AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు సన్‌ స్క్రీన్ వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా..?

చర్మాన్ని UV కిరణాల నుండి కాపాడటానికి సన్‌ స్క్రీన్ ముఖ్యమైన రక్షణగా పనిచేస్తుంది. కానీ కొన్ని రకాల సన్‌ స్క్రీన్‌ లలో ఉండే రసాయనాలు మన హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని కొత్త పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. అందు వల్ల సన్‌ స్క్రీన్ ఎన్నుకునే ముందు.. వాడే సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు సన్‌ స్క్రీన్ వాడుతున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా..?
Skincare Tips
Prashanthi V
|

Updated on: Jun 20, 2025 | 9:25 PM

Share

రసాయనాలతో తయారైన సన్‌ స్క్రీన్‌ లకు దూరంగా ఉండాలి. ఎక్కువగా వాడే కెమికల్ ఫిల్టర్లలో ఒక్సిబెంజోన్ (Oxybenzone), ఆక్టినాక్సేట్ (Octinoxate) లాంటివి ఉన్నాయి. ఇవి చర్మంలోకి వెళ్లి రక్తంలోకి చేరే అవకాశం ఉంది. పరిశోధనల ప్రకారం.. ఇవి ఈస్ట్రోజన్ హార్మోన్‌ ను పోలి ఉండగలవు. ఇది మగవారి టెస్టోస్టెరాన్ స్థాయిపై.. ఆడవారి హార్మోన్ల సమతుల్యంపై ప్రభావం చూపవచ్చు. అందువల్ల ఎక్కువ కాలం వాడితే ఇవి హార్మోన్ల సమస్యలకు దారి తీయవచ్చు.

అన్ని రసాయనాల ప్రభావం ఇంకా తెలియదు. ఒకసారి చూస్తే సురక్షితంగా కనిపించే హోమోసలేట్, ఆక్టిసలేట్, అవోబెంజోన్ లాంటి UV ఫిల్టర్లపై పూర్తి సమాచారం లేదు. ఇవి తక్కువ స్థాయిలో శరీరంలో పేరుకుపోతాయా..? ఎక్కువ వాడితే శరీరానికి నష్టం చేకూరుస్తాయా..? అనే ప్రశ్నలకు స్పష్టత ఇంకా రాలేదు. ముఖ్యంగా కిడ్నీలు, లివర్ లాంటి అవయవాలపై ఎక్కువ కాలం వీటి ప్రభావాలు ఎలా ఉంటాయో ఇంకా పరిశోధనలు చేయాలి.

సురక్షితంగా ఉండాలంటే మినరల్ ఆధారిత సన్‌ స్క్రీన్‌ లే మంచివి. సన్‌ స్క్రీన్‌ లో జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్ లాంటి ఖనిజాలు ఉన్న వాటిని ఎంచుకుంటే ఇవి చర్మంపైనే ఉంటాయి. లోపలికి వెళ్ళవు. అందువల్ల హార్మోన్లకు ప్రమాదం కలిగించే అవకాశాలు తక్కువ. ఇవి వేడికి ప్రతిఘటించేలా పనిచేస్తాయి కాబట్టి.. పిల్లలు, గర్భిణీ స్త్రీలు కూడా భద్రంగా వాడవచ్చు.

భారత్‌ లో అమెరికాలో ఇప్పటికీ కెమికల్ UV ఫిల్టర్లను అనుమతిస్తున్నారు. అయితే హవాయి లాంటి కొన్ని చోట్ల పర్యావరణానికి హాని కారణంగా కొన్ని రసాయనాలపై నిషేధం విధించారు. యూరప్‌ లో అయితే సాంకేతిక కమిటీలు కొన్ని UV ఫిల్టర్లను తక్కువ మోతాదుల్లో మాత్రమే అనుమతించాలని సూచిస్తున్నాయి. ఇది వాటి ప్రభావాలపై ఉన్న అస్పష్టతను చూపుతుంది. సన్‌ స్క్రీన్ వాడేటప్పుడు పాటించాల్సిన సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • లేబుల్‌ను జాగ్రత్తగా చదవాలి.. ముఖ్యంగా కెమికల్ UV ఫిల్టర్లు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి.
  • పిల్లలు, గర్భిణీలు, హార్మోన్ సమస్యలు ఉన్నవారు కచ్చితంగా మినరల్ ఆధారిత సన్‌ స్క్రీన్‌ లను ఎంచుకోవాలి.
  • Tinosorb, Mexoryl SX/XL లాంటి కొత్త UV ఫిల్టర్లు ఉన్న సన్‌ స్క్రీన్‌ లు తక్కువగా శరీరంలోకి వెళ్ళే ప్రమాదం ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.
  • రెండు గంటలకోసారి సన్‌ స్క్రీన్‌ ను మళ్లీ అప్లై చేయాలి. స్విమ్మింగ్ చేసిన తర్వాత కూడా కచ్చితంగా తిరిగి అప్లై చేయాలి.

సన్‌ స్క్రీన్ చర్మాన్ని రక్షించడానికి చాలా అవసరం. కానీ ఏది వాడుతున్నామో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపే రసాయనాలున్నవి కాకుండా.. సురక్షితమైన మినరల్ ఆధారిత సన్‌ స్క్రీన్ ఎంచుకోవడం ద్వారా ఆరోగ్యానికి హాని లేకుండా మీ చర్మాన్ని UV కిరణాల నుండి కాపాడుకోవచ్చు. ఈ విషయంలో మీరు డెర్మటాలజిస్ట్ (చర్మ వైద్య నిపుణుడు) సలహా తీసుకోవడం మరింత మంచిది.