సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఈ 5 సూత్రాలు పాటించాల్సిందే
ప్రజంట్ రెయినీ సీజన్ స్టార్ట్ అయింది. దీంతో సీజనల్ వ్యాధులు తీవ్రం అయ్యాయి. జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో జాగ్రత్తులు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందులో ప్రధానమైనవి 5. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం .. .. .. ..

వాతావరణంలో మార్పులు వచ్చాయంటే చాలు.. చాలామంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు. ఇలాంటి సమయంలో మార్కెట్లో దొరికే రకరకాల మందులు వాడటం, రకరకాల చిట్కాలు పాటించడం సహజం. అయితే, వీటిలో చాలావరకు అపోహలే ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరి సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు నిజంగా కాపాడుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?
పరిశోధనాత్మక నివేదిక ప్రకారం.. కేవలం ఈ ఐదు సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు, మీ రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎలాంటి ఇన్ఫెక్షన్లయినా మీ దరిచేరవు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. చేతులను క్రమంతప్పకుండా కడగాలి…
కంటికి కనిపించని వైరస్‌లు, బ్యాక్టీరియాలు వ్యాపించడానికి ప్రధాన కారణం మన చేతులే. మనం తాకే వస్తువుల ద్వారా ఇవి మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే, ఆహారం తినే ముందు, బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సబ్బు లేదా హ్యాండ్ వాష్‌తో చేతులను శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి.
2. అనారోగ్యంగా ఉంటే ఇంట్లోనే ఉండండి..
మీకు జలుబు లేదా ఫ్లూ లక్షణాలు కనిపిస్తే.. బలవంతంగా ఆఫీసులకో, బయటికో వెళ్లకండి. ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం త్వరగా కుదుటపడటమే కాకుండా, మీ ద్వారా ఇతరులకు ఆ వైరస్ వ్యాపించకుండా అడ్డుకోవచ్చు.
3. వ్యాక్సినేషన్లు సకాలంలో తీసుకోవాలి..
సీజనల్ ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్ల నుంచి దీర్ఘకాలిక రక్షణ పొందడానికి వ్యాక్సిన్లు ఎంతగానో తోడ్పడతాయి. మీ వయసు, ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైన వ్యాక్సిన్లను ఉదాహరణకు ఫ్లూ షాట్స్ వైద్యుల సలహాతో సకాలంలో అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం.
4. గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి…
చాలామంది చలిగా ఉందనో, జలుబు చేసిందనో ఇళ్ల తలుపులు, కిటికీలు పూర్తిగా మూసేస్తుంటారు. కానీ, గదిలో గాలి ఆడకపోతే వైరస్లు ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తాయి. వీలైనప్పుడల్లా కిటికీలు తెరిచి ఉంచడం వల్ల తాజా గాలి లోపలికి వచ్చి, గదిలోని వెంటిలేషన్ మెరుగవుతుంది.
5. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి….
అన్నిటికంటే ముఖ్యమైనది తగినంత నిద్ర. మీ శరీరానికి తగినంత విశ్రాంతి దొరికినప్పుడే మీ రోగనిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. వైరస్‌లతో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది. కాబట్టి రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి.
