AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sapodilla Benefits: అబ్బో.. సపోటాలో ఇంత మ్యాటరుందా.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే..

సపోటాలు భారత్ చెందిన పండ్లు కావు. ఇవి మధ్య అమెరికా, మెక్సికోకు చెందిన ఉష్ణమండల పండు. అయినా కూడా భారతీయ మార్కెట్లలో ఇవి ఎక్కువగా దొరుకుతుంటాయి. వీటిని తినడానికి చాలా మంది ఇష్టపడరు. గోధుమ రంగులో, నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ పండులో ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీటి గురించి కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకుని తీరాలి.

Sapodilla Benefits: అబ్బో.. సపోటాలో ఇంత మ్యాటరుందా.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే..
Sapota Fruit Benefits
Bhavani
|

Updated on: Mar 05, 2025 | 4:22 PM

Share

సపోటా పండ్లు ఎనర్జీకి పవర్ హౌజ్ లాంటివంటారు. శరీరంలో నిస్సత్తువ ఆవహించినప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లను తింటే శరీరం వెంటనే శక్తిని పుంజుకుంటుంది. వీటికి అంత పవర్ ఉంది. ఈ పండ్లలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. కానీ, ఈ చెట్టు అన్ని ప్రాంతాల్లో పెరగదు. ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతుంది. మొట్టమొదటగా స్పానిష్ రాజులు పిలిప్పీన్స్‌లో సపోటా తోటల పెంపకాన్ని మొదలు పెట్టారట. సపోట కాయలు చెట్టుకు ఉన్నప్పుడు పండవు. ఇదే వీటిలో ఉండే స్పెషాలిటీ. కోసిన తర్వాతనే పండుతాయి.

ఫైబర్ దండిగా ఉండే పండు..

మన రోజూవారి ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. మలబద్ధకం అందులో ప్రధానమైంది. సపోటాల్లో ఫైబర్ కావలసినంత దొరుకుతుంది. ఒక్కో పండులో దాదాపు 9 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగు పరిచి గట్ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది.

అలసటకు రామబాణం..

సాధారణంగా ఈ పండ్లు వేసవిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎండాకాలం రాగానే డీహైడ్రేషన్ కారణంగానో లేక అధిక ఉష్ణోగ్రతల వల్లనో నీరసం నిస్సత్తువ కమ్మేస్తుంటాయి. అలాంటప్పుడు రెండు సపోటాలను తిన్నారంట ఇక వెంటనే హుషారుగా మారిపోతారు.

జీర్ణ సంబంధ సమస్యలకు..

ఎవరైతే జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఇదొక మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో టానిన్లు, ఫాలీఫెనాల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తగ్గిస్తాయి.

గుండె ఆరోగ్యం..

సపోటాలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్నితగ్గిస్తుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రసరణను ఆరోగ్యంగా ఉంచడం వల్ల కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఎక్కువ తిన్నారంటే అంతే..

సపోటాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటి రుచి కూడా గొప్పగా ఉంటుంది. అందుకని వీటిని మోతాదు మించి తీసుకుంటే అనర్థాలే వస్తాయి. సపోటాలను అదేపనిగా తినడం మంచిది కాదు. దీని వల్ల అజీర్ణంతో పాటు పొట్ట ఉబ్బరం సమస్య కూడా వస్తుంది.