AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు తరచుగా పీడకలలు వస్తున్నాయా..? దీనికి కారణమేంటో తెలుసా..?

ప్రతి ఒక్కరి జీవితంలో కలలు వస్తాయి.. కానీ తరచూ పీడకలలు వచ్చేవాళ్ళు తప్పకుండా జాగ్రత్త పడాలి. రీసెర్చ్‌లు ఏం చెబుతున్నాయంటే.. పీడకలలు మన శరీరంలో కార్టిసాల్ లెవెల్స్‌ని పెంచి, నిద్రను డిస్టర్బ్ చేస్తాయి. దీని వల్ల వృద్ధాప్యం వేగంగా వచ్చేస్తుంది. అందుకే పీడకలల ప్రభావాన్ని అర్థం చేసుకోవడం, ఫుడ్, నిద్ర, స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.

మీకు తరచుగా పీడకలలు వస్తున్నాయా..? దీనికి కారణమేంటో తెలుసా..?
Sleeping
Prashanthi V
|

Updated on: Sep 01, 2025 | 10:25 PM

Share

ప్రతి ఒక్కరికీ నిద్రలో కలలు వస్తాయి. కొన్ని కలలు బాగుంటాయి.. మరికొన్ని పీడకలలు (భయంకరమైన కలలు) ఉంటాయి. అయితే తరచూ పీడకలలు వస్తే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇది మన శరీరంలో లోతైన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అధ్యయన ఫలితాలు

యూరోపియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ (EAN) చేసిన ఒక పరిశోధన ప్రకారం.. తరచూ పీడకలలు వచ్చే వారికి త్వరగా వృద్ధాప్యం వచ్చే అవకాశం ఉంది. అలాగే వారు త్వరగా చనిపోయే ప్రమాదం కూడా ఎక్కువ. వారానికి పీడకలలు వచ్చే వారిలో.. అకాల మరణం వచ్చే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువ అని ఈ అధ్యయనం చెబుతోంది.

శరీరంపై ప్రభావం

ఇంపీరియల్ కాలేజ్ లండన్‌కి చెందిన శాస్త్రవేత్తల ప్రకారం.. మన మెదడు నిద్రలో వచ్చే కలలను నిజ జీవితం నుంచి వేరు చేయలేదు. అందుకే పీడకలల సమయంలో మనకు చెమటలు పట్టడం, గుండె వేగం పెరగడం, సరిగా ఊపిరి ఆడకపోవడం వంటివి జరుగుతాయి. నిద్రలో కలిగే ఒత్తిడి, బయట మనం అనుభవించే ఒత్తిడి కంటే ఎక్కువగా ఉంటుంది.

కార్టిసాల్‌తో వృద్ధాప్యం

పీడకలల వల్ల శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుంది. ఈ హార్మోన్ మన శరీర కణాల వృద్ధాప్యానికి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. అందుకే పీడకలల వల్ల వచ్చే ఒత్తిడి, వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుందని ఈ అధ్యయనం తెలిపింది.

నిద్ర నాణ్యత

పీడకలలు మనసుపై ఒత్తిడి పెంచడమే కాకుండా.. నిద్ర నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి. దాని వల్ల రాత్రివేళ మన శరీరంలో జరిగే మరమ్మత్తులు సరిగా జరగవు. నిద్ర సరిగా లేకపోవడం వల్ల మన శరీర కణాలు వేగంగా వృద్ధాప్యానికి గురవుతాయి.

టెలోమియర్‌ల ద్వారా నిర్ధారణ

ఈ అధ్యయనంలో పాల్గొన్నవారి టెలోమియర్‌ల (కణాల చివర ఉండే భాగాలు) పొడవును పరిశీలించారు. టెలోమియర్‌లు తగ్గితే.. శారీరక వయస్సు పెరుగుతోందని అర్థం. తరచూ పీడకలలు వచ్చే వారిలో టెలోమియర్‌లు చిన్నగా ఉన్నట్లు గుర్తించారు. దీని ఆధారంగా పీడకలలకు.. త్వరగా వచ్చే వృద్ధాప్యానికి మధ్య బలమైన సంబంధం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు.

వారానికి పీడకలలు వస్తే చాలా ప్రమాదం. కానీ నెలకొకసారి పీడకలలు వచ్చినా దాన్ని ఒక హెచ్చరికగా భావించాలని ఈ అధ్యయనం సూచిస్తోంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)