2020 RoundUp: ట్వంటీ ట్వంటీలో కొనసాగిన ఓటీటీ హవా.. లాక్‌డౌన్‌లో బోర్ కొట్టకుండా ఎంటర్ టైన్ చేసిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్..
2020 RoundUp: ఈ ఏడాది కరోనా పుణ్యమా అని జనాలు చాలాకాలం పాటు బయట తిరగకుండా ఇంట్లోనే ఉన్నారు. మరి కొంతమంది ఉపాధి కోసం ఉద్యోగం కోసం నానా

2020 RoundUp: ఈ ఏడాది కరోనా పుణ్యమా అని జనాలు చాలాకాలం పాటు బయట తిరగకుండా ఇంట్లోనే ఉన్నారు. మరి కొంతమంది ఉపాధి కోసం ఉద్యోగం కోసం నానా తంటాలు పడ్డారు. మరికొందరేమో ఇంట్లోనే ఉండి కాలక్షేపం చేశారు. అయితే ఏ మాట కామాటే చెప్పుకోవాలి ఈ సంవత్సరం చాలా కొత్త విషయాలను జనాలకు నేర్పిచ్చి త్వరలో కనుమరుగవుతుంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చిత్ర పరిశ్రమం గురించే. ఎందుకంటే ఈ ఏడాది సినిమా థియేటర్లు మూతపడటం వల్ల చాలా వరకు నష్టాలు వాటిల్లినా కొంతమందికి మాత్రం లాభాలను తెచ్చిపెట్టింది. అందులో ముఖ్యమైనవి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్. వీటి ద్వారా చాలామంది జనాలు ఇంట్లో ఉండి కాలక్షేపం చేశారు. అంతేకాకుండా పెద్ద సినిమా రిలీజైతే థియేటర్లు దొరకని పరిస్థితి నుంచి చిన్న సినిమా నిర్మాతలు బయటపడ్డారు. వారికి ఇదొక మంచి మార్గంగా కనిపించింది. అందుకే ఈ సంవత్సరం ఓటీటీ సంవత్సరంగా విరజిల్లింది. ఇక ఈ ప్లాట్‌ఫామ్స్ కేంద్రంగా వచ్చిన సినిమాల గురించి ఇప్పడు తెలుసుకుందాం.
ఓటీటీలను మార్కెట్‌లోకి తీసుకురావాలని కొన్నేళ్ల నుంచి చాలామంది ప్రయత్నించినా అది చివరకు కరోనా సంవత్సరంలో సాధ్యమైంది. ఇక ఓటీటీలో ముందుగా చెప్పాలంటే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం, ఆహా, జీ5 మొదలైనవి ఉన్నాయి. ఇంటర్‌నెట్ ఉంటే చాలు వీటిని సబ్ స్క్రిప్షన్ చేసుకొని ఎక్కడున్నా మొబైల్‌లో సినిమా చూసేయొచ్చు. మొదటగా అమెజాన్‌లో విడుదలైన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ అరకులో సాగిన ఒక అందమైన మధ్యతరగతి పౌరుషాన్ని చూపింది. సత్యదేవ్ ఈ సినిమాతో ఇంటింటి స్టార్ అయ్యాడు. ‘ఆహా’లో విడుదలైన ‘భానుమతి–రామకృష్ణ’ కూడా ఒక సంపన్న అమ్మాయికి ఒక మధ్యతరగతి అబ్బాయికి మధ్య సాగిన ప్రేమ కథగా ఆకట్టుకుంది. నవీన్ చంద్ర ఈ సీజన్‌లో ఒక హిట్‌ను మూటగట్టుకున్నాడు. ‘ఆహా’లోనే విడుదలైన ‘కలర్ ఫొటో’ రూపానికి సంబధించి, రంగుకు సంబంధించి ఒక సీరియస్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. కామెడీ నటుడు సుహాస్ ఈ సినిమాతో కొత్త ప్రతిభను నిరూపించుకున్నాడు. నటి చాందిని చౌదరి కూడా మంచి మార్కులు పొందింది. ఇక ‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’ అయితే ఓటిటిలో పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రశంసలు అందుకుంది. గుంటూరు బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా అక్కడి భాషను, ఆత్మను సమర్థంగా పట్టుకుంది. ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ కొత్త జంటగా ప్రేక్షకులకు నచ్చారు. ‘ఒరేయ్ బుజ్జిగా’ సినిమా హీరో రాజ్‌తరుణ్ ను ప్రేక్షకులు మర్చిపోకుండా చేసింది. ఈ వరుసలోనే ‘అమృతారామమ్’, ‘ఐఐటి కృష్ణమూర్తి’, ‘మా వింతగాధ వినుమా’ సినిమాలను చెప్పుకోవచ్చు.
ఓటీటీల వల్ల ఇలాంటి చిన్న సినిమాలే కాకుండా పెద్ద హీరోలైన సూర్య, నాని వంటి సినిమాలు కూడా రిలీజై విజయం సాధించాయి. ‘వి’ సినిమా అమేజాన్‌లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. సుధీర్‌బాబు మరో ముఖ్యపాత్ర. ఇద్దరు హీరోలు ఉన్న ఈ సినిమా చిన్నతెర వల్ల ఎక్కువగా రావాల్సిన వ్యూస్ రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ థియేటర్ రిలీజ్ అవుతోంది ఇది. చాలా రోజులు ఊరిస్తూ వచ్చిన అనుష్క ‘నిశ్శబ్దం’ కూడా ఆశించిన విజయాన్ని సాధించలేదు. సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ తన భారీతనానికి తగ్గట్టుగా హిట్ అయ్యింది. దర్శకురాలు సుధా కొంగర పెద్ద హిట్ కొట్టినట్టు లెక్క. పెద్ద స్క్రీన్ మీద ఈ సినిమా కథ వేరేగా ఉండేది. కీర్తి సురేశ్ నటించిన ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ రెండూ నిరాశ పరిచాయి. ‘ఆహా’ ద్వారా విడుదలైన ‘అనగనగా ఒక అతిథి’ ఒక భిన్నమైన గుర్తింపు పొందింది. దాదాపు మూడు నాలుగు ముఖ్యపాత్రలతో నడిచిన ఈ సినిమా మొదట కన్నడంలో వచ్చి తెలుగులో రీమేక్ అయ్యింది. ఇక అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాను ఆహా ప్లాట్‌ఫాం కేంద్రంగా విడుదల చేస్తామని చిత్ర వర్గాలు ముందుగానే ప్రకటించాయి.
ఇదిలా ఉంటే ఓటీటీలు మంచితో పాటు కొంచెం చెడును కూడా మూటగట్టుకున్నాయి. ఎందుకంటే కొంతమంది తమ సినిమాలు ఓటీటీలో కాకుండా డైరెక్ట్‌గా థియేటర్లో రిలీజైతే మంచి కలెక్షన్స్‌తో పాటు సినిమా కూడా విజయం సాధించేదని భావించారు. చిన్న నిర్మాతలు మాత్రం వీటి ద్వారా మంచి వసూళ్లు రాబట్టుకున్నారు. టాలెంట్ ఉన్న దర్శకులు, నటులు, నటీమణులు ఓటీటీల పుణ్యమా అని వెలుగులోకి వచ్చి ఇప్పడు స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. మరికొంతమంది తమ అభిమాన హీరోల సినిమాలను థియేటర్లో చూస్తు బాగుండేదని ఫీలయ్యారు. ఇలా 2020 సంవత్సరం ఎన్నో మరిచిపోని అనుభూతులను మూటగట్టుకొని వెళ్లిపోతుంది.
ఇక ప్రతి ఏడాది దాదాపు వందకు పైగా స్ట్రైట్ తెలుగు సినిమాలు థియేటర్‌లో సందడి చేసేవి. కానీ ఈ సారి కరోనా వల్ల కనీసం 50 సినిమాలు కూడా విడుదలకు నోచుకోలేదు. కరోనా మహమ్మారి అన్ని రంగాల కన్నా సినీ పరిశ్రమపై ఎక్కువగా ప్రభావం చూపించిందనే చెప్పాలి. కరోనాతో తొమ్మిది నెలల పాటు థియేటర్స్ మూతపడ్డాయి. ఈ ఏడాది మొత్తం 49 సినిమాలు మాత్రమే థియేటర్స్‌లో సందడి చేశాయి. 2011లో 120 సినిమాలు థియేటర్స్‌లోకి రాగా, 2012లో 127,2013లో 178, 2014లో 194, 2015లో 172, 2016లో 181, 2017లో 177, 2018లో 171, 2019లో 193 సినిమాలు అభిమానుల ముందుకు వచ్చి కనువిందు చేశాయి. ఏడాది మొదట్లో అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ వంటి చిత్రాలు సందడి చేయగా, చివరలో సోలో బ్రతుకే సోబెటర్ సినిమా పసందైన వినోదం అందించింది.