AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bacterial Vs Viral Infections: జ్వరానికి అసలు కారణం ఏంటి..? ఎలా తెలుసుకోవాలి..?

మన శరీరానికి చాలా రకాల ఇన్‌ ఫెక్షన్లు వస్తాయి. వాటిలో ముఖ్యంగా వైరస్‌ లు, బ్యాక్టీరియా వల్ల వచ్చేవి ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రెండింటి లక్షణాలు కొంతవరకు ఒకేలా ఉన్నా.. వీటి మధ్య తేడా ఏంటి..? వీటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Bacterial Vs Viral Infections: జ్వరానికి అసలు కారణం ఏంటి..? ఎలా తెలుసుకోవాలి..?
Viral Fevers
Prashanthi V
|

Updated on: Jun 22, 2025 | 9:27 PM

Share

ఒక వ్యక్తిని పరీక్ష చేసిన తర్వాత డాక్టర్ ఇది వైరల్ ఫీవర్ అని చెప్పడం మనం తరచూ వింటాం. కానీ అది వైరస్ వల్ల వచ్చిందని ఎలా అర్థం చేసుకోవాలి..? బ్యాక్టీరియా వల్ల వచ్చిందా లేదా వైరస్ వల్ల వచ్చిందా అని ఎలా తెలుసుకోవాలి..? ఈ రెండింటి మధ్య తేడాలు తెలుసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం.

వైరస్‌ లు, బ్యాక్టీరియా ఇన్‌ ఫెక్షన్లు ఈ రెండు జబ్బులు సూక్ష్మజీవుల వల్ల వస్తాయి. కానీ అవి శరీరంపై పని చేసే విధానం వేరుగా ఉంటుంది. బ్యాక్టీరియా అనేది సొంతంగా బతకగల ఒకే కణం జీవి. కొన్ని రకాల బ్యాక్టీరియా శరీరానికి హానికరం కావు. కానీ కొన్ని రకాల బ్యాక్టీరియా జబ్బులు కలిగిస్తాయి. ఉదాహరణకు టీబీ (ట్యూబర్క్యులోసిస్), యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ ఫెక్షన్లు (UTI), గొంతు నొప్పి లాంటివి ఈ రకానికి చెందుతాయి. ఇవి యాంటీబయోటిక్ మందులతో నయం అవుతాయి.

వైరస్‌ లు చాలా చిన్న జీవులు. ఇవి శరీరంలోకి వెళ్ళిన తర్వాత మంచి కణాలను ఆక్రమించి పెరుగుతాయి. వాటి వల్ల జలుబు, దగ్గు, జ్వరం, కోవిడ్ లాంటి జబ్బులు వస్తాయి. వైరల్ ఇన్‌ ఫెక్షన్‌ కు యాంటీబయోటిక్స్ పని చేయవు.

వైరల్, బ్యాక్టీరియా ఇన్‌ ఫెక్షన్లకు కొన్ని లక్షణాలు ఒకేలా కనిపించవచ్చు. ఉదాహరణకు జ్వరం, గొంతు నొప్పి, అలసట, ఒళ్ళు నొప్పులు రెండింటిలోనూ రావచ్చు. కానీ వైరల్ ఇన్‌ ఫెక్షన్లు సాధారణంగా నెమ్మదిగా వస్తూ 5 నుంచి 10 రోజుల్లో తగ్గిపోతాయి. అయితే బ్యాక్టీరియల్ ఇన్‌ ఫెక్షన్లు రోజురోజుకూ తీవ్రంగా మారతాయి. వాటిని వదిలేస్తే ఇతర శరీర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది.

చాలా సార్లు డాక్టర్లు లక్షణాలను చూసి చెబుతారు. అయితే కచ్చితంగా తెలుసుకోవాలంటే రక్త పరీక్ష, మూత్ర పరీక్ష లాంటివి అవసరం. కొన్నిసార్లు గొంతు స్రావాన్ని కూడా చూడాలి. కొన్ని వైరల్ జబ్బులు పొక్కులు లాగా కనిపిస్తాయి.. ఉదాహరణకు ఆటలమ్మ, అమ్మవారు లాంటివి. కానీ కొన్నింటిని గుర్తించడానికి టెస్టులు అవసరం.. ఉదాహరణకు కోవిడ్, హెపటైటిస్.

చికిత్స పూర్తిగా జబ్బుకు కారణాన్ని బట్టి నిర్ణయించాలి. వైరస్ వల్ల వచ్చిన ఇన్‌ ఫెక్షన్‌ లకు ఎక్కువగా విశ్రాంతి, ద్రవ పదార్థాలు తీసుకోవడం, కొన్ని ఉపశమనం ఇచ్చే మందులు వాడటమే చేస్తారు. బ్యాక్టీరియల్ ఇన్‌ ఫెక్షన్లు అయితే డాక్టర్ సూచన మేరకు యాంటీబయోటిక్స్ తీసుకోవాలి. కానీ వాటిని అనవసరంగా వాడకూడదు. అది రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది.

అలాగే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. ఈ రెండు రకాల జబ్బులను కొన్ని సాధారణ జాగ్రత్తలతో ఆపవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

  • తరచూ చేతులు కడుక్కోవడం.
  • జబ్బుతో ఉన్నవారికి దూరంగా ఉండడం.
  • గోరువెచ్చని నీళ్లు తాగడం.
  • చేతులు కడగకుండా ముఖాన్ని తాకకూడదు.
  • మాస్క్ వాడటం, శుభ్రత పాటించడం ముఖ్యమైనవి.

వైరల్, బ్యాక్టీరియా ఇన్‌ ఫెక్షన్ల లక్షణాలు కొంతవరకు ఒకేలా కనిపించినా.. చికిత్స పూర్తిగా వేరుగా ఉంటుంది. సరైన పరీక్షల ద్వారానే సరైన వైద్యం అందుతుంది. అందుకే మనం జాగ్రత్తగా ఉండి.. ఏ లక్షణాలు కనిపించినా డాక్టర్లను కలిసి కారణాన్ని కచ్చితంగా తెలుసుకొని చికిత్స తీసుకోవాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)