AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: అందుకే..ఇండియాలో కోవిడ్ విజృంభిస్తోంది .కోవిడ్ నిబంధనలు విధిగా అందరూ పాటించాల్సిందే!

కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా రెండో వేవ్ బెంబేలెత్తిస్తోంది. మొదటిసారి కరోనా విరుచుకుపడినపుడు వెంటనే లాక్ డౌన్ ప్రకటించి..కరోనాను కట్టడి చేసే ప్రయత్నాలు చేశాయి ప్రభుత్వాలు

Corona Virus: అందుకే..ఇండియాలో కోవిడ్ విజృంభిస్తోంది .కోవిడ్ నిబంధనలు విధిగా అందరూ పాటించాల్సిందే!
Corona Virus
Follow us
KVD Varma

|

Updated on: Apr 11, 2021 | 11:43 AM

కరోనా కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా రెండో వేవ్ బెంబేలెత్తిస్తోంది. మొదటిసారి కరోనా విరుచుకుపడినపుడు వెంటనే లాక్ డౌన్ ప్రకటించి..కరోనాను కట్టడి చేసే ప్రయత్నాలు చేశాయి ప్రభుత్వాలు.. తరువాత మెల్లగా మహమ్మారి అదుపులోకి వచ్చినట్టు కనిపించడం.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపించడంతో అన్ లాక్ అయింది దేశం. క్రమేపీ పరిస్థితులు అదుపులోకి వస్తున్న తరుణంలో మళ్ళీ కరోనా విరుచుకుపడుతోంది. అసలెందుకు మళ్ళీ ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి? కరోనా కట్టడి చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలపై ప్రముఖ శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు. కరోనా మళ్ళీ ఇలా విజృంభించడానికి కారణం కరోనా తన రూపు మార్చుకోవడం.. ప్రజల్లో కరోనా పోయిందిలే అనే ధీమా పెరిగిపోవడం.. కరోనా అదుపులోనే ఉందికదా అని ఎన్నికలు..విందులు..వినోదాలు వంటి కార్యకర్మలకు తలుపులు బార్లా తెరవడం.. మరీ ముఖ్యంగా వ్యాక్సిన్ వచ్చేసింది అనే ధైర్యం ప్రజల్లో పెరిగిపోవాటం.. ఇదేసమయంలో టీకాలు ఇచ్చే విషయంలో ఆలస్యం జరుగుతుండటం కూడా కరోనా మరోసారి విజృంభించడానికి కారణాలుగా వారు చెబుతున్నారు.

ధీమా పెరిగిపోయింది..

అన్ లాక్ ప్రక్రియ ఎప్పుడైతే అన్ని దశలూ పూర్తి చేసుకుని.. దాదాపుగా పూర్తిస్థాయిలో స్వేచ్ఛ రాగానే.. ప్రజల్లో ధీమా పెరిగిపోయింది. కరోనా ముప్పు పూర్తిగా తప్పిపోయినట్టే అని భావించారు అందరూ. కొన్ని దేశాల్లో రెండో వేవ్ వచ్చిందనీ.. జనాన్ని మునుపటికన్నా క్రూరంగా తుడిచి పెట్టేస్తోందనీ వార్తలు వచ్చినా.. మనకేం కాదు అనే ఒకరకమైన నిర్లక్ష్యం ప్రజల్లో ఎక్కువైపోయింది. దీనికి తోడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది అనగానే.. ఇక మనకేం కాదు అనే మొండి ధైర్యం వచ్చేసింది. దీంతో ప్రజలు కరోనా నిబంధనలు గాలికి వదిలేశారు. ప్రభుత్వాలు కూడా చూసీ చూడనట్టుగా విషయాన్ని వదిలేశాయి. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి కీలకమైన మాస్క్ ధరించడం.. సామాజిక దూరం పాటించడం వంటి విషయాలను ప్రజలు లైట్ తీసుకున్నారు. ఇది కొంప ముంచింది. నిబంధనలు కఠినంగా పాటించేలా చూడాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ విషయంలో ధీమాగానే వ్యవహరించాయి. దీంతో పరిస్థితి గందరగోళంగా మారిపోయింది. ముఖ్యంగా సినిమాహాళ్లు.. విద్యాసంస్థలు తెరిచే విషయంలో ప్రభుత్వాలు తొందరపడ్డాయనే చెప్పాలి. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ కూడా.. ఎప్పుడైతే ఈ మూడు విషయాల్లోనూ నిబంధనలు సడలిపోయాయో.. కరోనా మళ్ళీ తలెత్తుకుని జనాన్ని కాటువేసేందుకు అవకాశం దొరికింది. ఇప్పుడు కరోనాను ఎదుర్కోవడానికి మళ్ళీ లాక్ డౌన్ మంత్రం పఠించాల్సిన పరిస్థితి చాలా రాష్ట్రాల్లో ఏర్పడింది.

టీకాలు వేయడంలో ఆలస్యం..

అన్నిదేశాలకంటే చివరగా ఇండియాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. దాదాపుగా అన్ని దేశాలూ.. డిసెంబర్ చివరి వారం.. జనవరి మొదటివారంలో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తే.. మన దగ్గర జనవరి మూడో వారంలో టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం అయింది. ”మొదట ఆరోగ్య సిబ్బందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సినకు అనుమతి రావడానికి ముందే ఎక్కువ వ్యాక్సిన్ లకు ఆర్డర్ ఇచ్చి ఉంటె సరిగ్గా సమయానికి ఎక్కువ వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చేవి. కానీ అలా జరగలేదు.” అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా టీకా తీసుకున్నాకూడా కరోనా నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని ప్రజలకు గట్టిగా చెప్పడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. ఇక ఇప్పటివరకూ దేశంలో కేవలం 0. 7 శాతం మంది మాత్రమే టీకాలు రెండు డోసులూ తీసుకున్నారు. ఇక 5 శాతం మాత్రమే ఒక డోసు తీసుకున్నారు. దీంతో కరోనా వ్యాక్సిన్ ఫలితాలు పెద్దగా కనిపించడం లేదు.

ఏం చేస్తే బావుంటుంది..

కరోనా ఉధృతి తక్కువ ఉన్న రాష్ట్రాల్లో 45 ఏళ్లకు పైబడిన వారికి టీకాలు ఇస్తూ..కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 18 ఏళ్ళు నిండిన వారికీ కూడా టీకాలు ఇవ్వడం ద్వారా ఫలితం బావుంటుంది. అదేవిధంగా కచ్చితంగా నిబంధనలు పాటించేలా ప్రజల్లో అవగాహన పెంచడం.. నిబంధనలు పాటించని వారిపట్ల కఠినంగా వ్యవహరించడం వంటివి చేయడం ద్వారా కరోనాను నిలువరించే అవకాశం ఉంటుంది.

కరోనా కట్టడి బాధ్యత ప్రభుత్వాలది మాత్రమే కాదు. ప్రజలందరిదీ. ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకుని ఎవరికి వారు బాధ్యతగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, ఒక కుటుంబంలో ఒకరికి కరోనా వస్తే ఆ కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతుంది. వారితో పాటు వారి పరిధిలో నివసించే వారంతా కూడా ఇబ్బంది పడతారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలి. కరోనా నిబంధనలు పాటించడం ప్రభుత్వాల కోసమో.. జనాన్ని రక్షించడానికో కాదు.. ఎవరికీ వారిగా వారు రక్షణ పొందటం.. తమ కుటుంబాన్ని రక్షించుకోవటమే అనే అంశం ప్రధానంగా ప్రజలంతా గుర్తించాల్సిన అవసరం ఉంది.

Also Read: Costly Mask: మాస్కులందూ ఈ మాస్కులు వేరయా.. వీటి ధర తెలిస్తే దిమ్మదిరిగి పోవాల్సిందే..

Symptoms of coronavirus: వాసన రాకపోవడం, రుచి తెలియకపోవడమే కాదు.. ఇవీ కూడా కరోనా వ్యాధి లక్షణాలే..