AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత తిన్నా మళ్లీ మళ్లీ ఆకలేస్తుందా..? దీనికి కారణమేంటో తెలుసా..?

తిన్న తర్వాత మళ్ళీ ఆకలిగా అనిపిస్తుందా..? ఇది కేవలం మీ అనుభవం కాదు.. చాలా మందికి ఇలా జరుగుతుంది. మనం రోజూ తినే ఆహారం మన శరీరానికి శక్తిని ఇస్తుంది. కానీ కొద్దిసేపటికే మళ్ళీ ఆకలిగా అనిపించడం కొందరిని ఇబ్బంది పెడుతుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడం ముఖ్యం.

ఎంత తిన్నా మళ్లీ మళ్లీ ఆకలేస్తుందా..? దీనికి కారణమేంటో తెలుసా..?
Hungry Pics
Prashanthi V
|

Updated on: Jul 27, 2025 | 9:41 PM

Share

వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని పాలిఫేజియా (Polyphagia) అంటారు. మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, మానసిక స్థితి, సరైన నిద్ర లేకపోవడం దీనికి ముఖ్యమైన కారణాలు కావచ్చు. తిన్న తర్వాత కూడా ఆకలి వేయడానికి గల ప్రధాన కారణాలు.. వాటిని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • మానసిక ఒత్తిడి.. మీరు తరచుగా ఆందోళనగా లేదా డిప్రెషన్‌ గా ఉన్నప్పుడు.. ఆకలిని అదుపు చేసుకోవడం కష్టమవుతుంది. ఒత్తిడికి ప్రతిస్పందనగా శరీరంలో కొన్ని హార్మోన్లు విడుదలయ్యి ఆకలిని పెంచుతాయి. దీంతో శరీరానికి అవసరం లేకపోయినా తినాలనిపిస్తుంది.
  • గర్భధారణ.. గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో హార్మోన్ల మార్పులు జరుగుతాయి. అలాగే పెరుగుతున్న శిశువుకు ఎక్కువ పోషకాలు అవసరం. దీని వల్ల తిన్న తర్వాత కూడా ఆకలిగా అనిపించడం సర్వసాధారణం.
  • నిద్రలేమి.. రాత్రిళ్లు సరిపడా నిద్ర లేకపోతే ఘ్రెలిన్ (Ghrelin) అనే ఆకలిని పెంచే హార్మోన్ స్థాయి పెరుగుతుంది. దీని వల్ల తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తుంది. ఇది ఎక్కువ తినే అలవాటుకు దారితీస్తుంది.
  • పోషకాహార లోపం.. మీ ఆహారంలో తగినంత ప్రోటీన్, ఫైబర్ లేదా మంచి కొవ్వులు లేకపోతే.. తిన్నా కూడా త్వరగా ఆకలి వేస్తుంది. ఈ పోషకాలు కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఉంచుతాయి.
  • డీహైడ్రేషన్.. శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు.. కొందరు దాన్ని ఆకలిగా పొరబడుతుంటారు. నిజానికి అది దాహం కావచ్చు. అందుకే తిన్నా ఆకలిగా అనిపిస్తే ముందుగా ఒక గ్లాసు నీళ్లు తాగి చూడండి.
  • ప్రాసెస్డ్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం.. పాలిష్ చేసిన బియ్యం, మైదా, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి త్వరగా ఆకలి వేసేలా చేస్తాయి. వీటి వల్ల తిన్న వెంటనే మళ్ళీ తినాలనిపిస్తుంది.
  • మందుల సైడ్ ఎఫెక్ట్స్.. కొన్ని రకాల మందులు, ముఖ్యంగా కొన్ని హార్మోన్ మాత్రలు లేదా కండరాలకు సంబంధించిన మందులు ఆకలిని పెంచుతాయి. మీరు అలాంటి మందులు వాడుతుంటే.. మీ డాక్టర్‌ ను సంప్రదించడం మంచిది.

ఆకలిని తగ్గించుకోవడానికి చిట్కాలు

  • పోషకాలు నిండిన ఆహారం తినండి.. మీ ఆహారంలో ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పప్పులు, గుడ్లు, పండ్లు, కూరగాయలు వంటివి ఎక్కువసేపు కడుపు నిండినట్లు ఉంచుతాయి.
  • నెమ్మదిగా తినండి.. ప్రతి ముద్దను నెమ్మదిగా, బాగా నమిలి తినండి. ఇలా నెమ్మదిగా తినడం వల్ల మెదడుకు కడుపు నిండింది అనే సంకేతం త్వరగా చేరుతుంది.
  • నీరు తాగండి.. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగండి. ఇది డీహైడ్రేషన్ వల్ల వచ్చే ఆకలిని నివారిస్తుంది.
  • ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి.. ప్రాసెస్డ్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, స్వీట్స్ వంటి వాటికి బదులుగా సహజమైన ఆహారాలు తినడానికి ప్రయత్నించండి.
  • శారీరక శ్రమను పెంచండి.. రోజువారీ నడక, యోగా, లేదా చిన్నపాటి వ్యాయామాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
  • ఆహారంలో పండ్లు, ఆకుకూరలు, మిల్లెట్స్ చేర్చండి.. ఇవి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. అలాగే ఆకలిని అదుపులో ఉంచుతాయి.

ఈ చిట్కాలను పాటిస్తే తిన్న తర్వాత వచ్చే అనవసరమైన ఆకలిని తగ్గించుకోవచ్చు. ఒకవేళ సమస్య అలాగే కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యంపై మీకు ఏమైనా ఆందోళనలు ఉంటే.. ఎప్పుడూ వైద్య నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)