చలికాలంలో మార్నింగ్ వాకింగ్ చేస్తే గుండెపోటు వస్తుందా.. డాక్టర్లు చెప్పింది వింటే షాకే..
Morning Walk Risks: చలి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ ముఖ్యం. ఉదయం నడక గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాకింగ్ హెల్త్‌కి మంచిది అని అంటారు. మరి వాకింగ్ వల్ల నిజంగానే హార్ట్ ఎటాక్ వస్తుందా..? ఎవరికి రిస్క్ ఎక్కువ ఉంటుంది..? అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

దేశంలో చలి పంజా విసురుతోంది. ఈ సీజన్‌లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని, స్వల్ప నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకం కావచ్చునని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో చేసే ఉదయం నడక గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం, పొగమంచు, చలి ఉన్న ప్రాంతాల్లో ఉదయం పూట నడకకు వెళ్లడం అత్యంత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. శరీరం తనను తాను వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నించే క్రమంలో రక్త నాళాలు సంకోచిస్తాయి. దీనివల్ల రక్తపోటు పెరిగి, రక్తాన్ని పంప్ చేయడానికి గుండెపై రెట్టింపు ఒత్తిడి పడుతుంది. ఈ క్రమంలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఎవరు ఎక్కువ రిస్క్‌లో ఉన్నారు?
ఢిల్లీలోని రాజీవ్ గాంధీ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అజిత్ జైన్, డాక్టర్ బన్సాల్ ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉదయం పూట బయటకు రావద్దని సూచిస్తున్నారు..
గుండె రోగులు: ఇప్పటికే గుండె బలహీనంగా ఉన్నవారికి మరో అటాక్ వచ్చే అవకాశం ఉంది.
అధిక రక్తపోటు ఉన్నవారు: చలి వల్ల రక్తపోటు అకస్మాత్తుగా పెరిగి గుండె లయ తప్పవచ్చు.
వృద్ధులు: వయసు పైబడిన వారు చలిని తట్టుకోలేక ఆకస్మిక ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది.
నడక పూర్తిగా ఆపేయాలా?
వైద్యుల సలహా ప్రకారం.. రిస్క్ గ్రూపులో లేని వారు నడవవచ్చు, కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి..
సమయం మార్చుకోండి: ఉదయం 6-7 గంటల లోపు కాకుండా ఎండ వచ్చిన తర్వాత లేదా సాయంత్రం వేళ నడవడం ఉత్తమం.
దుస్తులు: తల, చెవులు, ఛాతీని కప్పి ఉంచేలా వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలి.
వేగం వద్దు: అకస్మాత్తుగా వేగంగా నడవడం లేదా జాగింగ్ చేయడం మానుకోవాలి.
ఇండోర్ వాకింగ్: కాలుష్యం ఎక్కువగా ఉంటే ఇంటి లోపలే నడవడం శ్రేయస్కరం.
ఈ లక్షణాలను అస్సలు విస్మరించకండి
- నడక సమయంలో కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి..
- నడుస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
- అకస్మాత్తుగా ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడం.
- విపరీతంగా చెమటలు పట్టడం.
- కళ్లు తిరగడం లేదా తల తిరుగుతున్నట్లు అనిపించడం.
వేసవి కాలం కంటే చలికాలంలోనే గుండెపోటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా రిస్క్ గ్రూపులో ఉన్నవారు ఉదయం పూట ఇంట్లోనే ఉండటం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
