AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవాణి నిధులతో షిర్డీ సాయి ఆలయాలు నిర్మించం: ఏపీ దేవాదాయ శాఖ

శ్రీవాణి నిధులను షిర్డీ సాయి ఆలయాల నిర్మాణానికి వినియోగించబోమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీవాణి నిధులు వైదిక, ఆగమ సంప్రదాయాలను అనుసరించే హిందూ దేవాలయాల అభివృద్ధి కోసమేనని తెలిపారు. షిర్డీ సాయి ఆలయాలు ఆ పరిధిలోకి రావని పేర్కొంటూ, సనాతన ధర్మ ప్రచారం కోసం ఈ నిధులను వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ, ధార్మిక వర్గాల్లో చర్చకు దారితీశాయి.

శ్రీవాణి నిధులతో షిర్డీ సాయి ఆలయాలు నిర్మించం: ఏపీ దేవాదాయ శాఖ
Andhra Endowments
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Jun 22, 2026 | 1:52 PM

Share

శ్రీవాణి నిధులను షిర్డీ సాయి ఆలయాల నిర్మాణానికి వినియోగించబోమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ, ధార్మిక వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి, శ్రీవాణి నిధులు వైదిక, ఆగమ శాస్త్ర సంప్రదాయాలను అనుసరించే హిందూ దేవాలయాల అభివృద్ధి కోసమే ఉద్దేశించబడినవని తెలిపారు. సీతారామ, శివ, దుర్గ, వెంకటేశ్వరస్వామి ఆలయాలు సహా దేవాదాయ శాఖ పరిధిలోని హిందూ దేవాలయాలకు ఈ నిధులతో సహాయం అందిస్తామని చెప్పారు.

అయితే షిర్డీ సాయి ఆలయాలకు శ్రీవాణి నిధులు వర్తించవని మంత్రి తేల్చిచెప్పారు. పౌరాణిక హిందూ ధర్మశాస్త్రాలు, ఆగమ సంప్రదాయాల్లో షిర్డీ సాయికి స్థానం లేదని, శ్రీవాణి నిధులను సనాతన ధర్మ ప్రచారం, వైదిక సంప్రదాయాల పరిరక్షణ కోసమే వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. షిర్డీ సాయి ఆలయాల్లో ఆగమ శాస్త్రాల ప్రకారం పూజా విధానాలు జరగవని కూడా అభిప్రాయపడ్డారు. షిర్డీ సాయిబాబా అంశం గతంలోనూ వివాదాలకు కేంద్రబిందువైంది. సాయిబాబాను హిందూ దేవతలతో సమానంగా ఆరాధించాలా వద్దా అనే అంశంపై పీఠాధిపతులు, హిందూ మత సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు షిర్డీ సాయిబాబాను విశ్వసిస్తూ పూజిస్తుండటంతో ఈ అంశం తరచూ చర్చనీయాంశంగా మారుతోంది.

ఇదిలా ఉండగా, శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రభుత్వం మరింత విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు టిడ్కో కాలనీలో తొలి ఆలయ నిర్మాణాన్ని జూలైలో ప్రారంభిస్తామని తెలిపారు. దేవాదాయ శాఖ రెండేళ్ల ప్రగతి నివేదికను వివరిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా మంత్రి ప్రస్తావించారు. ధూపదీప నైవేద్య పథకం కింద అర్హత కలిగిన ఆలయాల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెల రూ.10 వేల చొప్పున జమ చేస్తున్నామని చెప్పారు. ఆలయాల పునర్నిర్మాణం కోసం ‘సర్వ శ్రేయోనిధి’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.

టీటీడీ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో 5 వేల భజన మందిరాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని బలోపేతం చేయడం, సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తరించడమే లక్ష్యమని మంత్రి వివరించారు. అయితే దేవాదాయ శాఖ ప్రగతి నివేదిక కంటే, శ్రీవాణి నిధులు మరియు షిర్డీ సాయి ఆలయాలపై మంత్రి చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం రాజకీయంగా, ధార్మికంగా విస్తృత చర్చకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

Follow Us