Heart Attack: రోజూ ఇలా నడిస్తే గుండెపోటు ముప్పు తక్కువే.. తాజా అధ్యయనంలో సరికొత్త విషయాలు
అధ్యయనంలో భాగంగా అమెరికాతో సహా మొత్తం 42 దేశాల్లో 20,000 కంటే ఎక్కువ మంది డేటాను విశ్లేషించారు. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు రోజుకు 6000 నుండి 9000 అడుగులు నడవాలని, ఇది గుండెపోటు ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుందని ఈ పరిశోధనలో తేలిందట.

పని ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి.. ఇలా గుండెపోటుకు చాలా కారణాలున్నాయి. యువతలోనూ భారీగా గుండెపోటు బాధితులున్నారు. ఏటా లక్షలాది మంది ఈ రోగంతో ప్రాణాలు కోల్పోతున్నారు .అందుకే దీని బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కంటే ముందే జాగ్రత్త పడడం మేలంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఈ నేపథ్యంలో రోజూ 6000 నుంచి 9000 అడుగులు (సుమారు 1-3 కిలోమీటర్లు) నడవడం వల్ల గుండెపోటు ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనంలో వెలుగుచూసింది. ఇటీవల ఓ జర్నల్‌లో ఇది ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో భాగంగా అమెరికాతో సహా మొత్తం 42 దేశాల్లో 20,000 కంటే ఎక్కువ మంది డేటాను విశ్లేషించారు. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు రోజుకు 6000 నుండి 9000 అడుగులు నడవాలని, ఇది గుండెపోటు ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుందని ఈ పరిశోధనలో తేలిందట. గుండెపోటుతో సహా పక్షవాతం ముప్పు 40 శాతం నుండి 50 శాతం వరకు తగ్గిందట. అలాగే రోజూ 7000 నుంచి 10,000 అడుగుల మధ్య నడవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేకూరుతుందని ఈ రీసెర్చిలో తేలింది. లిఫ్ట్‌కు బదులు మెట్లను ఉపయోగించడం, మీ కారును దూరంగా పార్క్ చేసి ఆఫీసుకు చేరుకోవడం, మీ పనులకు కారును ఉపయోగించకుండా నడవడం వంటి పనులతో 7000 నుండి 10,000 అడుగులు నడవడం అసాధ్యమేమీ కాదంటున్నారు ఇందులో పాల్గన్న పరిశోధకులు.
అయితే మొదటి రోజే ఎక్కువ దూరం కాకుండా క్రమంగా అడుగుల సంఖ్యను పెంచుకోవాలంటున్నారు. మొదట ఒక వారం పాటు ప్రతిరోజూ 500 అడుగులు నడవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత ఈ సంఖ్యను క్రమంగా పెంచుకోండి. ఇలా నడవడం వల్ల గుండె, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఇది చాలా సహాయకారిగా ఉంటుంది. రోజుకు 6,000 కంటే ఎక్కువ స్టెప్స్ తీసుకోవడం వల్ల కండరాలలో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఇది గుండె, రక్తనాళాలకు మేలు చేస్తుంది. అలాగే రక్తపోటు, శరీర బరువును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇక వృద్ధాప్యంలో ఎక్కువ నడవడం వల్ల మలబద్ధకం సమస్యలు తగ్గిపోతాయి. అలాగే శారీరకంగా, మానసికంగా మరెంతో చురుగ్గా ఉంటారు. ఒక నిమిషంలో సుమారు 100 అడుగులు వేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ9 తెలుగు ధ్రువీకరించడం లేదు.




మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




