రాత్రిపూట తరచుగా దాహం వేస్తుందా..? జాగ్రత్త.. ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కారణం కావొచ్చు..!
రాత్రివేళ తరచూ నీరు తాగాలనిపిస్తే అది సాధారణం కాదు. దీని వెనుక ఆరోగ్య సంబంధిత కారణాలు ఉండే అవకాశముంది. ముఖ్యంగా మధుమేహం, కిడ్నీ సమస్యలు, నిద్రలో శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలు ఈ లక్షణానికి దారితీయవచ్చు. వీటిని గుర్తించి వెంటనే వైద్య సలహా తీసుకోవడం అవసరం.

రాత్రిపూట మీకు తరచుగా దాహం వేసి నీళ్లు తాగాల్సి వస్తుందా..? అలా అయితే దీన్ని చిన్న సమస్యగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది మీ శరీరంలో ఏదో ఒక ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. వైద్య పరిభాషలో ఈ పరిస్థితిని పాలీడిప్సియా అంటారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
టైప్ 1 మధుమేహం
ఈ టైప్ 1 డయాబెటిస్ ను ఆటో ఇమ్యూన్ వ్యాధిగా భావిస్తారు. ఈ పరిస్థితిలో శరీరం ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయడం ఆపేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చక్కెరను బయటకు పంపడానికి శరీరం తరచూ మూత్ర విసర్జన చేస్తుంది. దీంతో శరీరంలో నీరు తగ్గిపోతుంది. దాహం పెరుగుతుంది. రాత్రివేళల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
టైప్ 2 మధుమేహం
ఈ రకం మధుమేహంలో శరీరం ఇన్సులిన్ ను గుర్తించదు లేదా సరిగ్గా ఉపయోగించుకోదు. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి రావు. ఫలితంగా తరచుగా మూత్రం వస్తుంది. శరీరం నీటిని కోల్పోతుంది. ఇది కూడా రాత్రివేళల్లో మీకు ఎక్కువ దాహం వేయడానికి ఒక ముఖ్యమైన కారణం.
కిడ్నీ సమస్యలు
కిడ్నీలు శరీరంలోని విష పదార్థాలను, ఎక్కువ నీటిని బయటకు పంపడంలో చాలా ముఖ్యమైన పని చేస్తాయి. అయితే అవి సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో నీటి సమతుల్యత దెబ్బతింటుంది. దీని వల్ల రాత్రిపూట తరచుగా మూత్రం వస్తుంది. దాహం కూడా పెరుగుతుంది.
నిద్రలో శ్వాస ఆగిపోవడం
స్లీప్ అప్నియా ఉన్న వారికి నిద్రలో శ్వాస మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల నోరు పొడిబారుతుంది. దీంతో నిద్రలో మేల్కొని నీళ్లు తాగాల్సిన అవసరం వస్తుంది.
ఉప్పు, మద్యం, కాఫీతో అధిక దాహం
చాలా మంది ఉప్పు అధికంగా తింటారు. కొందరు మద్యం లేదా కాఫీ తరచూ తీసుకుంటారు. ఇది శరీరంలోని నీటిని తగ్గించి దాహాన్ని పెంచుతుంది. ఇది అలవాటుగా మారితే పాలీడిప్సియా అనే సమస్యగా మారవచ్చు.
రాత్రిపూట తరచుగా దాహం వేయడం వెనుక ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)