AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల భవిష్యత్ బాగుండాలంటే ఈ తప్పులు అస్సలు చేయకండి..! ఎందుకో తెలుసా..?

ప్రస్తుత రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని నిశ్శబ్దంగా ఉంచడానికి లేదా తినిపించడానికి మొబైల్ ఫోన్ చేతిలో పెడుతున్నారు. కానీ ఈ అలవాటు భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యానికి తీవ్రంగా భంగం కలిగించే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.

పిల్లల భవిష్యత్ బాగుండాలంటే ఈ తప్పులు అస్సలు చేయకండి..! ఎందుకో తెలుసా..?
Kids Screen Time
Prashanthi V
|

Updated on: Jun 13, 2025 | 3:01 PM

Share

ప్రస్తుతం చిన్న వయసులోనే పిల్లలు స్మార్ట్‌ ఫోన్ వాడటం సర్వసాధారణం అయిపోయింది. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కువ సమాచారం తెలుసుకోవాలనే ఆశతో.. చిన్న వయసులోనే మొబైల్ వాడే అలవాటు చేస్తున్నారు. మరికొందరైతే పిల్లలు ఏడుస్తున్నప్పుడు లేదా తినడం మానేస్తున్నప్పుడు.. వాళ్లను ఆపేందుకు ఫోన్ ఇస్తున్నారు. కానీ దీని పరిణామాలు పిల్లల మెదడు అభివృద్ధిని తీవ్రంగా దెబ్బతీయగలవని తెలియకపోవచ్చు.

స్మార్ట్‌ ఫోన్ ఎక్కువసేపు చూడటం వల్ల చిన్నపిల్లల మెదడు అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావాలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాటు వల్ల పిల్లల్లో దృష్టి నిలుపుకునే సామర్థ్యం తగ్గుతుంది.. నిద్రలేమి, ఊబకాయం, కోప స్వభావం లాంటి సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.

అంతేకాదు ఎక్కువ శబ్దంతో వీడియోలు చూడటం వల్ల వారి చెవులకు నష్టం కలిగే ప్రమాదం ఉంది. మొబైల్ స్క్రీన్ నుండి వెలువడే నీలి కాంతి వల్ల కళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది. దీన్ని చిన్న విషయం అనుకుంటే.. భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది.

పిల్లలు మొబైల్ చూడాలని మారాం చేస్తే లేదా ఏడుస్తుంటే ఫోన్ ఇవ్వడం తాత్కాలిక పరిష్కారం మాత్రమే. దీని వల్ల వారిలో దైనందిన జీవితంలో కూడా డిజిటల్ డిపెండెన్సీ పెరుగుతుంది. ఒకసారి అలవాటు పడ్డాక, ఫోన్ లేకపోతే మానసిక అసంతృప్తి, ఆందోళన మొదలవుతుంది.

అందుకే తల్లిదండ్రులు మొదటి నుంచే మొబైల్ వాడకాన్ని నియంత్రించాలి. వారి ఆత్మవిశ్వాసాన్ని, చురుకుదనాన్ని పెంపొందించే ఆటలు, కథలు, నేచర్ యాక్టివిటీలు లాంటి వాటిలో వారి దృష్టిని మళ్లించాలి. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • మూడు సంవత్సరాల లోపు పిల్లలకు మొబైల్ ఇవ్వకూడదు.
  • పెద్ద వయసు పిల్లలకు కూడా రోజుకు కొన్ని నిమిషాలు మాత్రమే మొబైల్ వినియోగం అనుమతించాలి.
  • పిల్లలతో కూర్చొని వాడే కంటెంట్‌ ను మీరు స్వయంగా పరిశీలించాలి.
  • మొబైల్ బదులుగా పుస్తకాలు, డ్రాయింగ్, స్టోరీ టెల్లింగ్ లాంటి సృజనాత్మక పనులలో వారిని ఆలోచించేలా చేయాలి.
  • టెక్నాలజీ తప్పదు.. కానీ అది నియంత్రితంగా ఉండాలి.

పిల్లలు ఏడుస్తున్నారనే కారణంతో వారికి మొబైల్ ఇవ్వడం పొరపాటు. దీని ప్రభావం వారి ఆరోగ్యం, అభివృద్ధిపై దీర్ఘకాలంగా పడే అవకాశముంది. కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు బాగా ఆలోచించి వారి భవిష్యత్తు కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాలి.