Black Fever: ఇప్పుడున్న జీవనశైలి కారణంగా రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అందుకే మంచి ఆహారం, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు. ఇక పశ్చిమ బెంగాల్‌లోని 11 జిల్లాల్లో 65 బ్లాక్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్ నుండి బ్లాక్ ఫీవర్ పూర్తిగా నిర్మూలించబడింది. కానీ తిరిగి మళ్లీ కేసులు నమోదు కావడం కలవరపెడుతున్నాయి. అదే సంవత్సరంలో జార్ఖండ్‌లో నల్ల జ్వరం కారణంగా ఒకరు మరణించారు. గత 8 ఏళ్లలో ఇక్కడ ఇదే మొదటి కేసు. బ్లాక్ ఫీవర్‌ని కాలా అజర్ అని కూడా అంటారు. ఈ వ్యాధికి కారణం Leishmania donovani అనే పరాన్నజీవి. ఇప్పటివరకు దీనికి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయలేదు. శాండ్‌ఫ్లై కాటు ద్వారా శరీరంలోకి చేరే ఈ వ్యాధికి లీష్మానియా అనే పరాన్నజీవి ఈ బ్లాక్ ఫీవర్ కు కారణం. ఈ సాండ్‌ఫ్లై గోధుమ రంగులో ఉంటుంది. ఈ ప్రత్యేక రకం ఫ్లై మట్టి , అధిక తేమ ఉన్న ఇళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధికి కారణమయ్యే 3 రకాల పరాన్నజీవులు ఉన్నాయి.
వ్యాధి వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఇప్పటికే పోషకాహార లోపంతో బాధపడుతున్న వ్యక్తులు బ్లాక్ ఫీవర్‌తో బాధపడే అవకాశం ఉంది. ఇల్లు శుభ్రంగా లేకపోవడం, రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి ఎక్కువగా వస్తుంటుంది. అంతే కాకుండా వాతావరణంలో వచ్చే మార్పులు కూడా ఈ వ్యాధికి కారణం. 2020లో బ్రెజిల్, చైనా, ఇథియోపియా, ఇండియా, కెన్యా, సోమాలియా, దక్షిణ సూడాన్, యెమెన్‌లలో 90 శాతం కేసులు నమోదయ్యాయి.
పశ్చిమ బెంగాల్‌లో ఎక్కడ నమోదయ్యాయి..?
రాష్ట్రంలో అత్యధికంగా డార్జిలింగ్, మాల్దా, నార్త్ దినాజ్‌పూర్, దక్షిణ్ దినాజ్‌పూర్, కాలింపాంగ్‌లలో కేసులు నమోదయ్యాయి. ఇది కాకుండా, బీర్బామ్, పురూలియా, ముర్షిదాబాద్‌లలో కూడా కొన్ని కేసులు కనిపించాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌లలో నివసించే వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని పశ్చిమ బెంగాల్ అధికారులు చెబుతున్నారు.
నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (NCVBDC) డేటా ప్రకారం.. దేశంలో 160 మిలియన్ల మంది ప్రజలు ఈ వ్యాధి ప్రమాదకర జోన్‌లో ఉన్నట్లు అంచనా. గత కొన్నేళ్లుగా భారత్‌లో దీని కేసులు తగ్గుముఖం పట్టాయి. 2014లో 9,200 కేసులు నమోదు కాగా, 2021లో ఈ సంఖ్య 1,276కి పడిపోయింది.
ఎలాంటి లక్షణాలు:
ఇందులో కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. చాలా రోజులు జ్వరం, బరువు తగ్గడం, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. అటువంటి సందర్భాలలో చర్మం పొడిగా మారుతుంది. దద్దుర్లు వస్తాయి. జుట్టు రాలడం మొదలవుతుంది. చర్మం రంగు బూడిద రంగులో కనిపించడం ప్రారంభమవుతుంది. దీని ప్రభావం చేతులు, కాళ్లు, పొట్ట, వీపుపై కనిపిస్తుంది. అందుకే దీనికి బ్లాక్ ఫీవర్ అని పేరు పెట్టారు. ఈ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు నిపుణులు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..