అధిక కరోనా మరణాలకు అసలు కారణం అదేనట !?
మందులేని మహమ్మారిని కట్టడి, కరోనా మరణాలకు అసలు కారణంగా ఏంటనేది వెల్లడించారు భారత సంతతికి చెందిన బ్రిటన్ వైద్యుడు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్ దీని బారినపడి దాదాపు రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారికి ఎక్కడ అడ్డుకట్ట పడుతుందో, ఎలా అరికట్టాలో తెలియక బాధిత దేశాలు సతమతవుతున్నాయి. ఇప్పటి వరకు సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవటంతో మరణాల రేటు పెరిగిపోతోంది. అయితే, మందులేని మహమ్మారిని కట్టడి, కరోనా మరణాలకు అసలు కారణంగా ఏంటనేది వెల్లడించారు భారత సంతతికి చెందిన బ్రిటన్ వైద్యుడు.
అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యధిక కరోనా మరణాలకు కారణం వారి ఆహారపు అలవాట్లేనని బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన వైద్యుడు డాక్టర్ అసీమ్ మల్హోత్రా అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌లోని జాతీయ వైద్యసేవా విభాగం (ఎన్‌హెచ్ఎస్) ముఖ్యమైనవారిలో ఒకరైన డాక్టర్ మల్హోత్రా ఊబకాయం, అధికబరువు కరోనా మరణాలకు ముఖ్య కారణమని వివరించారు. జీవన విధాన సంబంధ ఆరోగ్య సమస్యలతో సతమతం అయ్యే భారత్ కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కరోనాపై పోరులో జీవన విధాన మార్పులు ముఖ్య ఆయుధమని డాక్టర్ అసీమ్ మల్హోత్రా ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా టైప్-2 మధుమేహం, బీపీ, గుండెజబ్బులు అనేవి కరోనా మరణాలకు మూడు ప్రధాన కారణాలని ఆయన వివరించారు. అధికంగా శరీరంలో కొవ్వు పేరుకుపోవడం అనేది ప్రధాన సమస్య అని తెలిపారు. అమెరికా, బ్రిటన్లలో 60 శాతం పైగా ప్రజలు స్థూలకాయులని గుర్తు చేశారు. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా ఆరోగ్యకర జీవన విధానాన్ని కొన్ని వారాల్లోనే సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు.