AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిప్రెషన్‌కు బలైపోయిన విజయ్ ఆంటోని కుమార్తె.. కుంగుబాటు అంత ప్రమాదకరమా..?

బిచ్చగాడు సినిమా హీరో విజయ్‌ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్యతో.. విజయ్‌ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. పలువురు కోలీవుడ్‌ ప్రముఖులు.. విజయ్‌ని పరామర్శించారు. ఇంటర్‌ చదువుతున్న మీరా కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధ పడుతున్నట్లు సమాచారం. ఆమె మరణానికి కూడా అదే కారణమని ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. ఇవాళ ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు.

డిప్రెషన్‌కు బలైపోయిన విజయ్ ఆంటోని కుమార్తె.. కుంగుబాటు అంత ప్రమాదకరమా..?
Depression
Ram Naramaneni
|

Updated on: Sep 20, 2023 | 9:02 AM

Share

చదువులో ఫస్ట్‌..ఆటల్లో బెస్ట్‌. కల్చరల్‌ యాక్టివిటీస్‌లో కూడా నెంబర్‌ వన్‌. స్కూల్లో కల్చరల్‌ యాక్టివిటీస్‌ సెక్రటరీగా కూడా ఎన్నికైంది 12వ తరగతి చదువుతున్న మీరా. ఏమైందో ఏమో ఉన్నట్టుండి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ పాప…బిచ్చగాడు సినిమా హీరో విజయ్‌ ఆంటోని పెద్ద కూతురు. ఆంటోనీ పెద్ద కుమార్తె మీరా ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయాన్నే ఇంట్లో వాళ్లు చూసేసరికి మీరా ఉరేసుకుని కనిపించింది. కావేరి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. చెన్నైలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో మీరా…12వ తరగతి చదువుతోంది. 2006లో విజయ్ ఆంటోని… నిర్మాత అయిన ఫాతిమాను పెళ్లి చేసుకున్నారు. వీరికి మీరా, లారా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు మీరా ఆత్మహత్య చేసుకోవడంతో ఆంటోనీ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ హృదయ విదారక సంఘటన విజయ్‌ కుటుంబాన్నే కాదు.. మొత్తం కోలీవుడ్‌ను షాక్‌కు గురి చేసింది. విజయ్‌ను కోలీవుడ్‌ ప్రముఖులు పరామర్శిస్తున్నారు.

హోమందూరు ప్రభుత్వాస్పత్రిలో మీరా ఆంటోనీ పోస్ట్ మార్టం పూర్తయింది. ఆమెది ఆత్మహత్యగా వైద్యులు నిర్ధారించారు. మీరా ఫోన్ ని స్వాధీనం చేసుకున్న సైబర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మీరా కొంతకాలంగా డిప్రెషన్‌లో ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయింది. డిప్రెషన్‌కు ఆమె చికిత్స కూడా తీసుకుంటోందని ఆంటోనీ సన్నిహితులు చెబుతున్నారు. మీరా మృతదేహాన్ని ఇంటికి తరలించిన కుటుంబ సభ్యులు..రేపు అంత్యక్రియలు చేయనున్నారు. కాగా ఆంటోనీ తండ్రి కూడా అతనికి ఏడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకున్నారు.

డిప్రెషన్ అంటే ఏంటి..?

డిప్రెషన్‌ అంటే కుంగుబాటుకు గురవ్వడం. ఇది చిన్న వ్యాధి కాదు. డిప్రెషన్‌తో బాధపడుతున్నవారు నరకం చూస్తారు. దేనిపైనా ఆసక్తి ఉండదు. చిన్నా, పెద్ద.. పురుషులు, స్ట్రీలు అనే బేధం లేదు. ఎవరైనా దీని బారిన పడొచ్చు. బాగా అయినవారిని కోల్పోవ‌డం, బ్రేకప్, విడాకులు,  జబ్బుల బారిన పడటం.. లాంటి ఘటనలు వల్లే ఎక్కువమంది డిప్రెషన్‌కు గురవుతూ ఉంటారు. నిద్ర స‌మ‌స్య‌లు, కొన్ని మందుల ప్రభావం, మంచి డైట్ ఫాలో అవ్వకపోవడం, మెనోపాజ్‌, కొన్నిసార్లు జ‌న్యుప‌ర‌మైన కారణాలు కూడా డిప్రెషన్‌కు కారణం అవ్వొచ్చు. సైన్స్ జర్నల్ లాన్సెట్‌ ప్రకారం.. ఇండియాలో మానసిక వైద్య సహాయం అవసరమైన ప్రతి 10 మందిలో కేవలం ఒక్కరే సేవలు పొందగలుగుతున్నారని తేలింది. ఇలానే కొనసాగితే.. మానసిక సమస్యల బారినపడినవారిలో మూడింట ఒక వంతు భారతీయులే ఉండొచ్చని ఒక అంచనా.

ఎప్పుడూ బాధలో ఉండ‌టం, నిరాశ ఆవరించడం, తనకంటూ ఎవరూ లేరు అనిపించడం, చిన్న‌చిన్న విష‌యాల‌కే విపరీతమైన కోపం రావడం,ఇష్ట‌ప‌డే ప‌నుల‌నూ ఆస్వాదించ‌లేక‌పోవ‌డం, ఎక్కువ‌ ఆందోళ‌న, లైఫ్ ఇంక లేదు అనే భావనలో ఉండటం వంటివి డిప్రెషన్ లక్షణాలు. కుంగుబాటుకు గురైనవారు దేనిపైనా  ఏకాగ్ర‌త చూప‌లేరు. ప్ర‌తికూల ఆలోచ‌న‌లతో సతమతం అవుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న‌లూ వారిని చుట్టుముడతాయి. డిప్రెషన్‌లో ఉండేవారు కుటుంబం, స్నేహితుల‌ను దూరం పెడతారు. ఆఫీసు పనులపై కూడా ఆసక్తి చూపరు. నిద్ర పట్టదు. సరిగా తినకపోవడానికి తోడు.. నెగిటివ్ ఆలోచనలతో చాలా బరువు తగ్గుతారు. ఈ లక్షణాలు దీర్ఘకాలం ఉంటే.. మాన‌సిక వైద్యులను సంప్రదించాలి. మీకు అయినవారితో, క్లోజ్ అనుకున్నవారికి పరిస్థితిని వివరించాలి. రోగి పరిస్థితిని బట్టి.. కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు మందులు రిఫర్ చేస్తారు డాక్టర్లు. యోగా, ధ్యానం, వ్యాయామం చేయడం, , మ్యూజిక్ వినడం, ఆర్ట్ థెర‌పీల‌ ద్వారా కూడా కొంతమేర స్వాంతన పొందవచ్చు.

 ఆందోళన, మానసిక సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్: 08046110007

మరిన్ని తాజా వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి