AP JUDA’s : తీపి కబురు : ఏపీ సర్కార్‌తో చర్చలు సఫలం.. జూడాల సమ్మె విరమణ
ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లు శాంతించారు. ఇవాళ్టి నుంచి సమ్మె సైరన్ మ్రోగించిన జూనియర్ డాక్టర్లు ఇదే రోజు..
AP JUDA serves strike called off : ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లు శాంతించారు. ఇవాళ్టి నుంచి సమ్మె సైరన్ మ్రోగించిన జూనియర్ డాక్టర్లు ఇదే రోజు సమ్మె విరమించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి నిర్ధిష్టమైన హామీ లభించడంతో సమ్మె విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. సమ్మెకు దిగిన వైద్య విద్యార్ధులు.. డిప్యూటీ సీఎం ఆళ్లనానితో జరిపిన చర్చలు సఫలమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆరోగ్య భద్రతతో పాటు కొవిడ్ ప్రోత్సాహకాలు, ఎక్స్‌గ్రేషియా, స్టయిఫండ్ పెంపు వంటి డిమాండ్లకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో ఈ మేరకు జూడాలు మెత్తబడ్డారు. తిరిగి విధుల్లో చేరారు.
తమకు కొవిడ్ ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు పెంచాలని.. స్టయిఫండ్‌లో టీడీఎస్ కోత విధించవద్దని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఉదయం సమ్మెకు దిగిన తర్వాత జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం హుటాహుటీన చర్చలకు సిద్దమైంది.
డిప్యూటీ సీఎం ఆళ్లనానితో పాటు వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘాల్ జూడాలతో నెరపిన చర్చలు ఫలించాయి. అయితే, దశల వారీగా జూడాల డిమాండ్లు నెరవేరుస్తామని.. అడిగినదానికంటే మెరుగ్గానే చేకూరుస్తామని చెప్పడంతో జూనియర్ డాక్టర్లు తిరిగి వైద్యసేవల్లో నిమగ్నమయ్యారు.