
ఉరుకుల పరుగుల జీవితం.. వారం అంతా తీరిక లేని షెడ్యూల్స్.. నిద్ర కూడా కరువైపోతుంది. ఇక వీకెండ్ దొరికిందంటే చాలు ప్రశాంతంగా పడుకుందాం అని అనుకుంటారు. మీరు కూడా ఇలానే చేస్తున్నారా? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే అంటున్నారు నిపుణులు. రోజూ తక్కువ నిద్రపోయి.. వారాంతంలో అధికంగా నిద్రపోయే వారి శరీరంలో సమతుల్యత దెబ్బతినడంతో పాటు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రోగాలు చుట్టుముడతాయని హెచ్చరిస్తున్నారు. రోజూ ఆకలి వేస్తుంది.. ఈ రోజు వద్దులే రేపు తిందాంలే అంటే ఏమవుతుంది? నీరసం వస్తుంది! అలాగే రోజూ శరీరం పునరుత్తేజితం కావడానికి సరిపడినంత నిద్రకు కూడా అవసరమే.
సాధారణంగా రోజులో ఒక వ్యక్తికి కనీసం 6 నుంచి 7 గంటల సుఖ నిద్ర అవసరం. ఈ సమయంలోనే మనిషి శరీరం పునరుత్తేజితం అవుతుంది. అన్ని అవయవాలు, లోపల వ్యవస్థలు సక్రమంగా పనిచేసేందుకు ఈ నిద్రే దోహదం చేస్తుంది. అప్పుడు శరీరానికి కావాల్సిన వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. బ్రెయిన్, నరాలు సక్రమంగా పనిచేస్తాయి. జీర్ణవ్యవస్థ దెబ్బతినకుండా ఉంటుంది. ఇన్సులిన్ ఫంక్షనింగ్ క్రమంగా జరుగుతుంది. సరిపడిన బాడీ వెయిట్ మెయింటేన్ అవుతుంది.
ఒక వేళ మనిషికి నిద్ర తగ్గితే ఏమవుతుంది అనే దానిపై యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ వారు అధ్యయనం చేశారు. అది ఏంటంటే.. కొంత మంది వలంటీర్లను ఎంపిక చేసి వారిని రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోనిచ్చారు. ఇలా ఐదు రోజులు చేశారు. మిగిలిన రెండు రోజులు రోజుకు 10 గంటల చొప్పున నిద్రకు అవకాశం ఇచ్చారు. ఇలా చేయడం వల్ల వారి శరీరంలో చోటుచేసుకుంటున్న మార్పులను అధ్యయనం చేశారు. తక్కువ నిద్ర కారణంగా కొన్ని స్పల్పకాలిక, మరికొన్ని దీర్ఘకాలిక మార్పులు శరీరంలో చోటుచేసుకున్నట్లు వారు గుర్తించారు.
స్పల్పకాలిక సమస్యలు.. నిద్రలేమి కారణంగా వ్యక్తి ఫోకస్ తగ్గిపోవడం, శక్తి హీనత, నిస్సత్తువ, నీరసం, చిన్న విషయాలకే టెంపర్ కోల్సోవడం, అతి కోపం, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు పెరిగి చేసే పనిపై ప్రభావం వెంటనే పడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
దీర్ఘకాలిక సమస్యలు.. ఇక తక్కువ నిద్ర పోతున్నప్పుడు దీర్ఘకాలంలో మధుమేహం, బీపీ, థైరాయిడ్, గుండె వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, అధిక బరువు వంటివి చుట్టుముడుతున్నట్లు నిర్ధారించారు.
గురకతో ముప్పే.. అలాగే గురకను మనం మత్తు నిద్రకు సూచికగా భావిస్తాం. అయితే అది ఒక్కో సారి హార్ట్ అటాక్ కు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర సమయంలో గాలి లోపలికి వెళ్లే మార్గాలు మూసుకుపోయి గుండెపై భారం అధికమయ్యే అవకాశాలున్నట్లు వారు పేర్కొన్నారు.
నిద్రలేమి, వారాంతంలో అధిక నిద్ర వంటి వాటిపై కొలరాడో యూనివర్సిటీ పరిశోధకులు చేసిన మరో అధ్యయనంలో మరిన్ని వాస్తవాలు తెలిశాయని వారు వెల్లడించారు. ముఖ్యంగా ఇన్సులిన్ సెన్సిటివిటీ దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. అలాగే బరువు పెరగడానికి అది దోహదం చేస్తున్నట్లు చెప్పారు.
మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..