
చాలా మంది బిర్యానీతో శీతల పానీయాలు తాగడానికి ఇష్టపడతారు. వేడుక చిన్నదైనా, పెద్దదైనా ప్రతి పార్టీలో సోడా డ్రింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ వీటిని ఇష్టంగా సేవిస్తారు. ఇక ఇంట్లో కూడా ఫ్రిజ్‌లో భద్రపరచి మరీ సోడా డ్రింక్స్ తాగేస్తుంటారు. కానీ ఇలా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎంత ప్రమాదమో చాలా మందికి తెలియదు. నిజానికి కూల్ డ్రిండ్స్‌లో కృత్రిమ స్వీటెనర్ ఉంటుంది. అయితే ఇలాంటి డ్రింక్స్ తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో నిపుణుల మాటల్లో తెలుసుకోండి..
ప్రముఖ పోషకాహార నిపుణుడు అరిజిత్ ఏం చెబుతున్నారంటే.. ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోనే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. వైద్యులు, పోషకాహార నిపుణులు అనారోగ్యకరమైన ఆహారం, మద్యపానం ఇందుకు కారణమని చెబుతుంటారు. ఈ కారణాల్లో ఒకటి శీతల పానీయాలు కూడా ఉన్నాయి. సోడా డ్రింక్స్ ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇటువంటి పానీయాలలో చక్కెర చాలా అధికంగా ఉంటుంది. చక్కెర శరీర బరువు పెరిగేలా చేస్తుంది. అందువల్లనే ఫ్యాటీ లివర్ ప్రమాదం పెరుగుతుంది. శీతల పానీయాలలో కృత్రిమ స్వీటెనర్, వివిధ కారకాలతో తయారు చేస్తారు. క్యాలరీ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. రోజూ తాగకపోయినా.. రోజు విడిచి రోజు శీతల పానీయాలు తాగినా బరువు పెరగడం ఖాయం. శీతల పానీయాల వల్ల కలిగి దుష్ర్పభావాలలో మరొకటి ఏంటంటే.. ఈ విధమైన పానియాలు జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తాయి. ఇది రక్తపోటు పెరగడం, టైప్-2 మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలకు కూడా దారితీయవచ్చు. ఇటువంటి పానీయాలు దంత క్షయాన్ని పెంచుతాయి. శీతల పానీయాలు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.
అంటే మధుమేహం, కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. శీతల పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అటువంటి దీర్ఘకాలిక వ్యాధులు మరణానికి దారితీస్తాయి. ఇటువంటి పానీయాలు పిల్లల రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. ఇలాంటి డ్రింక్స్ తాగడం వల్ల పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. అంతేకాకుండా ఫ్యాటీ లివర్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే చాలా మంది పండ్ల రసాలు బాటిల్‌లో లేదా ప్యాక్‌లో ఉంటే ఆరోగ్యంగా ఉంటాయని భావించి.. వాటిని కొనుగోలు చేస్తుంటారు. కానీ అవి కూడా శీతల పానీయాల మాదిరిగానే హానికరం. ప్యాక్ చేయబడిన పండ్ల రసాలలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. అవి ఆరోగ్యానికి చాలా హానికరం. ఇవి కూడా దీర్ఘకాలిక వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి.. అని అరిజిత్ చెబతున్నారు. అలాగే బిర్యానీ లాంటి హై క్యాలరీ ఫుడ్ తినే సమయంలో కూల్ డ్రింక్స్ తాగితే మరింత ప్రమాదం అని ఆయన అంటున్నారు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.