వాతావరణ పరిస్థితులు మానవ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో మనందరికీ తెలిసిందే. మారుతున్న కాలాన్ని బట్టి శారీరక సమస్యలూ వస్తుంటాయి. అయితే ఈ ఆరోగ్య సమస్యలను అంత తేలికగా తీసుకోకూడదు. కానీ సైన్స్ పురోగమిస్తున్న కొద్దీ అనారోగ్యం, మరణాల పెరుగుదలకు గ్లోబల్ వార్మింగ్‌తో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. వీటి ద్వారా ఆరోగ్య సమస్యల తీవ్రతను మరింత కచ్చితంగా అంచనా వేయవచ్చు. జనాభా పెరుగుదల, వాతావరణ మార్పులు, రుతువులు కాలానుగుణంగా రాకపోవడం, అతివృష్టి, అనావృష్టి వంటివి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. వాతావరణ మార్పుల ద్వారా సంవత్సరానికి సుమారు 2,50,000 మరణాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వేడి గాలులు, పోషకాహార లోపం, డయేరియా, మలేరియా వంటి వ్యాధుల కారణంగా ఈ మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది.
కరవు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో తినడానికి తిండి కూడా లభించని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవి వలసలకు ప్రేరేపిస్తున్నాయి. చాలా మంది ఉపాధి కోసం పట్టణాలకు వెళ్తున్నారు. రద్దీగా ఉండే జీవన పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా నగరాల్లో నివసించడం వల్ల వ్యాధులు సంక్రమించే అవకాశం పెరుగుతోంది. వాతావరణంలో వచ్చే మార్పులు కీటకాల ద్వారా సంక్రమించే అంటువ్యాధులు, నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల పెరుగుదలకు కారణమవుతోంది. యూఎస్ఏ వంటి దేశాలు ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయి. వర్షపాతం తీరులో వస్తున్న మార్పులు నీటి ద్వారా వచ్చే వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతోంది.
ఈ మార్పులకు ప్రభావితమైన వారికి విపరీతమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇవి శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఆవేదన కలిగిస్తాయి. మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు తీవ్రమైన వేడి కారణంగా మరింత ఎక్కువగా ప్రభావితమవుతారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆత్మహత్యల పెరుగుదల రేటుతో ముడిపడి ఉన్నాయని వెల్లడించడం గమనార్హం..
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.