Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Fungus : బ్లాక్ ఫంగస్ లక్షణాలేంటి.. ఎవరెవరికి.. ఎక్కడెక్కడ వ్యాపిస్తుంది..? పూర్తి వివరాలు అందించిన స్టేట్ నోడల్ ఆఫీసర్

Andhra Pradesh Covid - 19 state nodal officer Dr Arja Srikanth : కరోనా మహమ్మారికి తోడు బ్లాక్ ఫంగస్ కూడా దాడి చేస్తున్న నేపథ్యంలో 'బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకుందాం.. అప్రమత్తంగా ఉందాం'..

Black Fungus : బ్లాక్ ఫంగస్ లక్షణాలేంటి.. ఎవరెవరికి..  ఎక్కడెక్కడ వ్యాపిస్తుంది..? పూర్తి వివరాలు అందించిన స్టేట్ నోడల్ ఆఫీసర్
Black Fungus
Follow us
Venkata Narayana

|

Updated on: May 19, 2021 | 11:07 AM

Andhra Pradesh Covid – 19 state nodal officer Dr Arja Srikanth : కరోనా మహమ్మారికి తోడు బ్లాక్ ఫంగస్ కూడా దాడి చేస్తున్న నేపథ్యంలో ‘బ్లాక్ ఫంగస్ గురించి తెలుసుకుందాం.. అప్రమత్తంగా ఉందాం’ అంటూ ఆంధ్రప్రదేశ్ కొవిడ్ – 19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ ఏపీ కొవిడ్ – 19 కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి ? ఇది ఎలా సోకుతుంది.? జాగ్రత్తలు, నివారణా మార్గాలను కూలంకుషంగా విశ్లేషించారు. ఈ మహమ్మారికి సంబంధించి ప్రజల్లోని భయాలు.. అపోహలు తొలగించే ప్రయత్నం చేశారు. అవేంటో చూద్దాం..

దేశాన్ని కరోనా వైరస్ వణికిస్తూనే ఉంది. తాజాగా కరోనాకు తోడు ‘బ్లాక్ ఫంగస్’ లేదా ‘మ్యుకర్ మైకోసిస్’ అని కూడా పిలుస్తున్నారు. గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రా ఇలా ఇప్పుడు మన రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు బ్లాక్ ఫంగస్ కు భయపడాల్సిన అవసరం లేదని.. కరోనా బారిన పడిన వ్యక్తికి ముందుగానే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే బ్లాక్ ఫంగస్ కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. మొదట్లోనే ఈ వ్యాధిని గుర్తిస్తే సులభంగా అరికట్టవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై బ్లాక్ ఫంగస్ ను కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘బ్లాక్ ఫంగస్’ అంటే ఏమిటీ? అది ఎవరికి సోకుతుంది? లక్షణాలేమిటి? అన్ని విషయాలను ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి ఎలా వస్తుంది ? :

ఈ వ్యాధి మ్యూకోర్మైకోసిస్ (mucormycosis) అనే ఫంగస్ ద్వారా వస్తుంది. ‘మ్యుకోర్ మైసిటీస్’ అనే పేరుగల శిలీంద్రం. ఇది నల్లగా ఉంటుంది కాబట్టి ‘బ్లాక్ ఫంగస్’ అని పిలుస్తున్నారు. ఇది చాలా అరుదుగా వస్తుంది. ఈ ఫంగస్ గాలిలో ఎగురుతూ ఉంటుంది. ముక్కు ద్వారా లోపలికి వెళ్తుంది. ఒక్కోసారి శరీరానికి గాయాలు, గాట్లు ఉంటే అక్కడ వ్యాపిస్తుంది. అలాగే… శరీరం కాలిన ప్రదేశంలో కూడా ఇది వ్యాపిస్తుంది. అన్నింటికంటే ముక్కు ద్వారా ఇది ఎక్కువగా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. ఐతే ఇది శరీరంలోని ఏ భాగంపైనైనా దాడి చేయగలదు. అంటే కరోనా కంటే ఇది చాలా రెట్లు ప్రమాదకరం. కానీ ఇది సోకే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ ఈ వ్యాధి సోకినట్టయితే ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ లక్షణాలుంటే.. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే..

కంటి కింద నొప్పి, ముఖంలో ఒకపక్క వాపు, తలనొప్పి, జ్వరం, ముక్కు దిబ్బడ, పాక్షికంగా దృష్టి లోపం వంటివి బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రారంభంలో కన్పించే లక్షణాల్లో ముఖ్యమైనవి. ఈ ఇన్ఫెక్షన్ మరింత ముదిరితే.. కంటి చుట్టూ ఉండే కండరాలను స్తంభింపజేసి.. అంధత్వం వచ్చే ప్రమాదముంది. ఇన్ఫెక్షన్‌ మెదడుకు పాకితే మెనింజైటిస్ కు దారితీస్తుందని వైద్యలు చెబుతున్నారు. ప్రారంభ దశలోనే బ్లాక్ ఫంగస్ ను గుర్తించకుంటే ప్రాణాపాయానికి దారితీస్తుందని.. ఈ బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో మరణాల రేటు 50 శాతంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఈ వైరస్ ఎక్కడెక్కడ వ్యాపిస్తుంది :

• ముక్కు చుట్టూ ఉండే గాలి గదులు (Sinoses) • ఊరిపితిత్తులు • చర్మం • కళ్లు • మెదడు

ఎలా వస్తుంది? :

• మన చుట్టూ ఉండే వాతావరణంలో ఈ ఫంగస్ కు సంబంధించిన స్పోర్స్ ఉంటాయి. గాలిలో తిరుగుతున్న స్పోర్స్ పీల్చడం ద్వారా వస్తుంది. జబ్బున్న వారిని అంటుకోవటం వలన రాదు.

• సైనసైటిస్‌ సమస్య ఉన్నవారికి కూడా బ్లాక్‌ ఫంగస్‌ ఏర్పడవచ్చు.

• ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడితే ముక్కు చుట్టూ నొప్పి ఏర్పడుతుంది.

• బ్లాక్ ఫంగస్ వల్ల కళ్లు ఎర్రబడతాయి. ముఖం వాపు, తిమ్మిరులు ఏర్పడతాయి.

• తలనొప్పి, జ్వరం, దగ్గు, రక్తపు వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు.

• ముక్కులో దురద, కళ్లపైన లేదా కళ్ల కింద ఉబ్బినట్లు కనిపించినా, కంటిచూపు మందగించినా వైద్యులను సంప్రదించాలి.

• దంతాల్లో నొప్పిగా ఉన్నా అప్రమత్తం కావాలి.

• రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి ఈ ఫంగస్ ఏర్పడవచ్చు.

• కోవిడ్ బాధితులందరికీ ఈ ఫంగస్ ఏర్పడదు. కాబట్టి.. అందోళన వద్దు.

ఎవరికి వస్తుంది? :

• రోగనిరోధకశక్తి తక్కువగా ఉండే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

• షుగర్ వ్యాధి అదుచేయలేనంత స్థాయిలో ఉన్నవారికి

• అవయవ మార్పిడికి మందులు వాడుతున్న వారికి

• హెచ్ఐవి, ఎయిడ్స్ జబ్బులు ఉన్నవారు

• క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి

• కార్డికోస్టీరాయిడ్స్ మందులు వాడుతున్న వారికి

కరోనా వైరస్ వచ్చి విచ్చలవిడిగా కార్డికోస్టిరాయిడ్స్ వాడుతున్న వారిలో ఈ జబ్బు బయట పడినందువలన ఇప్పుడు బ్లాక్ ఫంగస్ మీద చర్చ జరుగుతూ ఉంది. స్టిరాయిడ్స్ వాడినప్పుడు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. షుగర్ జబ్బు అప్పటికే కంట్రోల్ లో లేకపోతే ఆ సమస్య ఇంకా పెరుగుతుంది.

నిర్ధారణ ఎలా? :

• ముక్కు ఎండోస్కోపీ: దీంతో ముక్కు లోపల ఎలా ఉందో తెలుస్తుంది. ముక్కులోని టర్బినేట్లు నల్లగా, తారులా, మసిబొగ్గులా కనిపిస్తే ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టే. అలాగే ముక్కులో నల్లగా, గోధుమ రంగులో చెక్కుల వంటివీ ఉండొచ్చు. దీన్ని సేకరించి, సూక్ష్మదర్శినితో (కేవోహెచ్‌ మౌంటింగ్‌) పరీక్షించాల్సి ఉంటుంది. ఇందులో జైగోమైసిటిస్‌ లేదా మ్యూకార్‌మైసిటీస్‌ ఉన్నదీ లేనిదీ నిర్ధరణ అవుతుంది.

• సీటీ స్కాన్‌: ముక్కు, గాలి గదుల సీటీ స్కాన్‌ పరీక్షలో ఇన్‌ఫెక్షన్‌ ఎంతవరకు విస్తరించిందనేది బయటపడుతుంది.

• ఎంఆర్‌ఐ: ఇన్‌ఫెక్షన్‌ మెదడుకు, కావర్నస్‌ సైనస్‌కు, కంటికి విస్తరిస్తే దీంతో తెలుసుకోవచ్చు.

రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? :

• కోవిడ్ చికిత్స పొందుతున్నవారు ఇదివరకు ఏవైనా వ్యాధులలతో బాధపడుతున్నా.. శస్త్ర చికిత్సలు చేయించుకున్నా వైద్యులకు ముందుగా తెలియజేయాలి. తద్వారా మీరు ఈ వ్యాధి బారిన పడకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.

• డయాబెటీస్‌ను అదుపులో ఉంచుకోవడం. మోతాదుకు మించి స్టెరాయిడ్స్‌ వాడకుండా జాగ్రత్త పడటం ద్వారా ‘బ్లాక్ ఫంగస్’ ఏర్పడకుండా జాగ్రత్తపడవచ్చు.

నివారణ మార్గాలు :

• స్టిరాయిడ్లను అవసరమైనపుడు, తగిన మోతాదులో మాత్రమే వినియోగించడం ద్వారా ఇన్ఫెక్షన్ ను నివారించవచ్చు.

• అక్సిన్ అందించేటప్పుడు హ్యుమిడిఫయర్ లో శుభ్రమైన నీటి వాడడం, హ్యుమిడిఫయర్, పైపులను రోజూ మార్చడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

• వ్యక్తిగతంగాను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

• బెటడిన్ తో కూడిన మౌత్ వాష్ తో రోజుకు రెండు సార్లు నోటిని పుక్కలించాలి

• మాస్కు ను తప్పనిసరిగా ధరించడం ద్వారా ఫంగస్= ముక్కులోకి, గొంతులోకి వెళ్లకుండా చూసుకోవచ్చు. అని డాక్టర్ శ్రీకాంత్ బ్లాక్ ఫంగస్ గురించి కూలంకషంగా వివరించారు.

Read also : Dolphin in Antarvedi coast : తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది తీరానికి కొట్టుకు వచ్చిన భారీ డాల్ఫిన్ చేప