AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యువ రైతు వినూత్న ఆవిష్కరణ.. రైతులకు కాపలాదారుగా RBS సెన్సార్..!

ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికి వరకు అన్నదాతకు గ్యారెంటీ లేదు. ఒకవైపు ప్రకృతి.. మరోవైపు దొంగల భయం రైతన్నలను వెంటాడుతుంది. ప్రతి రైతు వ్యవసాయానికి అనుబంధంగా గొర్ల, మేకలు, కోళ్ల పెంపకం, ఇతర జీవరాసులని పెంచుతూ ఉంటారు.

యువ రైతు వినూత్న ఆవిష్కరణ.. రైతులకు కాపలాదారుగా RBS సెన్సార్..!
Rbs Sensor
Balaraju Goud
|

Updated on: Aug 20, 2024 | 11:26 AM

Share

ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికి వరకు అన్నదాతకు గ్యారెంటీ లేదు. ఒకవైపు ప్రకృతి.. మరోవైపు దొంగల భయం రైతన్నలను వెంటాడుతుంది. ప్రతి రైతు వ్యవసాయానికి అనుబంధంగా గొర్ల, మేకలు, కోళ్ల పెంపకం, ఇతర జీవరాసులని పెంచుతూ ఉంటారు. వీటిని రాత్రివేళ.. అడవి పందులు, జంతువులు, దొంగల నుంచి కాపాడుకోవడం కష్టంగా మారుతోంది. దొంగల బారి నుండి రైతులకు కాపలాదారుగా ఉపయోగపడేలా ఓ యువ రైతు వినూత్న ఆవిష్కరణ చేశారు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం తాళ్ల సింగారంకు చెందిన నరసింహ, శేషమ్మలకు ముగ్గురు సంతానం. చిన్న కొడుకు తొటకూర ప్రవీణ్ యాదవ్ చౌటుప్పల్ లోనే ఇంటర్మీడియట్ (సివిల్) ఒకేషనల్ చదివాడు. కుటుంబ ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడంతో ఇంటర్ వరకే చదివి ఉన్న కొద్దిపాటి వ్యవసాయాన్ని చేస్తున్నాడు. నిత్యం తన తండ్రితో పాటు గ్రామంలోని ఇతర రైతులు పడుతున్న కష్టాలను కళ్ళారా చూశాడు ప్రవీణ్. పంటలు చేతికి వచ్చే సమయంలో జంతువులు, దొంగల బారి నుంచి కాపాడుకోవడం రైతులకు కష్టంగా మారింది.

మరో వైపు వ్యవసాయ క్షేత్రాల వద్ద వ్యవసాయానికి అనుబంధంగా గొర్ల, మేకలు, కోళ్ల పెంపకం, ఇతర వ్యవసాయ సామాగ్రికి కాపలాగా రాత్రివేళ రైతులు ఉండాల్సి వస్తోంది. వ్యవసాయ క్షేత్రాల వద్ద రైతులు కాపలాగా లేకపోతే తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో రైతులు నష్టపోవడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోతోంది.

RBS సెన్సార్..

ఇలాంటి దొంగతనాలు నుండి రైతుల కష్టాలకు చెక్ పెట్టాలని ప్రవీణ్ భావించాడు. ఇందు కోసం తన నైపుణ్యానికి పదును పెట్టీ సెన్సార్ అనే పరికరాన్ని తయారు చేశాడు ప్రవీణ్. ఈ పరికరానికి రైతు భరోసా సెక్యూరిటీ (RBS)గా నామకరణం చేశాడు. 12 వాట్స్ సోలార్ ప్యానెల్, 12 వాట్స్ బ్యాటరీ, సిమ్ కలిగిన సాధారణ సెల్ ఫోన్, రెండు చిన్న సైజు అద్దాలు లేజర్ సెన్సర్లు ఏర్పాటు చేయడానికి రెండు రాడ్లు, సౌండ్ చేసేందుకు అలారం బాక్స్ ఉంటుంది. ఇది పూర్తిగా సోలార్ తో పనిచేస్తుంది. ఇందులో వినియోగించే సెల్ ఫోన్ కూడా ఆటోమెటిక్‌గా సోలార్ తోనే చార్జింగ్ అవుతుంది. ఇందులోని సెల్ ఫోన్లలో ముందుగానే సంబంధిత వ్యక్తుల సెల్ నంబర్లు ఫీడ్ చేయాల్సి ఉంటుంది.

RBS సెన్సార్ తో దొంగతనాలకు పుల్ స్టాప్

పంటలు, పౌల్ట్రీ, మేకలు, గొర్రెల మందలకు రక్షణ కల్పించేలా ప్రవీణ్.. RBS సెన్సార్ ను రూపొందించాడు. వ్యవసాయ క్షేత్రాల వద్ద RBS సెన్సార్ పరికరాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంతాల్లోకి ఒకవేళ జంతువులు, పశువులు, దొంగలు వస్తే సెన్సర్లు పెద్దగా సౌండ్ చేయడంతో పాటు సెన్సార్ కు అనుసంధానం చేసిన ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ వెళుతుంది. జంతువులు, గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి వచ్చారని రైతు అప్రమత్తం అయ్యే అవకాశం ఉంది. RBS సెన్సార్ ఎటూ కిలో మీటర్ దూరం వరకు పనిచేస్తుంది.

ఈ పరికరాన్ని ఎందుకు తయారు చేశానంటే…

పంట పొలాలను జంతువులు, దొంగలు నుంచి కాపాడుకోవడానికి రైతన్నలు పడుతున్న కష్టాలు ప్రవీణ్ ను కలచివేసింది. తమకున్న కోళ్ల ఫామ్ లోని కోళ్లను అడవిపిల్లి తినేస్తోంది. అడవి పిల్లి నుండి కోళ్లను కాపాడుకోవడం రాత్రివేళ ప్రవీణ్ కు కష్టంగా మారింది. అడవి పిల్లికి ఎలాగైనా చెక్ పెట్టాలని ఉద్దేశంతో అందుబాటులోని సామగ్రితో ఈ పరికరాన్ని తయారు చేసినట్లు ప్రవీణ్ చెబుతున్నాడు. ఈ పరికరాన్ని తయారు చేయడానికి పదివేల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయని అంటున్నాడు. ఈ పరికరం ఐదేళ్ల వరకు ఎటువంటి మరమ్మతులు కూడా అవసరం లేదని చెబుతున్నాడు. పంటలు, పౌల్ట్రీ, మేకలు, గొర్రెల మందలకు రక్షణ కల్పించడంతోపాటు ఇళ్లు, ఆలయాల్లో చోరీలను నివారించేందుకు కూడా ఈ పరికరం దోహదం చేస్తుందని ప్రవీణ్ చెప్పాడు. భువనగిరిలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ప్రవీణ్ ఈ పరికరాన్ని ప్రదర్శించాడు. ప్రవీణ్ ప్రయోగాన్ని మెచ్చిన అధికారులు అతనికి సర్టిఫికెట్ అందజేశారు. గతంలోనూ మ్యాజిక్ స్పేయర్, వాటర్ కంట్రోలర్స్ వంటి ఐదు రకాల పరికరాలు రూపొందించాడు.

ప్రభుత్వం చేయూతనిస్తే అద్భుతాలు సృష్టిస్తా: ప్రవీణ్

రైతులకు ఉపయోగపడే RBS సెన్సార్, మ్యాజిక్ స్ప్రేయర్, వాటర్ కంట్రోలర్స్ వంటి ఐదు రకాల పరికరాలను రూపొందించానని ప్రవీణ్ చెపుతున్నాడు. ప్రభుత్వం తనకు ఆర్థికంగా చేయూతనిస్తే రైతులకు ఉపయోగపడే మరిన్ని పరికరాలను సృష్టిస్తానని చెబుతున్నాడు. ఉన్నత చదువులు లేకుండానే రైతుల కోసం వినూత్న ఆవిష్కరణలు చేస్తున్న యువరైతు ప్రవీణ్ ను అన్నదాతలు అభినందిస్తున్నారు.