ఇక అతి తక్కువ ఖర్చుతో గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ! రెండు మేడ్ ఇన్ ఇండియా HPV టెస్ట్ కిట్లు వచ్చేశాయ్
భారతీయ మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా ఉండటంతో, తక్కువ ఖర్చుతో కూడిన HPV పరీక్షా కిట్ల అభివృద్ధి ఒక ముఖ్యమైన పురోగతి. ఇండియాలోనే తయారైన ఈ కిట్లు, త్వరితంగా, ఖచ్చితంగా గర్భాశయ క్యాన్సర్‌ను గుర్తించడానికి సహాయపడతాయి. AIIMS, BIRAC వంటి సంస్థల సహకారంతో అభివృద్ధి చేయబడిన ఈ కిట్లు, హై-రిస్క్ HPV జన్యురూపాలను గుర్తిస్తాయి.

గర్భాశయ క్యాన్సర్.. భారతీయ మహిళల్లో ఎక్కవగా వచ్చే క్యాన్సర్. సాధారణంగా ఈ క్యాన్సర్ నిర్ధారణ కోసం స్క్రీనింగ్ టెస్టులు చేయాలి. అది ఖర్చుతో కూడుకున్న విషయం. కానీ, ఇప్పుడు కాదు. ఎందుకంటే.. ఇప్పడు మన ఇండియాలోనే తయారైన HPV కిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఎలాగైతే కరోనా సమయంలో ఆర్‌టీపీసీఆర్ టెస్టులతో కరోనాను అతి తక్కువ ఖర్చుతో వేగంగా వ్యాధి నిర్ధారణ చేశారో. ఇప్పుడు ఈ అధునాతన HPV కిట్లతో గర్భాశయ క్యాన్సర్‌ను వేగంగా, కచ్చితత్వంతో నిర్ధారణ చేయవచ్చు. ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఈ HPV పరీక్షా కిట్‌లను ప్రారంభించారు. బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (BIRAC) నిర్వహించిన సమావేశంలో శాస్త్రీయ సమీక్ష ఫలితాలను ప్రకటించారు.
గోవాకు చెందిన మోల్బియో డయాగ్నోస్టిక్స్ ద్వారా ట్రూనాట్ HPV-HR ప్లస్, పూణేకు చెందిన మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ద్వారా పాథో డిటెక్ట్ ఈ రెండు బయోటెక్నాలజీ విభాగం కింద అభివృద్ధి చేసిన HPV కిట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ కిట్లు చిప్-ఆధారిత రియల్-టైమ్ PCR (RT-PCR) సాంకేతికతను ఉపయోగిస్తాయి, ఈ కిట్లు కచ్చితత్వంతో పాటు వేగంగా వ్యాధి నిర్ధారణ చేస్తాయి. ఈ కిట్లు ప్రపంచవ్యాప్తంగా 96 శాతం కంటే ఎక్కువ గర్భాశయ క్యాన్సర్ కేసులకు కారణమైన ఎనిమిది హై-రిస్క్ HPV జన్యురూపాలను గుర్తించడానికి రూపొందించారు.
ఈ కిట్లను న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నిపుణుల బృందం, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్ (NICPR) నోయిడా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ (NIRRCH) ముంబైల సహకారంతో, WHO ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) మద్దతుతో నిర్వహించారు. గర్భాశయ క్యాన్సర్‌ను త్వరగా పరీక్షించడానికి రూపొందించిన రెండు మేడ్-ఇన్-ఇండియా HPV టెస్టింగ్ కిట్‌లను ప్రారంభించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. భారతదేశం శాస్త్రీయ ఆవిష్కరణలలో, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ రంగంలో పెరుగుతున్న విజయాన్ని గుర్తించడానికి ఇది సరైన సమయం అని అన్నారు.
HPV అంటే ఏంటి?
HPV (హ్యూమన్ పాపిల్లోమావైరస్) అనేది చర్మం నుండి చర్మానికి సంపర్కం ద్వారా, చాలా తరచుగా లైంగిక సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ చాలా సాధారణం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం లైంగికంగా చురుకైన వ్యక్తులు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఇది సంక్రమిస్తుంది. చాలా HPV ప్రమాదకరం కానప్పటికీ, కొన్ని సార్లు ఇది గర్భాశయ క్యాన్సర్ కు కారణం అవుతుంది. భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ ఒక తీవ్రమైన ప్రజారోగ్య సమస్య. అన్ని గర్భాశయ క్యాన్సర్ కేసులు HPV ఇన్ఫెక్షన్ వల్ల కాకపోయినా, చాలా కేసులు వైరస్ వల్ల సంభవిస్తాయి. అందువల్ల HPV కోసం ముందస్తుగా, క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయడం వల్ల వ్యాధి ప్రాణాంతకం కాకముందే దానిని గుర్తించడంలో సహాయపడుతుంది. మహిళలు తమ జీవితకాలంలో రెండుసార్లు HPV పరీక్షలు చేయించుకోవాలని, 35 సంవత్సరాల వయస్సులో ఒకసారి, 45 సంవత్సరాల వయస్సులో రెండో సారి ఈ టెస్ట్ చేయించుకోవాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




