ఐస్ క్రీమ్ తింటే నిజంగానే శరీరం చల్లబడుతుందా..? వేసవిలో ఐస్ క్రీమ్ తినడం మంచిదేనా..?
వేసవిలో ఐస్ క్రీం తింటే శరీరం చల్లబడుతుందని అనుకుంటారు. కానీ ఇది నిజమేనా..? ఐస్ క్రీం తినడం వల్ల కేవలం తాత్కాలికంగా చల్లగా అనిపించవచ్చు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు ఇది పెద్దగా సహాయపడదు. అసలు వేడిలో చల్లబడేందుకు ఏం చేయాలి..? ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవి కాలంలో మండే వేడి పెరిగినప్పుడు ఐస్ క్రీం తినడం ఆనందంగా ఉంటుంది. క్రీమీ టెక్స్చర్, రుచికరమైన ఫ్లేవర్లు అన్నీ కలిసి ఐస్ క్రీంను పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన తీపి పదార్థంగా మారుస్తాయి. ఎక్కువగా వేడి వాతావరణంలో ఐస్ క్రీం తింటే శరీరాన్ని చల్లబరుస్తుందని నమ్ముతారు. కానీ ఈ నమ్మకానికి నిజమైన ఆధారముందా..? దీనిపై లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఒక చెంచా ఐస్ క్రీం నోట్లో వేసుకున్న వెంటనే చల్లదనాన్ని అనుభవిస్తాం. ఇది ఐస్ క్రీం తక్కువ ఉష్ణోగ్రతలో ఉండటంతో సంభవిస్తుంది. నోటిలోని వెచ్చని ఉపరితలంతో ఐస్ క్రీం తాకినప్పుడు కొంత వేడి శరీరం నుండి ఐస్ క్రీంకు బదిలీ అవుతుంది. దీని వల్ల తాత్కాలికంగా చల్లబడ్డ అనుభూతి కలుగుతుంది. కానీ ఈ ప్రభావం చాలా చిన్న సమయంలో మాత్రమే ఉంటుంది. శరీర మొత్తం ఉష్ణోగ్రతను తగ్గించే స్థాయిలో ఇది పనిచేయదు.
మన శరీరానికి ఉష్ణోగ్రతను సమతుల్యం చేసే అద్భుతమైన వ్యవస్థ ఉంది. సాధారణంగా శరీర ఉష్ణోగ్రత 36.5°C నుండి 37.5°C మధ్య ఉంటుంది. మెదడులోని హైపోథాలమస్ అనే భాగం శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించే ప్రధాన భాగం. బయట వేడి పెరిగినప్పుడు చెమట పట్టడం ద్వారా శరీరం వేడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది.
ఐస్ క్రీం తినడం వల్ల నోటిలో తాత్కాలిక చల్లదనం అనుభవించవచ్చు. కానీ ఇది శరీర ఉష్ణోగ్రతను పూర్తిగా తగ్గించదు. అసలు విషయం ఏమిటంటే..? శరీరం చల్లని పదార్థాన్ని తీసుకున్నప్పుడు కోర్ ఉష్ణోగ్రత తక్కువగా తగ్గకుండా నియంత్రించేందుకు ప్రయత్నిస్తుంది. హైపోథాలమస్ నోటిలో చల్లదనాన్ని గుర్తించి శరీరం వెచ్చదనాన్ని పోగొట్టుకోవద్దనేలా చర్యలు తీసుకుంటుంది. దీని కారణంగా శరీరం కొంత మేరకు వేడి ఉత్పత్తి చేస్తుంది.
ఐస్ క్రీం తింటే కాసేపు చల్లగా అనిపించవచ్చు. కానీ అది శరీరాన్ని పూర్తిగా చల్లబరచదు. వేసవిలో వేడి తగ్గించుకోవాలంటే ఎక్కువ నీరు తాగాలి, నీడలో ఉండాలి, తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఐస్ క్రీం కేవలం తీపి తినుబండారమే. దీన్ని శరీర ఉష్ణోగ్రత తగ్గించే మార్గంగా భావించకూడదు.