Anti Aging Secrets: వయస్సు పెరిగినా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ చిన్న మార్పులు చేయండి చాలు..!
వయసు పెరగడాన్ని మనం ఆపలేం.. కానీ ముఖం పై వయసు తాలూకు లక్షణాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మనం సరైన జీవనశైలి, మంచి ఆహారం, వ్యాయామం, తగినంత నిద్ర, ఇంకా మానసిక ప్రశాంతత పాటిస్తే మన చర్మం తాజాగా, కాంతివంతంగా ఉంటుంది.

మన వయస్సును పూర్తిగా ఆపలేం. కానీ అది ముఖం మీద ఎక్కువగా కనిపించకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. చర్మాన్ని రోజూ సరిగా చూసుకుంటే.. వయస్సు పెరిగినా యవ్వనంగా కనిపించొచ్చు. దీనికి జీవనశైలి, ఆహారం, నిద్ర లాంటివి చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ విషయాల్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
మానసిక ప్రశాంతత
మానసిక ఒత్తిడి తక్కువగా ఉంటే చర్మంపై చెడు ప్రభావాలు తగ్గుతాయి. ఒత్తిడిగా ఉంటే ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం, ప్రాణాయామం లేదా మీకు నచ్చిన పనులకు కేటాయించండి. దీని వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ ప్రశాంతత మీ చర్మంపై కూడా కనిపిస్తుంది.
పోషకాలున్న ఆహారం
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు చాలా అవసరం. విటమిన్ సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోండి. దీని వల్ల చర్మం లోపలి నుంచి బలంగా మారుతుంది. ఇవి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతాయి. తాజా పండ్లు, కూరగాయలు, జీడిపప్పు, బాదం లాంటివి చర్మానికి చాలా మంచివి.
ప్రాసెస్డ్ ఫుడ్స్
చాలా మంది ప్రాసెస్డ్ ఫుడ్స్, తీపి పదార్థాలు ఎక్కువగా తినడానికి అలవాటు పడతారు. ఇవి శరీరానికి మాత్రమే కాదు.. చర్మానికి కూడా హానికరం. ఎక్కువ చక్కెర, నూనె పదార్థాలు చర్మంలో వాపుకు దారితీస్తాయి. ఈ ప్రభావం ముఖంపై ముడతలుగా చర్మం ముదిరినట్లు కనిపించడంలో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే సహజమైన ఇంట్లో వండిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం మంచిది.
సరిపడా నీరు
చర్మం మెరిసిపోతూ తాజాగా కనిపించాలంటే శరీరంలో తేమ సరిగా ఉండాలి. దీని కోసం రోజూ కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. నీరు తక్కువ తాగితే చర్మం పొడిబారుతుంది. రంగు మారుతుంది. తగినన్ని ద్రవాలు తీసుకుంటే చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది.
ఎండకు దూరంగా ఉండండి
సూర్యరశ్మి చర్మాన్ని తొందరగా ముడతలు పడేలా చేస్తుంది. ఉదయం 11 గంటల తర్వాత బయట తిరగకుండా ఉండండి. బయటకు వెళ్తే సన్ స్క్రీన్ వాడండి. దీని వల్ల ఈ సమస్యను ఆపొచ్చు. ఎండకు ఎక్కువగా తిరగడం వల్ల చర్మ కణాలు పాడై వయస్సు ఎక్కువగా కనిపించడానికి కారణమవుతుంది.
పొగతాగడం మానేయండి
పొగతాగడం వల్ల చర్మానికి కావాల్సిన ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. దీని వల్ల చర్మం బలహీనపడుతుంది, రంగు మారుతుంది, ముడతలు తొందరగా వస్తాయి. పొగతాగేవారి చర్మం తొందరగా వృద్ధాప్యంలోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి పొగతాగడం పూర్తిగా మానేసి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి.
వ్యాయామం
ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది చర్మ కణాలకు తగిన పోషణ, ఆక్సిజన్ అందేందుకు సహాయపడుతుంది. వ్యాయామం వల్ల శరీరంలోని మలినాలు బయటకు వెళ్లిపోయి చర్మం తాజాగా, మృదువుగా కనిపిస్తుంది.
సరిపడా నిద్ర
నిద్ర లేకపోవడం వల్ల చర్మం నిస్తేజంగా మారడం, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడం, చర్మం ముడతలు పడటం లాంటి సమస్యలు వస్తాయి. ప్రతి రోజు కనీసం 7 నుండి 9 గంటలు మంచి నిద్రపోవాలి. ఈ సమయంలో చర్మం తిరిగి కొత్తగా తయారవుతుంది.
వయస్సు ముఖం మీద తక్కువగా కనిపించాలంటే కేవలం క్రీములు లేదా చికిత్సలపై ఆధారపడకూడదు. మీ జీవనశైలి, ఆహారం, అలవాట్లు అన్నీ కలిసి దీర్ఘకాలం పాటు మీ చర్మానికి యవ్వనాన్ని అందిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే వయస్సు పెరిగినట్లు కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ పాటిస్తూ ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండే చర్మాన్ని పొందండి.
