Guillain Barre Syndrome: వణికిస్తున్న మరో వింత వ్యాధి.. ఆ దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ.. మన పరిస్థితి ఏంటి?
ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం గులియన్ బారే సిండ్రోమ్ అనేది చాలా తీవ్రమైన రుగ్మత. ఇది రోగ నిరోధక వ్యవస్థతో పాటు నాడీ వ్యవస్థలోని ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేస్తుంది. దీని వల్ల ఎక్కడలేని బలహీనత, తిమ్మిర్లు, జలదరింపు వంటివి కనిపిస్తాయి.

ప్రపంచాన్ని మరో వింత వ్యాధి వణికిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంత మంది ప్రాణాలను కోల్పోయారో లెక్కలేదు. ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటికీ గుండెల్లో దడ మొదలవుతుంది. ఇప్పుడు అదే కోవలో మరో వ్యాధి సౌత్ అమెరికాలోని పెరూలో వ్యాప్తి చెందుతోంది. దీని పేరు గులియన్ బారే సిండ్రోమ్(Guillain Barre syndrome, GBS). దీని కారణంగా పెరూ దేశంలో మూడు నెలల పాటు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారంటే వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధితో ఇప్పటికే నలుగురు మృతి చెందగా, వందల సంఖ్యలో ఆస్పత్రుల పాలయ్యారు. ఈ రోగుల సంఖ్య ఇంకా పెరుగుతుండటంతో చికిత్సకు అవసరమైన మందులను వేగవంతం సరఫరా చేసేందుకు, రోగులకు మంచి చికిత్స అందించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ వ్యాధి ప్రబలడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ దీనిపై పెరూ హెల్త్ మినిస్ట్రీ అధ్యయనం చేస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి.
గులియన్ బారే సిండ్రోమ్ అంటే..
ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం గులియన్ బారే సిండ్రోమ్ అనేది చాలా తీవ్రమైన రుగ్మత. ఇది రోగ నిరోధక వ్యవస్థతో పాటు నాడీ వ్యవస్థలోని ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేస్తుంది. దీని వల్ల ఎక్కడలేని బలహీనత, తిమ్మిర్లు, జలదరింపు వంటివి కనిపిస్తాయి. లక్షణాలు గుర్తించి చికిత్స తీసుకోకపోతే పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంది. చివరికి వ్యక్తి మరణానికి కూడా కారణమవుతుంది. ఈ వ్యాధికి ప్రధాన కారణంపై అధ్యయనం కొనసాగుతున్నప్పటికీ ఇలాంటి వ్యాధులు సాధారణంగా గ్యాస్ట్రోఎంటెరిటిస్ లేదా ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ వంటి వాటి వల్ల వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ చెబుతున్న దాని ప్రకారం గులియన్ బారే సిండ్రోమ్ 100,000 మంది ఒకరికి మాత్రమే వస్తుందని, దీనికి చికిత్స లేదని, లక్షణాల తీవ్రతను మాత్రమే తగ్గించే అవకాశం ఉంటుందని చెబుతోంది.
జీబీఎస్ లక్షణాలు ఇవి..
ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందే వ్యాధి. కొందరిలో కొన్ని గంటల్లోనే తీవ్రమవుతుంది. సాధారణంగా బలహీనత, జలదరింపు వంటి ప్రాథమిక లక్షణాలతో వ్యాధి బయటపడుతుంది. ఇతర లక్షణాలు ఇలా ఉన్నాయి..
- కండరాల బలహీనత
- నడవడంలో ఇబ్బంది
- మీ కళ్లు లేదా ముఖాన్ని కదల్చలేకపోవడం
- మాట్లాడటం లేదా ఆహారం తినడం/మింగడం కూడా కష్టమవుతుంది
- వీపు కింది భాగంలో భరించలేని నొప్పి
- మూత్రాశయం పట్టుకోల్పోతుంది
- వేగవంతమైన హృదయ స్పందన రేటు
- ఊపిరి ఆడకపోవడం
- పక్షవాతం
- వైద్యుల అభిప్రాయం ప్రకారం ఈ వ్యాధిని ముందుగా గుర్తించి, సరైన చికిత్స తీసుకుంటే ఆరు నెలల్లో కొలుకొనే అవకాశం ఉంటుంది.
మన దేశంలో పరిస్థితి..
పెరూలో ఈ వింత వ్యాధి వ్యాప్తిచెందుతుండటంతో మన దేశంలో కూడా ఆందోళన పెరుగుతోంది. గతంలో ఇక్కడ ఈ వ్యాధికి సంబంధించిన కేసులు కొన్ని నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 79 జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) చెబుతున్న దాని ప్రకారం ఇక్కడ డయేరియా లేదా ఇతర ఇన్ ఫెక్షన్స్ ను కొలుకున్న వారిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. ఎందుకంటే ఈ గులియన్ బారే సిండ్రోమ్ కి సాధారణంగా పేర్కొనే కారణం కాంపిలోబాక్టర్ జెజుని ఇన్ ఫెక్షన్ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇది వాతావరణ మార్పుల కారణంగా పిల్లలను ప్రభావితం చేస్తోంది. నిపుణులు చెబుతున్న దాని ప్రకారం డయేరియా కారణంగా ఆస్పత్రిలో చేరిన ఐదేళ్లలోపు పిల్లలలో 10శాతం మందిలో కాంపిలోబాక్టర్ ఉంటుంది.
మరిన్ని హెల్త్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



