Cancer: క్యాన్సర్ లక్షణాలు… వీటిలో ఏది కనిపించినా అశ్రద్ధ చేయవద్దు
క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించగలిగే కొన్ని రకాల లక్షణాలను కూడా రోగులు పట్టించుకోవడం లేదు. ప్రారంభంలోనే ఈ వ్యాధిని గుర్తిస్తే.. చికిత్స తీసుకుని మళ్లీ సాధారణ జీవితం గడపవచ్చు. భారతదేశంలో ప్రతి సంవత్సరం క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. క్యాన్సర్ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

క్యాన్సర్.. అనేది అత్యంత ప్రమాదకర వ్యాధి. ప్రారంభంలోనే ఈ వ్యాధిని గుర్తిస్తే.. దాని నుంచి బయటపడొచ్చు. చాలా రకాల క్యాన్సర్లు తీవ్రంగా ముదరకముందే గుర్తించి.. ట్రీట్మెంట్ తీసకుంటే మళ్లీ సాధారణ జీవితం బతకవచ్చు. చాలామంది.. ఈ మహమ్మారి సంకేతాలను పట్టించుకోవడం లేదు. క్యాన్సర్ రోగులు సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, ధూమపానం, జీవనశైలిలో మార్పులు క్యాన్సర్‌కు కారణమవుతున్నాయి. మీకు ఎప్పుడూ కడుపునొప్పి ఉంటే, చికిత్స తర్వాత కూడా ఉపశమనం పొందకపోతే, అది పెద్దప్రేగు క్యాన్సర్ అయి ఉండొచ్చు. కిడ్నీలో ఎలాంటి సమస్య లేకుండా మూత్ర సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతుంటే.. ప్రొస్టేట్ క్యాన్సర్ పరీక్ష చేయించుకోండి. అలానే రొమ్ములో గడ్డ ఏర్పడి దాని నుండి ఉపశమనం లభించకపోతే, బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ చేసుకోండి. ప్రజలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చూపుతోన్న క్యాన్సర్ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
ఆకస్మికంగా బరువు తగ్గడం: కారణం లేకుండా మీరు అకస్మాత్తుగా బరువు తగ్గిపోతే , అది క్యాన్సర్ లక్షణం అని వైద్యులు చెబుతున్నారు. రోజుల వ్వవధిలో ఐదు లేదా అంతకంటే ఎక్కువ కేజీలు బరువు తగ్గిపోతే.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, కడపు వంటి క్యాన్సర్స్ అటాక్ అయిన సందర్భాల్లో ఇలా జరుగుతుంది.
శరీరంలో నొప్పిని కలిగించని గడ్డ ఏర్పడటం: శరీరంలో ఒక గడ్డ ఏర్పడి, నొప్పి లేకుండా, అది నిరంతరం పెరుగుతూ ఉంటే, ఇది కూడా క్యాన్సర్ లక్షణమే. ఇలాంటి 80 నుండి 90 శాతం కేసులలో క్యాన్సర్ ఉన్నట్లు తేలుతోంది.
ఎల్లప్పుడూ తేలికపాటి జ్వరం: క్యాన్సర్ వచ్చిన రోగుల్లో జ్వరమనేది సాధారణ లక్షణం. క్యాన్సర్ పుట్టిన దగ్గర్నుంచి ఇతర అవయాలకు, శరీర భాగాలకు స్ప్రెడ్ అయ్యేప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది. తేలికపాటి జ్వరం ఎల్లప్పుడూ శరీరంలో ఉండి, మందులు తీసుకోవడం ద్వారా నయమవుతుంది. కానీ మళ్లీ జ్వరం వచ్చినట్లయితే, అది క్యాన్సర్ లక్షణం కావచ్చు. ఈ విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.
అలసట: క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి అలసట. రెస్ట్ తీసుకున్నా కూడా అలసట నుంచి బయటపడలేరు. క్యాన్సర్ పెరుగుతుందనే దానికి ఇది ప్రధాన సంకేతంగా భావించాలి.
శరీరంలో మార్పులు: శరీర రంగు నల్లగా మారిపోవడం, చర్మం ఎర్రగా మారడం, దురద రావడం, శరీర రంగు, కళ్లు పసుపు పచ్చగా మారడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
రక్తస్రావం: ఒకవేళ మలంలో రక్తం పడితే, అది పెద్ద పేగు క్యాన్సర్‌కు లేదా మల క్యాన్సర్‌కు సిగ్నల్ కావొచ్చు. మూత్రంలో రక్తం కనిపించడం బ్లాడర్ లేదా కిడ్నీ క్యాన్సర్‌కు సంకేతం.
విపరీతమైన దగ్గు: 3 వారాలకు మించి దీని వల్ల ఇబ్బంది పడుతుంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. విపరీతంగా దగ్గు రావడం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతం.
పుట్టుమచ్చలు, పులిపిర్లు పెరగడం: పుట్టుమచ్చలు లేదా పులిపిర్లు పెరిగి, వాటి నుంచి రక్తం కారడం చర్మ క్యాన్సర్ లక్షణాలని గ్రహించాలి. చిన్న గాయాలైనా ఎక్కువ కాలం మానకపోవడం కూడా క్యాన్సర్‌కు సంకేతంగా భావించి.. డాక్టర్ వద్దకు వెళ్లాలి.
ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ సింగ్ మాట్లాడుతూ, కొన్ని క్యాన్సర్‌లు ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమించే ప్రమాదం ఉందని చెప్పారు. ఉదాహరణకు, రొమ్ము క్యాన్సర్ రెండవ తరానికి కూడా వ్యాపిస్తుంది. అందువల్ల, రొమ్ము క్యాన్సర్ కుటుంబ చరిత్ర ఉన్న స్త్రీలు 30 సంవత్సరాల వయస్సు తర్వాత ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుంటూ ఉండాలి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




