రత్యేకంగా ఉంటుంది.
దూసుకొచ్చే ఏనుగులను తరిమికొట్టేస్తాయి:
ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం, విజయనగరం, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగులు, మనుషుల మధ్య ఘర్షణ తీవ్రంగా ఉంది. ఏనుగులు జనావాసాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయని పీసీసీఎఫ్ చిరంజీవి చౌదరి తెలిపారు. దీనివల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతోందని చెప్పారు. జనావాసాల్లోకి వచ్చే అటవీ ఏనుగులను తరిమికొట్టే ఆపరేషన్లలో కుంకీ ఏనుగులను ఉపయోగిస్తారని ఆయన పేర్కొన్నారు. అవసరమైతే వీటిని ఉపయోగించి అటవీ ఏనుగులను పట్టుకుంటారని ఆయన వెల్లడించారు.
