Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithyananda: చావు వదంతులతో వార్తల్లో నిత్యానంద.. ఆయన ఆస్తుల విలువ ఎంతో తెల్సా..?

నిత్యానంద.. చాలా మందికి పరిచయం అక్కర్లేని పేరు. గతంలో రాసలీలల వీడియోలతో సెన్సేషన్ సృష్టించిన ఈ వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు మృతి చెందారంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణ త్యాగం చేశారంటూ ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ తమిళ మీడియాతో చెప్పారు. దీంతో సోషల్ మీడియా అంతటా నిత్యానంద గురించే చర్చ నడుస్తోంది. తాజాగా ఈ వదంతులపై స్పందించిన కైలాస దేశం.. అదంతా ఉత్తదేనని ప్రకటించింది. నిజానికి నిత్యానంద చనిపోయాడని వార్తలు రావడం ఇదే మొదటిసారికాదు. 2022లోనూ ఇలాంటి వదంతులు వచ్చాయి. ఈ రూమర్స్పై స్పందించిన నిత్యానంద జీవసమాధిలో ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఎవరీ నిత్యానంద..? ఇండియా వదలి ఎందుకు పారిపోయాడు..? అసలు ఆ కైలాస దేశం సంగతేంటి..?

Nithyananda: చావు వదంతులతో వార్తల్లో నిత్యానంద.. ఆయన ఆస్తుల విలువ ఎంతో తెల్సా..?
Nithyananda
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 02, 2025 | 4:26 PM

వివాదాల స్వామీజీ.. కైలాస దేశ ప్రధాని.. నిత్యానంద.. అలియాస్ నిత్యానంద పరమహంస. స్వయం ప్రకటిత గురువైన ఆయన అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్‌. నిత్యానంద ధ్యానపీఠ స్థాపన మొదలు కైలాస దేశ ఏర్పాటు వరకు ఆయన జీవితంలో జరిగినవన్నీ సంచలనాలే.. అంతకు మించిన వివాదాలే. 1978 జనవరి 1న తమిళనాడులోని తిరువన్నామలైలో జన్మించారు నిత్యానంద. తండ్రి అరుణాచలం, తల్లి లోకనాయకి. ఆయనను నిత్యానంద పరమశివం, నిత్యానంద పరమహంస అనే పేర్లతోనూ పిలుస్తుంటారు. తనకు 12వ ఏటనే జ్ఞానోదయం అయినట్లు చెప్పుకుంటారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించేందుకు 17 ఏళ్ల వయసులో ఇంటిని విడిచిపెట్టారు. నిత్యానంద చదువు విషయానికొస్తే.. ఆయన అధికారిక వెబ్సైట్ ప్రకారం 1992లో స్కూలింగ్, ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లోమా పూర్తి చేశారు.

1995లో చెన్నైలోని రామకృష్ణ మఠంలో సన్యానంలో చేరిన నిత్యానంద.. ఆధ్యాత్మిక సభల్లో భక్తులకు బ్రహ్మసూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు, భగవద్గీత తదితర గ్రంథాలపై ఉపన్యాసాలు ఇచ్చేవారు. 24 ఏళ్ల వయసులో స్వామి అవతారం ఎత్తిన నిత్యానంద.. 2003 జనవరి 1న కర్ణాటక బెంగళూరు సమీపంలోని బిదారిలో ధ్యానపీఠం ప్రారంభించారు. ఆ పేరుతో దేశ విదేశాల్లో గురుకులాలు, ఆశ్రమాలు స్థాపించారు. ధ్యానపీఠంలో ప్రవచనాలు చెబుతూ నిత్యానంద బాగా పేరు సంపాదించారు. వేలాది మంది విదేశీయులు కూడా ఆయనకు భక్తులుగా మారారు. బ్రహ్మసూత్ర, పతంజలి, యోగసూత్ర, శివసూత్ర వంటి వాటిపై నిత్యానంద ఇచ్చే ఉపన్యాసాలకు ఎంతో మంది ప్రభావితులయ్యారు. ప్రస్తుతం నిత్యానంద ధ్యానపీఠం నిర్వహించే ధార్మిక కార్యక్రమాలు దాదాపు 47 దేశాల్లో ప్రాచుర్యం పొందాయి.

స్వామి నిత్యానంద చేసిన ప్రసంగాల్లో చాలా వరకు వివాదాస్పదమయ్యాయి. కోతులు, మరికొన్ని జంతువులకు తాను సంస్కృతం, తమిళం మాట్లాడటం నేర్పిస్తున్నానంటూ చెప్పడం, ఆల్బర్ట్ ఐన్ స్టీన్ సిద్ధాంతాలను సవాల్ చేయడంపై గతంలో చాలా ట్రోల్స్ వచ్చాయి. బెంగళూరులో సూర్యుడిని దాదాపు 40 నిమిషాల దాక ఉదయించకుండా అడ్డుకున్నానంటూ నిత్యానంద చెప్పిన ఓ వీడియో అప్పట్లో వైరల్ అయింది. వందల వేల సంవత్సరాల క్రితమే చాలా గ్రహాలపై జీవం ఉందని.. గ్రహాంతరవాసులంతా ఎడ్యుకేషనల్ టూర్ కోసం భూగ్రహానికి వస్తుంటారంటూ చేసిన కామెంట్లు కూడా బాగానే ట్రోల్ అయ్యాయి.

నిత్యానందకు 22 భాషలు వచ్చట. 22 భాషల్లో 500లకుపైగా పుస్తకాలు రాశారని ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. నిత్యానంద ఫ్లోరిడాలోని హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాకు 2007లో ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. 2012లో వాటికన్స్ మైండ్, బాడీ, స్పిరిట్ మ్యాగజైన్లు నిత్యానందను 100మంది ఆధ్యాత్మిక ప్రతిభావంతులైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తించాయి. అదే ఏడాది మధురై 293వ పీఠాధిపతిగా నిత్యానంద ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 2013లో పంచాయతీ మహా నిర్వాణి అకాఢ కార్యక్రమంలో ఆయనకు మహా మండలేశ్వర్ బిరుదును ప్రదానం చేశారు. నిత్యానంద ధ్యానపీఠం నిర్వహించే కార్యక్రమాల్లో రెండు… గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లోనూ చోటు సంపాదించాయి. అందులో ఒకటి అతిపెద్ద రోప్ యోగా క్లాస్ కాగా, మరొకటి అతి పెద్ద పోల్ యోగా క్లాస్.

స్వామీజీగా వివిధ దేశాల్లో భక్తులను సంపాదించుకున్న నిత్యానందకు 2010 తర్వాత కాలం కలిసిరాలేదు. అనేక వివాదాలు చుట్టుముట్టాయి. నిత్యానందపై పలు కోర్టుల్లో అత్యాచారం, అపహరణ కేసులు దాఖలయ్యాయి. చాలా కేసుల్లో ఆయన కోర్టుకు కూడా హాజరయ్యారు. అయితే 2010లో లీకైన శృంగార వీడియో టేప్ ఆయన జీవితాన్ని మార్చేసింది. ఓ నటితో కలిసి ఆయన రాసలీలలు సాగిస్తున్నట్లుగా అందులో ఉంది. ఆ వీడియోలు అప్పట్లో వైరల్‌గా మారాయి. అయితే దానిపై స్పందించిన నిత్యానంద అందులో తాము శవాసనం సాధన చేస్తున్నామని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఈ కేసు ఓ సంచలనంగా మారింది. తరువాత కొన్ని రోజులకు ఈ కేసులో బెయిల్‌ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. 2019లో నిత్యానందపై అహ్మదాబాద్‌లో మరో కేసు నమోదైంది. మైనర్‌ బాలికలను ఆశ్రమంలో నిర్బంధించి వేధిస్తున్నారని కొందరు ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసులో ఇరుక్కున్న తర్వాత తన మనుగడ కష్టమని భావించిన నిత్యానంద తట్టాబుట్టా సర్దుకొని దేశం విడిచి పారిపోయారు.

దేశం విడిచి పారిపోయిన తర్వాత కొన్నాళ్ల వరకు నిత్యానంద ఎక్కడున్నారో ఎవరికీ తెలియలేదు. రెండేళ్ల క్రితం అనూహ్యంగా మళ్లీ తెరపైకి వచ్చారు. ఒకప్పుడు కర్ణాటకలో ఆశ్రమం స్థాపించి లీలలు ప్రదర్శించిన స్వామి నిత్యానంద.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన భక్తుల కోసం ఓ దేశాన్నే సృష్టించినట్లు ప్రకటించారు. 2019లో తాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని స్థాపించానంటూ సంచలన ప్రకటన చేశారు.. దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ ఐలాండ్లో ఆ దేశం ఉందని చెప్పారు. అదో హిందూ దేశమని, ప్రత్యేక వెబ్ సైట్ కూడా రూపొందించారు. కైలాస దేశాన్ని గుర్తించాలని కోరుతూ నిత్యానంద ఐక్యరాజ్యసమితికి విన్నపాలు కూడా చేశారు. ప్రపంచంలో హిందూ దేశాలు తగ్గుతున్నాయని.. అందుకే తాను ప్రత్యేకంగా హిందూ దేశాన్ని సృష్టించానన్నది నిత్యానంద చెప్పేమాట.

కైలాస దేశ పౌరసత్వం పొందాలంటే ఆషామాషీ కాదు.. ఇందుకోసం భారీగా విరాళాలు ఇవ్వాలట. రిపబ్లిక్‌ ఆఫ్‌ కైలాసలో అడుగుపెట్టాలంటే దానికి అక్కడి ప్రధాని, కేబినెట్‌ అనుమతి తప్పనిసరి. నిత్యానంద భక్తులై ఉండి ఆయనకు విరాళాలు ఇచ్చిన వారికి మాత్రమే ఆ కంట్రీలోకి ఎంట్రీ ఉంటుంది. నిత్యానంద ప్రకటించుకున్న దేశంలో పలు మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి. అందులో జ్ఞానోదయ నాగరికత విభాగం ఒకటి. సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఈ శాఖ ఏర్పాటు చేశారట. ఇక రిపబ్లిక్ ఆఫ్ కైలాసకు ప్రత్యేక జెండా ఉంది. దాన్ని రిషభధ్వజ అని పిలుస్తారు. కైలాస దేశ జాతీయ జంతువు నంది, పక్షి శరభం, ఇంగ్లిష్‌, సంస్కృతం, తమిళంను ఆ దేశ అధికారిక భాషలుగా ప్రకటించారు. ప్రపంచంలో ఎవరైనా స్వేచ్ఛగా హిందూ మతాన్ని ఆచరించడానికి అడ్డంకులు ఎదురైతే.. అలాంటి వారు కైలాసానికి రావచ్చని నిత్యానంద గతంలోనే పిలుపునిచ్చారు.

కైలాస దేశంలోని భూముల ధరలు అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా నిర్ణయించారు. అంతేకాదు.. నిత్యానంద తన సొంతంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా స్టార్ట్ చేశారు. ఈ దేశానికి ప్రత్యేకంగా కరెన్సీ కూడా ఉంది. ఇది చెల్లుబాటయ్యేలా కొన్ని దేశాలతో ఒప్పందం కూడా చేసుకున్నారు. కైలాసలో అన్ని దేశాల కరెన్సీలు చెల్లుబాటు అవుతాయి. ఆ దేశ వెబ్ సైట్ ప్రకారం కైలాసలో ప్రస్తుతం 2 బిలియన్లు అంటే.. 200 కోట్ల మంది హిందువులు ఉన్నారట. నిత్యానంద శిష్యుల్లో చాలా మంది కోటీశ్వరులున్నారు. వారే ఆయనకు ఈ దీవిని కొనుగోలు చేసి ఇచ్చారని చెబుతుంటారు. కైలాస ఏర్పడిన తొలినాళ్లలో అహ్మదాబాద్ కు చెందిన కొందరు ప్రముఖులు తమ వ్యాపారాలను వదిలి ఆ దీవికి వెళ్లేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు వచ్చాయంటే ఆయన ప్రభావం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి నిత్యానంద ప్రాణ త్యాగం చేశారన్న మాట ఒక్కసారిగా చర్చకు దారితీసింది. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదని తేలినా.. ఆయన పేరు మాత్రం ఇంటర్నెట్ లో మారుమోగుతోంది. కాగా ప్రపంచవ్యాప్తంగా దేవాలయాలు, గురుకులాలు, ఆశ్రమాలను కలిగి ఉన్న నిత్యానంద నికర విలువ ఆస్తుల విలువ దాదాపు రూ 10,000 కోట్లు (సుమారు $1.2 బిలియన్ USD) ఉంటుందని అంచనా.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..