ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉందా..? వామ్మో.. ప్రమాదకర వ్యాధి బారిన పడతారట.. జాగ్రత్త
చికాకు కలిగినప్పుడు ముక్కులో వేలు పెట్టుకోవడం సహజం.. అయితే.. ఇది చిన్నతనం నుంచి కొందరికి అలవాటుగా మారుతుంది.. పదేపదే ముక్కులో వేలుపెట్టుకోవడాన్ని ఒక చెడు అలవాటుగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల అవతలి వ్యక్తులకు ఇబ్బందికరంగా మారుతుంది.. దీంతో అలాంటి వారిని చులకన భావంతో చూస్తారు..

చికాకు కలిగినప్పుడు ముక్కులో వేలు పెట్టుకోవడం సహజం.. అయితే.. ఇది చిన్నతనం నుంచి కొందరికి అలవాటుగా మారుతుంది.. పదేపదే ముక్కులో వేలుపెట్టుకోవడాన్ని ఒక చెడు అలవాటుగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల అవతలి వ్యక్తులకు ఇబ్బందికరంగా మారుతుంది.. దీంతో అలాంటి వారిని చులకన భావంతో చూస్తారు.. ఇది కేవలం మర్యాదకు సంబంధించిన విషయం అయితే.. ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు వల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలో తేలింది. గ్రిఫిత్ యూనివర్శిటీ (ఆస్ట్రేలియా) పరిశోధకులు ఎలుకలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో క్లామిడియా న్యుమోనియా అనే సాధారణ బ్యాక్టీరియా ముక్కు ద్వారా మెదడుకు చేరుతుందని కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియా ఘ్రాణ నాడి ద్వారా మెదడులోకి ప్రవేశిస్తుంది.. క్రమంగా ఇది అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన లక్షణాలను కలిగిస్తుంది.
ఎలుకలకు క్లామిడియా న్యుమోనియా సోకినప్పుడు వాటి మెదడులో అమిలాయిడ్ బీటా అనే ప్రొటీన్ పేరుకుపోయిందని అధ్యయనం కనుగొంది. అమిలాయిడ్ బీటా చేరడం అల్జీమర్స్ వ్యాధికి ప్రధాన లక్షణంగా పరిగణిస్తారు. ఇది మాత్రమే కాదు, ముక్కు లోపలి భాగంలో (నాసల్ ఎపిథీలియం) గాయం కారణంగా, ఈ బ్యాక్టీరియా ఘ్రాణ నాడి, మెదడుకు వేగంగా చేరుతుందని పరిశోధకులు కనుగొన్నారు.
అయితే, ఈ పరిశోధన ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.. ఇంకా ఎలుకలపై మాత్రమే జరిగింది. ఇది మానవ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ ఈ అధ్యయనం ముక్కు ఆరోగ్యానికి.. అల్జీమర్స్ వ్యాధికి మధ్య లింక్ ఉండవచ్చు అని సూచిస్తుంది.
ఈ పరిశోధన ఫలితాలకు సంబంధించి, గ్రిఫిత్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ సూటర్ మాట్లాడుతూ.. అల్జీమర్స్ వ్యాధి అభివృద్ధిలో ముక్కుతోపాటు ఆరోగ్యం పాత్ర పోషిస్తుందని తమ అధ్యయనం చూపిస్తుందన్నారు. ముక్కు లైనింగ్‌ను ఆరోగ్యంగా ఉంచడం, ముక్కులోని వెంట్రుకలను తీయకుండా ఉండటం వల్ల అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించవచ్చన్నారు.
అల్జీమర్స్ వ్యాధి అనేది న్యూరోడెజెనరేటివ్ వ్యాధి, ఇది క్రమంగా మెదడు కణాలను నాశనం చేస్తుంది. ఈ వ్యాధి కారణంగా, జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది.. దీంతో వ్యక్తి రోజువారీ పనులను చేయలేకపోతాడు. ప్రస్తుతం అల్జీమర్స్‌కు శాశ్వత నివారణ లేదు. అయితే జీవనశైలిని మార్చుకోవడం, ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించడం ద్వారా దాని ప్రమాదాన్ని తగ్గించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ కొత్త పరిశోధన తర్వాత, భవిష్యత్తులో, అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించడానికి ముక్కు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ముక్కులో వేళ్లు పెట్టుకునే అలవాటు, అల్జీమర్స్ మధ్య నిజంగా ప్రత్యక్ష సంబంధం ఉందో లేదో స్పష్టం చేయడానికి మరింత పరిశోధన అవసరమని.. పేర్కొంటున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




