Health Tips: భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగితే ఆ సమస్యలు.. ఇందులో నిజమెంత..?
భోజనం చేసేటప్పుడు నీరు తాగకూడదని చాలామంది చెప్తుంటారు. తినేటప్పుడు నీరు తాగితే జీర్ణం సరిగా కాదు, జీర్ణవ్యవస్థ మందగిస్తుందని సాధారణంగా అందరూ అంటుంటే వినే ఉంటారు. ఇక కొందరైతే గొంతు పట్టుకుపోయినా, దాహం వేసినా భోజనం పూర్తయ్యే వరకు మంచి నీళ్లు ముట్టరు. అయితే, ఈ అలవాటు నిజంగా సరైనదేనా? ఆహారంతో నీరు తాగడం మంచిదా, కాదా? ఈ విషయంపై వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

భోజన సమయంలో నీరు తాగడం పూర్తిగా తప్పు కాదు, కానీ సరైన సమయం సమతుల్యతను పాటించడం ముఖ్యం. అవసరమైనప్పుడు కొద్దిగా తాగడం వల్ల జీర్ణక్రియకు హాని జరగదని వైద్యులు చెబుతున్నారు. మీ శరీర సంకేతాలను గమనించి, అవసరాన్ని బట్టి నీటి సేవనాన్ని సర్దుబాటు చేసుకోండి. ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఈ చిన్న జాగ్రత్తలు చాలా ఉపయోగపడతాయి.
భోజనంతో నీరు తాగడం తప్పా?
నిజానికి, భోజన సమయంలో నీరు తాగడం పెద్ద సమస్యేమీ కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆహారంతో పాటు ఎక్కువ మొత్తంలో నీరు తాగితే జీర్ణ రసాలు పలుచనై, జీర్ణక్రియ కాస్త నెమ్మదించవచ్చు. కానీ, అవసరమైతే ఒకటి లేదా రెండు గుటకల నీరు తాగడం వల్ల ఎలాంటి హాని జరగదు. అందుకే, ఈ విషయంలో సమతుల్యత చాలా ముఖ్యం.
నీరు తాగడానికి సరైన సమయం ఎప్పుడు?
ఆహారం తినడానికి కనీసం 30 నిమిషాల ముందు నీరు తాగితే శరీరం హైడ్రేట్ అవుతుంది మరియు జీర్ణక్రియకు సిద్ధమవుతుంది. కానీ, తినడానికి ఐదు నిమిషాల ముందు నీరు తాగడం మానండి. ఆహారం తిన్న వెంటనే నీరు తాగడం కంటే, 1-2 గంటలు ఆగితే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. వెంటనే తాగడం వల్ల జీర్ణక్రియ నెమ్మదించడంతో పాటు కఫం లేదా బరువు పెరగడం వంటి సమస్యలు రావచ్చు.
భోజనంతో నీరు తాగేటప్పుడు జాగ్రత్తలు
గొంతులో ఆహారం ఇరుక్కుపోతే లేదా దాహం వేస్తే, వెంటనే కొద్దిగా నీరు తాగండి. ఇది ఆహారం సులభంగా కడుపులోకి చేరడానికి సహాయపడుతుంది. నీరు తాగేటప్పుడు ఒకేసారి గబగబా తాగకుండా, చిన్న గుటకలుగా తీసుకోండి. ఇలా చేస్తే కడుపు ఉబ్బరం, అపానవాయువు వంటి సమస్యలు రావు. చల్లని నీరు జీర్ణక్రియను మందగించగలదు కాబట్టి, గోరువెచ్చని లేదా సాధారణ ఉష్ణోగ్రత నీరు తాగడం మంచిది.
భోజనం మధ్యలో ఒకేసారి ఎక్కువ నీరు తాగడం మానండి. ముద్ద మింగిన తర్వాత ఒకటి లేదా రెండు గుటకలు తాగితే సరిపోతుంది. ఇది ఆహారాన్ని తేమగా చేసి, జీర్ణక్రియకు ఆటంకం కలిగించదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన వారు పేగు సమస్యలు, ఉబ్బరం, యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు భోజనం మధ్యలో నీరు తాగడం వీలైనంతవరకు తగ్గించాలి. అవసరమైతేనే చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి.