పండక్కి దుమ్ములేపిండ్రు.. కోడి పందెంలో రూ. కోటిన్నర గెలుచుకున్న రాజమండ్రి వ్యక్తి!
సంక్రాంతి పండక్కి గోదారోళ్ల కోడిపందేలు యేటా ఎంత ఫేమస్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆచారం, సంప్రదాయంగా వస్తున్న ఈ కోడి పందేలు ఆడేందుకు ఏడాదంతా పందెం రాయుళ్లు ఎదురు చూస్తారు. ఈ ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడి పందాలు హోరాహోరీగా..

రాజమండ్రి, జనవరి 16: సంక్రాంతి అంటే గుర్తుకొచ్చేది గోదారోళ్ల సంబరాలు. పండక్కి ఇక్కడ జరిగే కోడిపందేలు యేటా ఎంత ఫేమస్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆచారం, సంప్రదాయంగా వస్తున్న ఈ కోడి పందేలు ఆడేందుకు ఏడాదంతా పందెం రాయుళ్లు ఎదురు చూస్తారు. ఈ ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడి పందాలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఏమాత్రం తగ్గేదే.. లే! అన్నట్లు ఈసారి లక్షల్లో కాదు.. ఏకంగా కోట్లలో డబ్బులు పెట్టి కోడి పందేలు ఆడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంక్రాంతి పండుగ సందర్భంగా రెండో రోజు నిర్వహించిన కోడి పందేల్లో కోట్ల రూపాయల నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది.
తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య అనే వ్యక్తి బరిలో జరిగిన కోడి పందేల్లో ఏకంగా రూ.కోటి 53 లక్షల పందెం పడింది. గుడివాడ ప్రభాకర్ సేతువ, రాజమండ్రికి చెందిన రమేష్ డేగ మధ్య పందెం కుదిరింది. పోటాపోటీగా కొట్టుకున్న కోళ్లలో చివరికి రాజమండ్రి వాసి రమేష్ డేగ గెలవడంతో కోటిన్నర రూపాయలు అతడి సొంతమయ్యాయి. ఈ పందెన్ని ప్రత్యక్షంగా చూసేందుకు పందెం రాయుళ్లు పెద్ద సంఖ్యలో తరలిరావడం విశేషం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా కోడి పందేలు చూడటానికి భారీగా జనాలు తరలి వచ్చారు. దీంతో పందెం బరులు కిటకిటలాడాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది జరిగిన అతిపెద్ద పందెం ఇదేనని స్థానికులు చర్చించుకుంటున్నారు.
పందేల్లో వేలాది కోళ్లకు కత్తులు కట్టి పందేలకు తెరలేపారు. మొదటి రోజున ఒక్క తాడేపల్లిగూడెంలోనే కోట్లలో లావాదేవీలు జరిగినట్లు సమాచారం. పందెం రాయుళ్లు భారీ మొత్తాల్లో పందాలు కడుతూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరోవైపు అక్కడ పోలీసుల నిఘా ఉన్నప్పటికీ కోడిపందాలు ఇంత పెద్ద ఎత్తున జరగడం వింతల్లో వింతగా మారింది. కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రచారంతో హోరెత్తించిన పోలీసు యంత్రాంగం పత్తా లేకుండా పోయింది. ముఖ్యంగా పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఎక్కడ చూసిన కోడిపందేల జోరు కనిపిస్తుంది. కోడి పందేలతోపాటు పెద్దఎత్తున గుండాట, పేకాట, కోతాట, క్యాసినో జూదాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




