AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..? ఆసక్తికరమైన విషయాలు మీకోసం..!

నోటి ఆరోగ్యం గురించి చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది మొదటి మెట్టు. నోటి శుభ్రత కేవలం దంతాల రక్షణకే కాకుండా.. పేగుల ఆరోగ్యానికి కూడా కీలకం. సరైన దంత సంరక్షణ అలవాట్లు పాటించడం ద్వారా మన జీర్ణక్రియను, రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకోవచ్చు.

నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..? ఆసక్తికరమైన విషయాలు మీకోసం..!
Mouth Hygiene
Prashanthi V
|

Updated on: Jul 07, 2025 | 4:13 PM

Share

చాలా మంది గట్ హెల్త్ గురించి మాట్లాడేటప్పుడు ప్రొబయోటిక్స్, ఫైబర్, ఫర్మెంటెడ్ ఫుడ్స్ వంటి వాటిపై దృష్టి పెడతారు. కానీ జీర్ణక్రియ మన నోటిలోనే మొదలవుతుంది అన్న విషయం చాలా మందికి గుర్తుండదు. మన నోరు కేవలం ఆహారం ప్రవేశించే ద్వారం కాదు.. ఇది జీర్ణవ్యవస్థకు, రోగనిరోధక శక్తికి మొదటి రక్షణ గోడ లాంటిది.

నిర్లక్ష్యం చేయొద్దు..!

నోటి శుభ్రతను నిర్లక్ష్యం చేస్తే.. దాని ప్రభావం నేరుగా మన పేగుల ఆరోగ్యం మీద కనిపిస్తుంది. నోటిలో ఏర్పడే హానికర బ్యాక్టీరియా కేవలం దంతాలను పాడుచేయడం మాత్రమే కాదు.. అవి లోపలికి ప్రయాణించి పేగుల మైక్రోబయోమ్ ను అసమతులితంగా మార్చగలవు.

ఆరోగ్య సమస్యలు

నోటి లోపల పెరిగే చెడు బ్యాక్టీరియా.. రక్తప్రవాహంలోకి చేరినప్పుడు శరీరమంతటా దెబ్బతీసే ఇన్ఫ్లమేషన్ కు కారణమవుతుంది. ముఖ్యంగా గట్ లో ఈ ఇన్ఫ్లమేషన్ పెరిగితే.. జీర్ణక్రియలో గందరగోళం ఏర్పడుతుంది. అంతేకాకుండా నోటిలో నొప్పి లేదా ఇన్ఫెక్షన్ వల్ల తినే ఆహారం సరిగ్గా నమలకపోవడం వల్ల.. కడుపు జీర్ణానికి ఆహారం పూర్తిగా సిద్ధంగా ఉండదు. దీని వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా మారుతుంది. తద్వారా శరీరం అవసరమైన పోషకాలను పూర్తిగా గ్రహించలేకపోతుంది.

నోటి అలవాట్లు

  • పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లతో పాటు నోటి శుభ్రత కూడా అవసరం. ఈ చిన్న చిన్న మార్పులు దీర్ఘకాల ఆరోగ్యాన్ని నిర్ధారించగలవు.
  • సహజ మూలికలతో తయారైన దంత సంరక్షణ ఉత్పత్తులు ఉపయోగించండి. నిమ్మ, త్రిఫల, మిస్వాక్ వంటి మూలికలు బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు కలిగి ఉండి దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
  • భోజనం తర్వాత నోరు పుక్కిలించడం అలవాటు చేసుకోండి. ఆహారపు అవశేషాలు తొలగిపోవడమే కాకుండా.. నోటిలో సహజ బ్యాక్టీరియా సమతుల్యతను నిలబెట్టడానికి ఇది సహాయపడుతుంది.
  • తగినంత నీళ్లు తాగడం మర్చిపోవద్దు. లాలాజల ఉత్పత్తి పెరిగి నోరు సహజంగా శుభ్రంగా ఉండేలా చేస్తుంది. ఇది ఆహారాన్ని విడగొట్టడంలోను ఉపకరిస్తుంది.
  • ఫైబర్ పుష్కలంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడం. యాపిల్, క్యారెట్, ఆకుకూరలు వంటి పదార్థాలు నోటి ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటు జీర్ణవ్యవస్థకు మద్దతిస్తాయి.
  • తీపి ప్రాసెస్డ్ ఆహారాన్ని తగ్గించండి. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు నోటిలో చెడు బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడతాయి. ఇది నోరు, గట్ రెండింటినీ దెబ్బతీయగలదు.

ఆయుర్వేదం ఏం చెబుతోంది..?

ఆయుర్వేదం ప్రకారం నోటి ఆరోగ్యం శరీరంలోని సంపూర్ణ ఆరోగ్యానికి మూలాధారంగా భావించబడుతుంది. లవంగం, దారుచీని, త్రిఫల, దానిమ్మ లాంటి వాటితో తయారయ్యే టూత్‌ పేస్టులు కేవలం దంతాలను రక్షించడమే కాదు.. శరీరంలో హానికరమైన బ్యాక్టీరియాను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఇవి చిగుళ్ల వాపు తగ్గించడంతో పాటు నోటి శుద్ధి, గట్ క్లీన్సింగ్‌ లో కూడా మంచి ఫలితాలు ఇస్తాయి.

నోటి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి..

నోటి శుభ్రతను చిన్న విషయం అనుకుని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది కేవలం రోజువారీ అలవాటు మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైన జీవనశైలికి తొలి మెట్టు. సహజ పదార్థాలతో తయారైన దంత సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం.. సరైన నోటి శుభ్రత అలవాట్లు పాటించడం వల్ల మన చిరునవ్వు మాత్రమే కాదు జీర్ణక్రియ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నోరు ఆరోగ్యంగా ఉంటే.. గట్ ఆరోగ్యం మెరుగవుతుంది. అదే విధంగా రోగనిరోధక శక్తి బలపడుతుంది.