Health News: మారుతున్న జీవనశైలివల్ల చాలామంది వివిధ రకాల రోగాలతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా కిడ్నీ రోగులు ఎక్కువగా ఉంటున్నారు. ఇండియాలో ప్రతి సంవత్సరం రెండున్నర లక్షల మందికిపైగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ప్రతి ఏటా మూడున్నరకోట్ల మందికి డయాలసిస్ చేయాల్సి వస్తోందని తెలుస్తోంది. భారతదేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ‘ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్’ నివేదిక ప్రకారం.. మన దేశ జనాభాలో 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారని తెలుస్తోంది. వీటన్నింటికి కారణం కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోకపోవడమే. మన శరీరంలో ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడంలో కిడ్నీలు ముఖ్య పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. కిడ్నీలు వ్యర్థాలను వడబోసి మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంత కాలం మనకు ఎలాంటి సమస్యలూ రావు. కానీ కిడ్నీలు పాడైతే మాత్రం మనకు అనేక అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయి. ఆ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
1. మూత్రం రంగు మారి వస్తుంటే కిడ్నీల సమస్య ఉన్నట్లు గుర్తించాలి. సాధారణ రంగులో కాకుండా వేరే రంగులో వస్తుంటే కిడ్నీ చెకప్ చేయించాలి. కచ్చితంగా వైద్యులని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
2. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే వ్యర్థాలు మొత్తం రక్తంలోనే ఉంటాయి. దీంతో నోట్లో నుంచి దుర్వాసన వెలువడుతుంది. అలాగే ఆకలి బాగా తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
3. కిడ్నీలు పాడైతే కాళ్లు, చేతులు బాగా వాపునకు గురవుతాయి. ఈ సమస్య కనిపిస్త వెంటనే పరీక్షలు చేయించుకోవడం అవసరం.
4. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే ఆ ప్రభావం శరీరంలో ఎర్ర రక్త కణాలపై పడుతుంది. వీటిసంఖ్య బాగ తగ్గిపోయి రక్తహీనత ఏర్పడుతుంది. వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.
5. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే చర్మంపై దద్దుర్లు వస్తాయి. కిడ్నీలు ఉండే ప్రాంతంలో పొడిచినట్లుగా అనిపిస్తుంది. తీసుకునే ప్రక్రియలో ఇబ్బందులు ఏర్పడుతాయి. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఏకాగ్రత ఉండదు.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి