Srihari: శ్రీహరి చనిపోయిన రోజు ఏం జరిగింది? రియల్ స్టార్ ఆ ఒక్క పని చేసి ఉంటే ప్రాణాలతో ఉండేవారా?
హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, సహాయక నటుడిగా వందల సినిమాల్లో నటించారు రియల్ స్టార్ శ్రీహరి. తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఎన్నో పురస్కరాలు, ప్రశంసలు అందుకున్నారు. టాలీవుడ్ లో స్టార్ నటుడిగా ఓ వెలుగు వెలిగిన శ్రీహరి చాలా చిన్న వయసులోనే (49 ఏళ్లు) కన్నుమూశారు.

స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టారు శ్రీహరి. ఆ తర్వాత నటుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా రాణించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలు చేసిన శ్రీహరి ఆ తర్వాత భిన్నమైన పాత్రలతో ఆకట్టుకున్నారు. హీరోగా నటిస్తూనే ఇతర హీరోల సినిమాల్లో విలన్ గా, సహాయక నటుడిగా మెప్పించారు. మగధీర, ఢీ, కింగ్, డాన్ శీను, బృందావనం తదితర సూపర్ హిట్ సినిమాల్లో శ్రీహరి పోషించిన పాత్రలకు మంచి పేరొచ్చింది. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా ఓ వెలుగు వెలిగిన శ్రీహరి అకాల మరణం చెందారు. తీవ్ర అనారోగ్యంతో 2013 అక్టోబర్ 09న శ్రీహరి కన్నుమూశారు. కాలేయ సంబంధ సమస్యలతో శ్రీహరి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీహరి సతీమణి డిస్కోశాంతి తన భర్త మరణంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ముంబయి ఆస్పత్రిలో సరైన వైద్యం అందకపోవడం, చికిత్సలో జరిగిన లోపాల వల్లే తన భర్త మరణించారని పలు సందర్భాల్లో ఆరోపించారు.
2013 అక్టోబర్ 8న శ్రీహరి గారు ఒక సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లారుట. మొత్తం అటవీప్రాంతంలోనే షూటింగ్ జరిపారట. అడవి ప్రాంతం కావడంతో అక్కడ దోమలు ఎక్కువగా ఉండడంతో శ్రీహరి తీవ్ర జ్వరం బారిన పడ్డారట. అయినప్పటికీ తన వల్ల నిర్మాతకు నష్టం కలగకూడదని షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే జ్వరం ఎక్కువై 102 డిగ్రీలకు చేరుకుంది. దీంతో వెంటనే ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. అయితే అంతకు ముందు శ్రీహరి కామెర్ల బారిన పడ్డారట. ఇందుకు సంబంధించిన చికిత్స కూడా తీసుకుంటున్నారట. దీని నుంచి పూర్తిగా కోలుకోకముందే షూటింగ్ కోసం ముంబై వెళ్లడం, సరైన ఆహారం తీసుకోలేకపోవడం, తీవ్ర జ్వరం బారిన పడడంతో శ్రీహరి పరిస్థితి పూర్తిగా విషమించిందట. సుమారు మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన శ్రీహరి చివరకు అక్టోబర్ 13న కన్నుమూశారు. తన కుటుంబ సభ్యులతో పాటు యావత్ సినీ అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టారు. కాగా కామెర్ల వ్యాధికి చికిత్స తీసుకుంటున్న సమయంలో శ్రీహరి ఇంటి దగ్గరే ఉండి ఉంటే ప్రాణాలతో ఉండే వారని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. శరీరం సహకరించలేకున్నా షూటింగ్ కోసం ముంబైకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




