Liver Health: ఈ చిన్న చిన్న మార్పులు చేసి చూడండి.. లివర్ ఆరోగ్యం మస్తు ఉంటది..!
మన శరీరంలో ముఖ్యమైన భాగం లివర్. ఇది శరీరం నుంచి విష పదార్థాలను తొలగిస్తుంది. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. కొవ్వును, చక్కెరలను నియంత్రిస్తుంది. అయితే మన రోజూవారి కొన్ని అలవాట్లు లివర్ పనితీరును తగ్గిస్తాయి. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ అలవాట్లను వెంటనే మానేయాలి.

చాలా మంది ఆరోగ్యంగా ఉండాలని పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ లాంటివి తాగుతుంటారు. కానీ వీటిలో ఎక్కువ చక్కెర ఉంటుంది. ఇది లివర్ పై భారం పెంచుతుంది. ఫ్యాటీ లివర్ రావడానికి కారణమవుతుంది. బరువు తగ్గాలనుకుంటే ముందుగా చక్కెర తక్కువగా తీసుకోవాలి.
రోజంతా కుర్చీలో కూర్చుని పని చేయడం, వ్యాయామం చేయకపోవడం లివర్ కు నెమ్మదిగా నష్టం కలిగిస్తాయి. ఇది శరీరంలో ఇన్సులిన్ సరిగా పని చేయకుండా చేస్తుంది. దీని వల్ల కొవ్వు లివర్ చుట్టూ పేరుకుపోతుంది. రోజూ కనీసం 30 నిమిషాలు నడవడం లేక వ్యాయామం చేయడం మంచిది.
తలనొప్పి, కడుపునొప్పి వచ్చినప్పుడల్లా వెంటనే పెయిన్ కిల్లర్ లేక ఇబూప్రొఫెన్ (Ibuprofen) లాంటివి తీసుకోవడం అలవాటు చేసుకుంటే.. ఆ మందుల్లోని రసాయనాలు లివర్ కు పెద్ద సమస్యను తెచ్చిపెడతాయి. ఇవి లివర్ కణాలపై ప్రభావం చూపి నెమ్మదిగా దెబ్బతీస్తాయి.
ఆహారాన్ని సమయానికి తీసుకోకపోవడం లేక పోషకాలు పూర్తిగా తగ్గించే ఫ్యాడ్ డైట్స్ పాటించడం వల్ల శరీరంలో పోషకాలు తగ్గిపోతాయి. ఇది లివర్ పనితీరును ప్రభావితం చేస్తుంది. ప్రతి రోజూ సమయానికి సరైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.
మన శరీరం పని చేయాలంటే సరిపడా నీరు అవసరం. నీరు తక్కువగా తీసుకుంటే లివర్ పనితీరు మందగిస్తుంది. రోజూ కనీసం 2.5 లీటర్ల వరకు నీరు తాగడం వల్ల లివర్ ను శుద్ధి చేయవచ్చు.
హెర్బల్ లేక నేచురల్ అని నమ్మిన కొన్ని సప్లిమెంట్లు కూడా లివర్ పై చెడు ప్రభావం చూపవచ్చు. అందుకే ఏ సప్లిమెంట్ అయినా తీసుకోవడానికి ముందు వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
నిద్ర లేనివాళ్లు కేవలం మానసికంగానే కాదు.. శారీరకంగా కూడా బలహీనపడతారు. రాత్రి సమయంలో లివర్ శుద్ధి ప్రక్రియను చేస్తుంది. సరిగా నిద్రపోకపోతే ఈ ప్రక్రియ కూడా సరిగా జరగదు. రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర అవసరం.
మన లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు నీరు తాగడం, సమయానికి భోజనం చేయడం, వ్యాయామం చేయడం, అవసరానికి మించి మందులు తీసుకోకపోవడం లాంటి అలవాట్లు లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మన రోజువారీ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే.. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




