Health Risks: గంటల తరబడి కూర్చుంటున్నారా?.. ఈ రెండు వ్యాధులు గ్యారెంటీ..
దశాబ్దాల కాలంగా ధూమపానమే అతిపెద్ద ఆరోగ్య శత్రువని మనం నమ్ముతున్నాం. కానీ, నేటి ఆధునిక జీవనశైలిలో అంతకంటే భయంకరమైన అలవాటు ఒకటి మనల్ని చుట్టుముట్టింది. అదే గంటల తరబడి కూర్చుని ఉండటం. నేడు భారతదేశంలో డెస్క్ ఉద్యోగాలు, స్క్రీన్ సమయం పెరగడంతో గంటల తరబడి కదలకుండా కూర్చోవడం అనేది ఒక తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారింది. "కూర్చోవడం అనేది కొత్త రకం ధూమపానం" అని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ వర్మ హెచ్చరిస్తున్నారు.

మానవ శరీరం కదలికల కోసం నిర్మితమైంది తప్ప, నిశ్చలంగా కూర్చోవడం కోసం కాదు. గంటల తరబడి కూర్చోవడం వల్ల శరీర జీవక్రియ (Metabolism) మందగించడమే కాకుండా, రక్త ప్రసరణ కూడా తగ్గుతుంది. ఇది గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం అకాల మరణానికి దారితీస్తుందని అంతర్జాతీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజుకు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం కూర్చునే వారికి కలిగే ఆరోగ్య నష్టం, దీర్ఘకాలిక ధూమపానంతో సమానమని వైద్యులు చెబుతున్నారు. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.
గంటల తరబడి కూర్చోవడం వల్ల కలిగే నష్టాలు:
జీవక్రియ మందగించడం: మీరు ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు, శరీరంలో కొవ్వును కరిగించే ఎంజైమ్‌లు పనిచేయడం మానేస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ఇన్సులిన్ నిరోధకత (Insulin Resistance) పెరుగుతుంది.
జిమ్ వర్కవుట్ సరిపోదు: “ఉదయం గంటసేపు జిమ్‌లో గడిపినంత మాత్రాన, ఆ తర్వాత తొమ్మిది గంటల పాటు కదలకుండా కూర్చోవడం వల్ల కలిగే నష్టాన్ని పూడ్చలేము” అని డాక్టర్ వర్మ హెచ్చరిస్తున్నారు.
సిట్టింగ్ డిసీజెస్: దీనివల్ల కేవలం ఊబకాయమే కాకుండా.. రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, వెన్నునొప్పి మరియు వెన్నెముక సమస్యలు తలెత్తుతాయి. నేడు 30 ఏళ్ల వయసు వారిలోనే 50 ఏళ్ల వారికి వచ్చే ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి.
నిపుణులు సూచిస్తున్న చిన్న మార్పులు:
ప్రతి 30 నిమిషాలకు ఒకసారి: గంటల తరబడి కదలకుండా ఉండకుండా, ప్రతి అరగంటకు ఒకసారి లేచి 2 నిమిషాల పాటు నడవాలి లేదా స్ట్రెచింగ్ చేయాలి.
ఫోన్ మాట్లాడుతూ నడవండి: కాల్స్ వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడకుండా అటు ఇటు నడుస్తూ మాట్లాడటం అలవాటు చేసుకోండి.
మెట్లు వాడండి: లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఉపయోగించడం వల్ల కండరాలు చురుగ్గా ఉంటాయి.
స్టాండింగ్ డెస్క్: వీలైతే నిలబడి పనిచేసే డెస్క్‌లను వాడటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఆరోగ్య పరమైన సందేహాల కోసం నిపుణులను సంప్రదించండి.
