అడ్డూఅదుపు లేని సోషల్ మీడియా బజ్.. జనం చావులకు కారణమవుతోందా?
సోషల్ బాకా...చావు కేక అన్నట్లు మారింది సిట్యువేషన్. చెన్నై ఎయిర్ షో తొక్కిసలాటకు కారణం ఎవరు? సోషల్ మీడియా వైపే వేళ్లు చూపిస్తున్నాయి. దేవర సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ రభసకు, ఈవెంట్ కేన్సిల్ అవడానికి కారణం ఎవరు? మళ్లీ సోషల్ మీడియా వైపే వేళ్లు చూపిస్తున్నాయి. ఇక చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో తొక్కిసలాటకు కారణం ఎవరు? మళ్లీ అదే సోషల్ మీడియానే కారణం అంటున్నారు. సోషల్ బజ్...చావులకు కారణమవుతోందా? మరో రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా మర్డర్లు చేస్తోందా?
ఆదివారం నాడు చెన్నై మెరీనా బీచ్‌లో జరిగిన ఎయిర్ షోపై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. దీంతో లక్షల్లో జనం తరలివచ్చారు. ఫలితం…రైల్వే స్టేషన్‌లో భారీ తొక్కిసలాట జరిగి ఐదుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. దీనికి అధికార పార్టీ సరైన ఏర్పాట్లు చేయకపోవడమే కారణమంటూ అక్కడి ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఈ విషాదం కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. అసలు విషయం ఏంటంటే ఈ ఎయిర్ షో గురించి సోషల్ మీడియాలో మామూలు బాకాలు కాదు…బ్రహ్మాండం బద్దలయ్యే లెవెల్లో బాకాలు ఊదారు. జనం చెవులు చిల్లులు పడేలా ప్రచారం చేశారు. ఓ రేంజ్‌లో ఊదరగొట్టారు. అక్కడకు వెళ్లి చూడకపోతే మీ కళ్లు పాపం చేసినట్లే, మీరు నేరం చేసినట్లే అనే లెవెల్లో సోషల్ మీడియాలో ప్రచారాలు, ప్రసారాలు సాగాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్స్‌తో లక్షల సంఖ్యలో జనం…ఎయిర్ షోకు పరుగులు తీశారు. మాములుగా అయితే చెన్నై మహా నగరంలో దీన్ని పట్టించుకునే తీరిక కూడా ఎవరికీ ఉండదు. కానీ సోషల్ మీడియా బాకాలతో, అక్కడేదో బ్రహ్మాండం బద్దలవుతోందని, ఆలసించిన ఆశాభంగము అని పరుగులు తీశారు జనం. అంతమంది ప్రజలు వస్తారని నిర్వాహకులకు కూడా తెలియదు. ఆ తర్వాత అనర్థం జరిగిపోయింది. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ చావులకు కారణం సోషల్ మీడియాలో జరిగిన విపరీత ప్రచారమే అని అధికారులు ఆలస్యంగా గుర్తించారు.
దేవర ప్రి రిలీజ్‌లో కూడా ఇదే అత్యుత్సాహం
ఇక కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేశారు నిర్వాహకులు. 5 వేలమందికి పాస్‌లు కూడా ఇచ్చారు. ఆ హాల్లో అంతమందే పడతారు. ఇక దీనిపై సోషల్ మీడియాలో వేలంవెర్రిగా ప్రచారం జరగడంతో…ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేలల్లో తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి సొంత వాహనాల్లో వేలాదిగా వచ్చారు. 5 వేలమంది పట్టే హాల్లోకి 50 వేలమంది చొచ్చుకురావడంతో నానా రభస జరిగింది. దీంతో ఈవెంట్‌ను కేన్సిల్ చేశారు నిర్వాహకులు. ఆగ్రహం పట్టలేని అభిమానులు విధ్వంసం సృష్టించారు. దీనంతటికి కారణం ఎవరు? మళ్లీ సోషల్ మీడియానే దీనికి కారణమనే చర్చ జరుగుతోంది.
గరుడ ప్రసాదంతో సంతానం కలుగుతుందని ప్రచారం
ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గరుడ ప్రసాదం పంపిణీ చేస్తున్నారని, అది తింటే సంతానం కలుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో…వేలాది జంటలు తరలివచ్చాయి. అయితే ఇంతమంది వస్తారని తెలియని నిర్వాహకులు, పెద్దగా ఏర్పాట్లు చేయలేదు. ఆలయం లోపల జరిగిన తొక్కిసలాటలో ఊపిరి ఆడక పలువురు మహిళలు ఇబ్బందులకు గురయ్యారు. దీనితోడు వేలాదిమంది రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. దీనంతటికి కారణం ఎవరు అంటే…ఆ తప్పు సోషల్ మీడియాదే అంటున్నారు.
వ్యూల కోసం, క్లిక్కుల కోసం వార్తల్లో కిక్కు పెంచుతోంది సోషల్ మీడియా. గోరంత వార్తకు కొండంత ప్రచారం కల్పించడంతో అది నిజమేనని నమ్మేస్తున్నారు జనం. సోషల్ మీడియా విపరీత పోకడలు…విషాదాలకు దారితీస్తున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..