Balagam Movie: ఎవరూ చేయని సాహసం అతను చేసి చూపించాడు.. ‘బలగం’ మూవీపై పరుచూరి రివ్యూ..

తాజాగా ఈ మూవీపై ప్రముఖ రచయిత.. నటుడు పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. సలహాలు, సూచనలు ఇస్తుంటారు పరుచూరి గోపాలకృష్ణ. ఇటీవల బలగం సినిమా చూసిన వెంటనే చిత్రదర్శకుడు వేణుతోపాటు.. పాటల రచయిత కాసర్ల శ్యామ్ ను ఫోన్ చేసి అభినందించారట.

Balagam Movie: ఎవరూ చేయని సాహసం అతను చేసి చూపించాడు.. 'బలగం' మూవీపై పరుచూరి రివ్యూ..
Balagam Movie,
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 10, 2023 | 7:14 AM

ప్రస్తుతం థియేటర్లలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతగా రన్ అవుతుంది బలగం మూవీ. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ బలగం మూవీ ప్రతి ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తోంది. భారీ బడ్జె్ట్.. స్టార్ హీరోస్ కాకుండా.. సాధారణ చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డ్స్ అందుకుంది. ఇప్పటివరకు వెండితెరపై కమెడియన్‏గా అలరించిన వేణు యెల్దండి.. మెగాఫోన్ పట్టి తొలిసారి రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా చూసేందుకు ఊరంత ఏకమై ఒక్కచోటికి చేరింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు. తాజాగా ఈ మూవీపై ప్రముఖ రచయిత.. నటుడు పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొత్త సినిమాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. సలహాలు, సూచనలు ఇస్తుంటారు పరుచూరి గోపాలకృష్ణ. ఇటీవల బలగం సినిమా చూసిన వెంటనే చిత్రదర్శకుడు వేణుతోపాటు.. పాటల రచయిత కాసర్ల శ్యామ్ ను ఫోన్ చేసి అభినందించారట.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ.. “ఒక సినిమాకు ఏది బలమో అది బలగంలో ఉంది. ఇదొక వినూత్న ప్రయోగం. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇంతటి విజయాన్ని అందుకుంటుందని దిల్ రాజు కూడా ఊహించి ఉండరు. ఖర్చు పెట్టిన దానికంటే పదిరెట్లు ఎక్కువ వసూళ్లు చేసింది ఈ మూవీ. అగ్రహీరోలు, దర్శకులు, రచయితలను నమ్ముకోవాల్సిన అవసరం లేదు.. కథను నమ్ముకుంటే చాలని ఈ సినిమా నిరూపించింది. చిన్న బడ్జెట్.. లేదా పెద్ద బడ్జెట్ అనేది విషయం కాదు.. పెద్ద బడ్జెట్ సినిమాతో సమానంగా ఆదరణ అందుకుంది. ఇప్పటివరకు వేణుని జబర్దస్త్ కమెడియన్ గా చూశాను. ఇతడిలో గొప్ప రచయిత.. ఇంత సృజనాత్మకత ఉందని నేనస్సలు ఊహించలేదు. ఎందుకంటే సైలెంట్ గా కామెడీ చేస్తోన్న కుర్రాడు గుండెలను హత్తుకునే సినిమా చేయగలడనేది ఊహకు అందని అంశం. ఇతడు చేసిన మాయ ఏమిటంటే.. ముందు నుంచి కన్నీళ్లు పెట్టించేలా సినిమాను నడిపించవచ్చు.. కానీ అల కాకుండా.. నవ్వించాడు.. కవ్వించాడు.. చివరకు భావోద్వేగానికి గురిచేశాడు. ఒక సినిమా చూసి నేను కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ. అలాంటి నేను ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను..

ఒక కుటుంబం విడిపోయినప్పుడు సాధారణంగా మనం కన్నీళ్లు పెడతాం..కానీ.. ఈ సినిమాలో మాత్రం కలుస్తుంటే భావోద్వేగానికి గురవుతాం. ఇది ఒక అపురూప దృశ్యకావ్యం. క్లైమాక్స్ పది నిమిషాల్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా కన్నీళ్లు పెట్టుకుంటారు. మనిషి చనిపోయిన తర్వాత 11 రోజుల కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇలాంటి పాయింట్ ను చూపించడానికి ఎవరూ సాహసం చేయరు. చావు, కర్మ కార్యక్రమాలు… ఏడుపులు ఇలాంటి వాటిపై సినిమమా చేస్తే చూస్తారా ?.. అనే భయం ఉంటుంది. కానీ ఈ సినిమాను వేణు అద్భుతంగా రూపొందించాడు. కుటుంబాలు విడిపోతే పైన ఉన్నవారు ఆత్మ ఘోషిస్తోందనే విషయాన్ని గొప్పగా చెప్పిన చిత్రమిది. కళ్లు తడవకుండా.. ఒళ్లు గగుర్పాటుకు గురికాకుండా ఒక్క ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకు రాలేదు. సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోకపోతే నాకు మెసేజ్ పెట్టండి” అంటూ చెప్పుకొచ్చారు.