Tirupati: తాళి కట్టించుకుని.. పసుపు బట్టలతోనే పరీక్ష కేంద్రానికి వచ్చిన నవ వధువు..!
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ విషయంలో చివరి క్షణం వరకూ ఉత్కంఠే.. ఎట్టకేలకు ఏపీపీఎస్సీ.. నో పోస్ట్‌పోన్ అనడంతో నేటి గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా జరుగుతుంది. గ్రూప్-2 మెయిన్స్‌కు 92,250 మంది అభ్యర్థుల కోసం ఏపీ వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉ.10 గంటల నుంచి మ.12:30 వరకు పేపర్-1, మ.3 గంటల నుంచి సా.5:30 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించారు.

తిరుపతిలో జరుగుతున్న ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల్లో ఆసక్తికరమైన దృశ్యం వెలుగు చూసింది. తిరుపతిలో 13 కేంద్రాల్లో జరుగుతున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పరీక్షకు హాజరైన ఒక యువతి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఏకంగా పట్టు బట్టలు, పెళ్లి కూతురుగా ముస్తాబై పరీక్ష రాయడానికి వచ్చింది. ఆమె చూసి అంతా షాక్ అయ్యారు.
తిరుపతిలో 5,801 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ సెంటర్ కు మమత అనే యువతి పెళ్లి పీటల నుంచి నేరుగా పరీక్షా కేంద్రానికి చేరుకుంది. పెళ్లయిన వెంటనే పెళ్ళి కూతురుగానే పసుపు దుస్తులతో పరీక్ష కేంద్రంలో అడుగు పెట్టింది.
చిత్తూరుకు చెందిన మమత వరుడుతో తాళి కట్టించుకుని తలపై జిలకర, బెల్లం పెట్టుకునే పూల జడతోనే పరీక్షకు హాజరైంది. పెళ్లయిన వెంటనే సమయం లేక పెళ్లి దుస్తులే ధరించి పరీక్ష రాసేందుకు వచ్చింది. హడావుడిగా పరీక్షా కేంద్రానికి చేరుకున్న మమతను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరోవైపు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. మరోవైపు పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ తనిఖీ చేశారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




