మీకు ఈ అలవాట్లు ఉన్నాయా..? గుండెకు ఎంత ప్రమాదమో తెలుసా..?
గంజాయి వినియోగం గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా 50 ఏళ్లలోపు వ్యక్తుల్లో గుండెపోటు, స్ట్రోక్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని పరిశోధకులు తెలిపారు. గంజాయి వాడే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం ఆరు రెట్లు ఎక్కువగా ఉండటమే కాకుండా.. ఇతర ప్రాణాంతక గుండెజబ్బుల ముప్పు కూడా అధికంగా ఉందని తేలింది.

గంజాయి వాడే వారు, వాడని వారితో పోలిస్తే గుండెపోటు, స్ట్రోక్ లేదా ఇతర ప్రాణహాని గుండెజబ్బులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఒక కొత్త అధ్యయనం చెబుతోంది. ముఖ్యంగా 50 ఏళ్లలోపు ఉన్న పెద్దల్లో గంజాయి వాడకంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు తెలిపారు.
గంజాయి వాడేవారికి స్ట్రోక్, గుండె వైఫల్యం, గుండె మరణాల ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వైద్యులు, రోగుల గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడంలో గంజాయి వినియోగం గురించి తెలుసుకోవడం అవసరమని సూచించారు. సిగరెట్ ధూమపానం గురించి అడిగినట్లుగా.. గంజాయి గురించి కూడా అడగడం చాలా ముఖ్యం.
ఇప్పటికే గంజాయి వినియోగం అమెరికాలో 24 రాష్ట్రాల్లో వినోదం కోసం, 39 రాష్ట్రాల్లో వైద్య ప్రయోజనాల కోసం చట్టబద్ధం చేయబడింది. కానీ చట్టబద్ధం చేసినప్పటికీ.. గంజాయి వాడకం ఆరోగ్యానికి హానికరం అని పరిశోధకులు తేల్చారు. గంజాయి వినియోగదారులు ప్రమాదాలను తెలుసుకునేలా హెచ్చరికలు అవసరమని శాస్త్రవేత్తలు అన్నారు.
ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 50 ఏళ్లలోపు 4.6 మిలియన్ల పెద్దల ఆరోగ్య రికార్డులను విశ్లేషించారు. గంజాయి వాడేవారి గుండె ఆరోగ్యాన్ని, వాడని వారితో పోల్చి పరిశోధించారు. ఈ అధ్యయనంలో గుండె ఆరోగ్య సమస్యలు లేని వారినే పరిశీలించారు. వారికి మధుమేహం, ధమనులు మూసుకుపోవడం, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా సాధారణంగా ఉన్నాయి.
సగటు మూడు సంవత్సరాల పరిశీలనలో గంజాయి వాడేవారిలో గుండెపోటు ప్రమాదం ఆరు రెట్లు ఎక్కువగా ఉంది. స్ట్రోక్ ప్రమాదం నాలుగు రెట్లు, గుండె ఆగిపోయే ప్రమాదం రెండింతలు ఎక్కువగా ఉంది. అలాగే గుండెపోటు లేదా స్ట్రోక్ వల్ల మరణించే ప్రమాదం మూడు రెట్లు అధికంగా ఉంది.
గంజాయి వినియోగం గుండె లయను ప్రభావితం చేస్తుందని.. గుండె కండరాలకు ఆక్సిజన్ అవసరాన్ని పెంచుతుందని, రక్త నాళాల విస్తరణకు సమస్యలు కలిగిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారు. కొందరు గంజాయి వాడేవారు ఇతర ప్రమాదకర పదార్థాలను కూడా తీసుకోవడం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. రోగులు తమ వైద్యులతో గంజాయి వాడకం గురించి నిజాయితీగా మాట్లాడాలని.. పూర్తిగా తమ ఆరోగ్య పరిస్థితిని వెల్లడించాలని నిపుణులు సూచిస్తున్నారు.