గెలాక్సీలో నక్షత్రాలు.. భూమిపై చెట్లు.. ఏవి ఎక్కువగా ఉన్నాయి? IAS క్వశ్చన్ కాదు.. కానీ!
భూమిపై ఉన్న చెట్ల సంఖ్య మన మిల్కీ వే గెలాక్సీలోని నక్షత్రాల కంటే ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తల అంచనాలు చెబుతున్నాయి. భూమిపై సుమారు 3.04 ట్రిలియన్ చెట్లు ఉండగా, పాలపుంత లో 100 నుంచి 400 బిలియన్ నక్షత్రాలు ఉన్నట్లు అంచనా.

భూమిపై మనం ఊహించలేనన్ని చెట్లు ఉన్నాయని తెలుసు. కానీ ఆ సంఖ్య మనం నివసిస్తున్న మిల్కీ వే గెలాక్సీలోని నక్షత్రాల సంఖ్య కంటే ఎక్కువ అంటే మాత్రం ఆశ్చర్యం కలగకమానదు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భూమిపై సుమారు 3.04 ట్రిలియన్ చెట్లు ఉండగా, మన పాలపుంతలో సుమారు 100 నుంచి 400 బిలియన్ నక్షత్రాలు ఉన్నట్లు అంచనా. అంటే కనిష్ఠ అంచనాను తీసుకున్నా భూమిపై చెట్లు నక్షత్రాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ.
భూమిపై ఎన్ని చెట్లు ఉన్నాయి?
2015లో నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా చెట్ల సంఖ్యను అంచనా వేసింది. యేల్ యూనివర్సిటీకి చెందిన థామస్ క్రౌథర్ నేతృత్వంలోని పరిశోధకులు 4 లక్షలకు పైగా భూమిపై సేకరించిన చెట్ల డేటా, ఉపగ్రహ చిత్రాలు, వివిధ పర్యావరణ ప్రాంతాల నమూనాలను ఉపయోగించారు. ఈ పరిశోధన ప్రకారం ప్రపంచంలో సుమారు 3.04 ట్రిలియన్ చెట్లు ఉన్నట్లు తేలింది. అంటే సగటున ఒక్కో మనిషికి దాదాపు 422 చెట్లు ఉన్నట్లుగా ఆ అధ్యయనం అంచనా వేసింది. అయితే చెట్లు ప్రపంచవ్యాప్తంగా సమానంగా విస్తరించి లేవు. ఉత్తర అమెరికా, రష్యా, స్కాండినేవియా వంటి ప్రాంతాల్లోని బోరియల్ అడవుల్లో చెట్ల సాంద్రత ఎక్కువగా ఉండగా, మొత్తం చెట్ల సంఖ్యలో ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాల వాటా భారీగా ఉంది.
మరి పాలపుంతలో ఎన్ని నక్షత్రాలు?
మన మిల్కీ వే గెలాక్సీ సుమారు 1 లక్ష కాంతి సంవత్సరాల వెడల్పుతో ఉన్న భారీ స్పైరల్ గెలాక్సీ. ఇందులో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఖచ్చితంగా లెక్కించడం చాలా కష్టం. కారణం.. మన సౌర కుటుంబం కూడా ఈ గెలాక్సీలోనే ఉండటం, దుమ్ము, వాయువు వంటి పదార్థాలు అనేక నక్షత్రాలను నేరుగా పరిశీలించకుండా అడ్డుకోవడం. అందుకే శాస్త్రవేత్తలు నమూనాలు, పరిశీలనల ఆధారంగా సంఖ్యను అంచనా వేస్తారు. నాసా ప్రకారం పాలపుంతలో సుమారు 100 నుంచి 400 బిలియన్ నక్షత్రాలు ఉండవచ్చు.
చెట్లు.. నక్షత్రాల కంటే ఎన్నో రెట్లు!
లెక్కలను పోల్చితే ఈ విషయం మరింత ఆసక్తికరంగా కనిపిస్తుంది. భూమిపై 3.04 ట్రిలియన్ చెట్లు ఉన్నాయని, పాలపుంతలో 100 బిలియన్ నుంచి 400 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయని తీసుకుంటే.. చెట్ల సంఖ్య పాలపుంత నక్షత్రాల సంఖ్య కంటే సుమారు 7.6 నుంచి 30 రెట్లు ఎక్కువ కావచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ రెండు సంఖ్యలు ఖచ్చితమైన లెక్కలు కావు.. శాస్త్రీయ అంచనాలు మాత్రమే. ముఖ్యంగా పాలపుంతలోని నక్షత్రాలను నేరుగా లెక్కించడం సాధ్యం కాదు. అలాగే ప్రపంచంలోని ప్రతి చెట్టును ఒక్కొక్కటిగా లెక్కించడం కూడా సాధ్యం కాదు.
అయితే 3 ట్రిలియన్‌కు పైగా చెట్లు ఉన్నప్పటికీ, వాటి సంఖ్య ఎప్పటికీ స్థిరంగా ఉండదు. 2015 అధ్యయనం ప్రకారం మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచంలోని చెట్ల సంఖ్య సుమారు 46 శాతం తగ్గినట్లు అంచనా వేశారు. ప్రతి సంవత్సరం 15 బిలియన్లకు పైగా చెట్లు నరికివేయబడుతున్నాయని కూడా ఆ పరిశోధన అంచనా వేసింది.
