AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farming Ideas: 20 రోజుల్లో చేతికి పంట.. నెలకు రూ.1 లక్ష ఆదాయం.. ఆ జిల్లా రైతుల సరికొత్త ప్రయోగం..

వ్యవసాయం అంటే పెట్టుబడి, నష్టాలు అనే మాటలు తరచుగా వింటున్న ఈ రోజుల్లో, ప్రకాశం జిల్లా రైతులు కాలానికి తగ్గట్టు పంటను మార్చుకుని లాభాలు ఆర్జిస్తున్నారు. ఒకప్పుడు చామ, మిరప, పొగాకు వంటి సంప్రదాయ పంటలతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఈ రైతులు, ఇప్పుడు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే ఆకుకూరల సాగును ఎంచుకుని ఎకరానికి నెలకు రూ.1 లక్ష ఆదాయం సాధిస్తున్నారు.

Farming Ideas: 20 రోజుల్లో చేతికి పంట.. నెలకు రూ.1 లక్ష ఆదాయం.. ఆ జిల్లా రైతుల సరికొత్త ప్రయోగం..
Leafy Vegetable Farming For Higher Income
Anand T
|

Updated on: Nov 11, 2026 | 5:48 PM

Share

వ్యవసాయం అంటే చాలా మంది నష్టాలు వస్తాయని భయపడుతారు. కానీ సరైన విధానంలో పంటను సాగుచేస్తే.. దానికి మించిన లాభదాయకమైన బిజినెస్ మరోటి లేదని ప్రకాశం జిల్లా రైతులు నిరూపిస్తున్నారు. కొత్తపట్నం మండలం మడనూరు గ్రామానికి చెందిన రైతులు సంప్రదాయ పంటలకు పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడులు, గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఆకుకూరల సాగుపై దృష్టి సారించారు.

పొలాన్ని చిన్న చిన్న మడులుగా విభజించి, పాలకూర, తోటకూర, గోంగూర, కొత్తిమీర, మెంతుకూరతో పాటు వివిధ రకాల ఆకుకూరలను విడతల వారీగా సాగు చేస్తున్నారు. ఒకేసారి కాకుండా దశల వారీగా విత్తనాలు వేయడం వల్ల ఏడాది పొడవునా నిరంతరంగా దిగుబడి వస్తుంది. ఆకుకూరల ప్రత్యేకత ఏమిటంటే విత్తిన 20 రోజుల్లోనే కోతకు సిద్ధమవుతాయి. దీంతో పెట్టుబడి త్వరగా తిరిగి రావడంతోపాటు, నగదు ప్రవాహం కూడా నిరంతరం కొనసాగుతుంది. ఒక లక్ష రూపాయల పెట్టుబడి పెడితే, సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం పొందవచ్చని రైతులు చెబుతున్నారు. ఈ పద్ధతి ద్వారా ఏడాది పొడవునా ఆదాయం వస్తుందని, సీజన్ అనే భేదం లేకుండా వర్షాకాలంలోనూ, ఎండాకాలంలోనూ సాగు కొనసాగుతుందని రైతులు వివరిస్తున్నారు.

ప్రకృతి వ్యవసాయంతో పెట్టుబడుల తగ్గింపు

గతంలో రైతులు పూర్తిగా రసాయనిక ఎరువులు, పురుగు మందులతో పంటలను సాగు చేసేవారు. దీనివల్ల లాభాల్లో అధిక మొత్తం వీటికే ఖర్చు అయ్యేది. అయితే ఇటీవల ప్రకృతి వ్యవసాయ విభాగం వారు, ఐసిఆర్పీ (ICRP)ల ద్వారా రైతులకు అవగాహన కల్పించి రసాయన రహిత వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. మట్టిని సారవంతం చేయడానికి పీఎండీఎస్ (PMDS), నవధాన్యాల సాగును ప్రోత్సహిస్తున్నారు. పురుగు మందులకు బదులుగా జీవామృతం, ఘన జీవామృతం, దశపర్ణి కషాయం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం వంటి ప్రకృతి సిద్ధమైన పద్ధతులను ఉపయోగిస్తున్నారు.

దీనివల్ల పెట్టుబడులు పూర్తిగా తగ్గి, అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. ఉదాహరణకు, రసాయనిక పురుగు మందులకు రూ.2000 ఖర్చయితే, ప్రకృతి పద్ధతులకు రూ.1000 మాత్రమే ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. పసుపు రంగు పురుగు మందు ట్రాప్‌లు , వేప కషాయం, శ్యాంపూ కషాయం వంటివి దోమల నివారణకు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి.

పంట మార్పిడి, భూసారం

రైతులు దుక్కి దున్నుకోవడానికి గొర్రెల దొడ్లలోంచి తెచ్చిన సేంద్రియ ఎరువును ఉపయోగిస్తారు. ఇది భూమి సారవంతం కావడానికి సహాయపడుతుంది. ఒకే మడిలో ఒక పంట కోసిన తర్వాత, వెంటనే మరొక ఆకుకూర రకాన్ని సాగు చేస్తూ పంట మార్పిడిని పాటిస్తారు. ఉదాహరణకు, పెరుగు కూర తర్వాత కోయి తోటకూర లేదా గోంగూర వంటివి వేస్తారు. ఇది భూసారాన్ని కాపాడుకోవడానికి, చీడపీడల వ్యాప్తిని తగ్గించడానికి దోహదపడుతుంది.

సంప్రదాయ పంటల నుంచి మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా పంటలను మార్చుకుంటే వ్యవసాయం కూడా లాభసాటిగా మారుతుందని ప్రకాశం జిల్లా రైతులు నిరూపిస్తున్నారు. సరైన ప్రణాళిక, విడతల వారీ సాగు, మార్కెట్ పై అవగాహన ఉంటే ఆకుకూరల సాగు రైతులకు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని వ్యవసాయ నిపుణులు కూడా సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us