Chiranjeevi: ఆ కథ వినగానే రైటర్ నుదిటిని ముద్దాడిన చిరంజీవి.. ఫైనల్‌గా మూవీ రిజల్ట్..!
రచయిత చిన్నికృష్ణ ఇంద్ర కథ చిరంజీవికి వివరించిన అనుభవాన్ని పంచుకున్నారు. మొదట దర్శకుడు బి. గోపాల్, నిర్మాత అశ్వని దత్ కథను నిరాకరించినప్పుడు.. మరో రచయిత పరుచూరి గోపాలకృష్ణ జోక్యం చేసుకుని చిరంజీవి గారికి చెప్పేలా ప్రోత్సహించినట్లు వివరించారు. కథ విన్నాక చిరంజీవి...

ప్రముఖ రచయిత చిన్నికృష్ణ, తన కెరీర్‌లో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో ఒకటైన ఇంద్ర కథ చిరంజీవికి వినిపించినప్పుడు ఎదురైన సంఘటనలను, ఆయన స్పందనను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. అంతకుముందు బాలకృష్ణకు నరసింహ నాయుడు వంటి బ్లాక్‌బస్టర్ అందించిన చిన్నికృష్ణ, దర్శకుడు బి. గోపాల్, చిరంజీవి కలయికలో ఇంద్ర కథను రూపొందించారు. ఒక కథకు ఒక సోల్ ఉంటుందని, ఆ శక్తిని మోయాలంటే అందరికీ సాధ్యం కాదని చిన్నికృష్ణ అన్నారు. ఇంద్ర కథను ప్రకృతి, భగవంతుడే తనతో రాయించారని.. తాను కేవలం ఒక సాధనం మాత్రమేనని ఆయన చెప్పారు.
అప్పటికే మెగాస్టార్‌గా ఉన్న చిరంజీవికి కథ చెప్పాలంటే కొన్ని పారామీటర్లు ఉంటాయని చిన్నికృష్ణ గుర్తించారు. ఇంద్ర కథను చిరంజీవికి చెప్పడానికి ముందు, నిర్మాత అశ్వని దత్, దర్శకుడు బి. గోపాల్‌లకు వినిపించారు. అయితే, వారికి కథ నచ్చలేదని చిన్నికృష్ణ వెల్లడించారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన చిన్నికృష్ణ, చెన్నై వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ జోక్యం చేసుకున్నారు. చిన్నికృష్ణ మొత్తం నడవిడిక తెలుసు కాబట్టి, ఆ అబ్బాయిని చిరంజీవికి కథ చెప్పనివ్వండి, ఆయనే నిర్ణయించుకుంటారు అని అశ్వని దత్ గారికి సూచించారు. తాను చెప్పనని నిరాకరించినా, పరుచూరి గోపాలకృష్ణ బలవంతంగా చిరంజీవి గారికి కథ చెప్పాలని ఒప్పించచినట్లు చిన్ని కృష్ణ వివరించారు. పరుచూరి గోపాలకృష్ణ తనకు అన్నయ్య, గురువు, దైవం లాంటి వారని చిన్నికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
కథ చెప్పిన రోజుఉదయం 10:30 గంటలకు పరుచూరి గోపాలకృష్ణ కారులోనే చిరంజీవి ఇంటికి వెళ్లినట్లు చిన్నికృష్ణ గుర్తుచేసుకున్నారు. కథా కథనం ప్రారంభించగానే, చిరంజీవి మొదట రిలాక్స్‌గా విన్నా, నేనున్నానే నానమ్మ అని చైల్డ్ హుడ్ ఎపిసోడ్ చెప్పినప్పుడు చిరు అలెర్ట్ అయ్యారని చిన్నికృష్ణ వివరించారు. చిరంజీవి అనుమతితో చిన్నికృష్ణ మఠం వేసి కూర్చుని పూర్తి కథను రెండున్నర గంటల పాటు వివరించారు. చిరంజీవి కథను ఎంతో ఆస్వాదిస్తూ విన్నార తెలిపారు. కథా కథనం పూర్తయిన తర్వాత చిరంజీవి తన్మయత్వానికి లోనైనట్లు చిన్న కృష్ణ వివరించారు. 29 ఏళ్ల వయసున్న తనను చిరంజీవి దగ్గరకు తీసుకుని, ఆయన తలపై చేయి వేసి, నుదిటిపై ముద్దు పెట్టినట్లు వివరించారు. ఆ క్షణం తనకు జీవితంలో మరిచిపోలేనిదని ఆయన చెప్పుకొచ్చారు. నిర్మాత అశ్వని దత్‌ను పిలిచి “థియేటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు కాదు, సైకిల్ స్టాండ్ వాడికి కూడా విపరీతమైన డబ్బులు వస్తాయి. చేసేద్దాం, బ్రహ్మాండంగా ఉంది” అని చిరు చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత తాను కాశీ వెళ్లి స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు, ముఖ్యంగా కామెడీ ట్రాక్‌ను చేర్చానని, అది బి. గోపాల్‌కు చాలా నచ్చిందని చిన్నికృష్ణ తెలిపారు. బి. గోపాల్ అద్భుతమైన, నభూతో నభవిష్యతి డైరెక్టర్ అని, ముఖ్యంగా యాక్షన్ సినిమాలకు ఆయన గొప్ప దర్శకుడని చిన్నికృష్ణ ప్రశంసించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
