Rose Flower Benefits: తరచుగా ఆందోళన, తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. గులాబీ పువ్వులతో చెక్ పెట్టండిలా..
Rose Flower Benefits: ప్రకృతి మనిషికి ఇచ్చిన వరం మొక్కలు.. తినే ఆహారం, ఔషధాలను, మనసుకు ఆహ్లాదం కలిగించే పువ్వులను కూడా మొక్కలు అందిస్తాయి. పువ్వులలో రాణి గులాబీ..
Rose Flower Benefits: ప్రకృతి మనిషికి ఇచ్చిన వరం మొక్కలు.. తినే ఆహారం, ఔషధాలను, మనసుకు ఆహ్లాదం కలిగించే పువ్వులను కూడా మొక్కలు అందిస్తాయి. పువ్వులలో రాణి గులాబీ పువ్వు. మొక్క నిండా ముళ్లు ఉన్నా.. అది చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. గులాబీ పువ్వు సువాసన, సౌందర్యం అందరి మనసును ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే మనసుకు ఆహ్లాదకరంగా కనిపించడమే కాదు.. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో గులాబీ పువ్వుని ఎన్నో విధాలుగా, వివిధ రకాల రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు. గులాబీ రేకలు, గులాబీ బొడ్డు (రోజ్ హిప్స్) అనేక వ్యాధులను నివారిస్తాయి. గులాబీ పువ్వులో రెక్కలన్నీ రాలిపోయిన తరువాత మిగిలిపోయిన బొండు భాగాన్ని రోజ్ హిప్స్ అంటారు. దీనిలో విటమిన్-సి అత్యధిక మొత్తంలో ఉంటుంది. మొగ్గ దశలోనే రెక్కలను వేరుచేసి.. రోజ్ హీప్స్ ను వైద్యసంబంధ ఉత్పత్తులకు ఉపయోగిస్తారు. ఈరోజు గులాబీ పువ్వులు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
రోజ్ వాటర్ తయారీ విధానం: తాజా గులాబీ పూరెక్కలను నీళ్లలో కలిపి ఆవిరి వచ్చేంత వరకూ మరిగించి.. నీటి ఆవిరిని మరో పాత్రలో సేకరించి చల్లబరుస్తారు. దీనినే రోజ్ వాటర్ అంటారు. ఈ రోజ్ వాటర్ ను ఆహార పదార్దాల్లో ఉపయోగిస్తారు. రోజ్ వాటర్ శరీరాన్ని చల్లబరుస్తుంది. కళ్లకలకను నివారిస్తుంది. ఆరోగ్య ప్రయోజనాలు: తలనొప్పి: వెనిగార్ లో గులాబీ రెక్కలను వేసి నానబెట్టి వడపోస్తే రోజ్ వెనిగార్ తయారవుతుంది. దీనిలో గుడ్డను తడిపి నుదిటి మీద పట్టువేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. గొంతు నొప్పి: తాజా గులాబీ పూరెక్కలను నీళ్లలో వేసి చిక్కగా మారేంత వరకూ మరిగించి, వడపోసి తేనె కలిపితే రోజ్ హనీ తయారవుతుంది. దీనిని గొంతునోప్పి నివారణకు ఉపయోగిస్తారు. వడ దెబ్బ నివారణకు: గులాబీ పూరెక్కలను, తేనెను, పంచదారను పొరలుగా పరిచి.. దీనిని 15రోజులు నిల్వ ఉంచితే..గుల్కంద్ తయారవుతుంది. ఈ గుల్కంద్ ను పాలల్లో కలుపుకుని తాగితే.. ఎండాకాలం వడదెబ్బ నుంచి రక్షణ కలుగుతుంది. అంతేకాదు.. మహిళల్లో అధిక బహిష్టుస్రావాన్ని కూడా నివారిస్తుంది. కళ్లలో మంటలు: రోజ్ వాటర్ ని పరిశుభ్రమైన దూది ప్యాడ్ ని తడిపి మూసిన కనురెప్పలమీద పరుచుకుంటే కంటి మంటలు, ఎరుపుదనం, దురద వంటివి తగ్గుతాయి. తలనొప్పి: ఒకటేబుల్ స్పూన్ గులాబీ రెక్కలను ఒక కప్పు నీళ్లలో వేసి మరిగించి తాగితే తలతిరగటం, తలనొప్పి వంటివి తగ్గుతాయి. గుండె నొప్పి : ఒక టీస్పూన్ గులాబీ నూనెను, నాలుగు టీస్పూన్ల బాదం నూనెను కలిపి ఛాతి మీద ఉదయ, సాయంకాలాలు ప్రయోగించి మర్దనా చేసుకుంటుంటే గుండెనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలిన గాయాలు, దెబ్బలు: రోజ్ వాటర్, ఉల్లిపాయల రసాన్ని కలిపి గాయాలమీద అప్లై చేస్తే.. త్వరగా తగ్గుతాయి. రక్తహీనత: ఆరు టీస్పూన్ల గులాబీ రేకలను, ఆరు టీస్పూన్ల సోపు గింజలను కలిపి నూరి రెండు కప్పుల నీళ్లలో వేసి మరిగించి వడపోసి, రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే క్రమంగా రక్తహీనత తగ్గుతుంది. ఆందోళన: రెండు టేబుల్ స్పూన్ల గులాబీ పూరేకులను ఒక గ్లాసు నీళ్లలో కలిపి కషాయం తయారుచేసి తీసుకుంటే ఆందోళన తగ్గుతుంది. కంటినుంచి నీరు కారుతుంటే: రెండు టీస్పూన్ల రోజ్ వాటర్లో చిటికెడు పటిక పొడిని కలిపి దూది వుండను ముంచి కళ్లలో డ్రాప్స్ గా చేసుకుంటే కళ్లనుంచి నీళ్లు కారటం తగ్గుతుంది. జ్వరం: రోజ్ వాటర్ ను, వెనిగర్ ను సమాన నిష్పత్తిలో తీసుకుని చల్లటి నీళ్లలో కలిపి, నూలు గుడ్డను తడిపి, మడతలు పెట్టి నుదిటిమీద పెడితే శరీరం చల్లబడి జ్వరం దిగుతుంది. మలద్వారంలో దురదలు: రోజ్ వాటర్ లో గుడ్డను ముంచి మలద్వారం మీద ఉంచితే దురద, మంట తగ్గుతాయి. తలనొప్పి: రోజ్ వాటర్ లో తోకమిరియాల పొడి, శొంఠిపొడిని ఒక్కో టీస్పూన్ చొప్పున కలిపి ఆ పేస్టు మాదిరిగా చేసి నొప్పి మీద ప్రయోగిస్తే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతునొప్పి: ఎండిన గులాబీ రెక్కలను పొడి చేసి తేనెలో కలిపి కొద్ది కొద్దిగా చప్పరిస్తుంటే గొంతునొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. మంగుమచ్చలు, మొటిమలు, చీముగడ్డలు వంటి చర్మ సంబంధ వ్యాధుల నివారణకు రోజ్ వాటర్లో కుంకుమపువ్వు, బాదం పలుకులను కలిపి మెత్తగా నూరి ముఖం మీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగిస్తే ముఖ చర్మం మెరుపుని సంతరించుకుంటుంది. మంగుమచ్చలు, మొటిమలు వంటివి తగ్గుతాయి.