Health Tips: మధ్యాహ్నం భోజనం లేటుగా చేస్తున్నారా.? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!
ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి, ఆర్ధిక పరిస్థితులు వెరిసి.. చాలామంది వ్యక్తులు బ్రేక్ ఫాస్ట్, లంచ్ సరైన సమయానికి చెయ్యట్లేదు.
ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి, ఆర్ధిక పరిస్థితులు వెరిసి.. చాలామంది వ్యక్తులు బ్రేక్ ఫాస్ట్, లంచ్ సరైన సమయానికి చెయ్యట్లేదు. లంచ్ టైంకి టిఫిన్, స్నాక్స్ టైంకు లంచ్ తిన్నట్లయితే.. లేనిపోని అనారోగ్య సమస్యలు, గ్యాస్, ఊబకాయం లాంటివి తలెత్తుతాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. భోజనం టైంకు చేయాలని.. మధ్యాహ్నం 3 గంటలలోపు పూర్తి చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇలా చేయడం వల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. తాజాగా బర్మింగ్‌హామ్‌లోని అలబామా యూనివర్శిటీ పరిశోధకులు చేపట్టిన ఓ అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
ఈ అధ్యయనంలో 90 మంది ఊబకాయం ఉన్నవారిని తీసుకున్న పరిశోధకులు.. వాళ్లను రెండు టీమ్స్ కింద విడగొట్టారు. అందులో ఒక టీంకు కచ్చితమైన సమయాల్లో ఆరోగ్యకరమైన భోజనం పెట్టడమే కాకుండా సుమారు రెండున్నర గంటల పాటు వ్యాయామం చేయించారు. అటు మరో టీంను ఉపవాసం చేయించారు.
వీరిలో మధ్యాహ్నం 3 గంటలలోపు భోజనం చేసినవారిలో ఇన్సులిన్ స్థాయిలు ఎక్కువసేపు ఉండటమే కాకుండా.. క్యాలరీలు కరిగిపోవడాన్ని గమనించారు. అలాగే శరీరంలో మెటబాలిజం స్థాయిలు సమతుల్యంగా ఉండటంతో పాటు.. రక్తపోటులో కూడా మార్పులు జరిగాయని నిర్ధారించారు. అటు 6 సార్లు ఉపవాసం చేసినవారిలోనూ సత్ఫలితాలు కనిపించినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అధ్యయనాన్ని 14 వారాల పాటు పరిశోధకులు చేశారు.
కాగా, సమయానికి భోజనం చేయడం, జీవనశైలిలో పలు మార్పులు చేసుకోవడం వల్ల ఊబకాయం సమస్యను దూరం చేయొచ్చునని వైద్యులు అంటున్నారు. మితంగా క్యాలరీలు తీసుకోవడం, రాత్రుళ్లు కూడా 8 గంటలలోపు ఆహారాన్ని తీసుకుంటే.. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుందని.. వీటితో పాటు కంటికి సరపడా నిద్ర పడితే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని డాక్టర్స్ చెప్పారు.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసమే. వీటిలో ఏవైనా పాటించాలని అనుకుంటే, తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి.