Kavitha Husband dies: సినీ నటి కవిత ఇంట మరో విషాదం.. ఆమె భర్త దశరథ రాజు కోవిడ్‌తో మృతి
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి కవిత భర్త దశరథ రాజు కోవిడ్‌తో పోరాడుతూ.. కాసేపటి క్రితమే కన్నుమూశారు.
Kavitha Husband dies of Covid-19: టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటి కవిత భర్త దశరథ రాజు కోవిడ్‌తో పోరాడుతూ.. కాసేపటి క్రితమే కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాసవిడిచారు. 15 రోజుల్లో ఒకే ఇంట్లో రెండు ఘటనలతో కవిత కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఇప్పటికే కోవిడ్ కారణంగా 15 రోజుల క్రితం ఆమె కుమారుడు స్వరూప్ కన్నుమూసిన ఘటన మరవక ముందే ఆమె భర్త కూడా మాయదారి రోగంతో కన్నుమూశారు. కవిత కుమారుడు జూన్ 15 కోవిడ్ -19 కారణంగా ప్రాణాలను విడిచాడు. తాజాగా ఆమె భర్త దశరథ రాజు కరోనాతో ప్రాణాలు ఒదిలారు. కవిత భర్త దశరథ రాజు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమెను పరామర్శిస్తున్నారు. కవిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కవిత చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టిన కవిత అంచెలంచెలుగా ఎదుగుతూ గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. 1976 లో కవిత తమిళంలో ఓహ్ మంజు, తెలుగులో సిరి సిరి మువ్వతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరంగ్రేటం చేశారు. కవిత కేవలం 11 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి విజయవంతంగా రాణించారు. అప్పటి తరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబు, కృష్ణంరాజు, మోహన్ బాబు, మురళీ మోహన్, చంద్రమోహన్‌తో పాటు చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించారు.
ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తల్లి, వదిన పాత్రల్లో నటించి మెప్పించారు. కవిత తెలుగు, తమిళం, మలయాళం, కన్నడల భాషాల్లో కలిపి మొత్తంగా 350 కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. కవిత ప్రస్తుతం ఎండ్రాండ్రం పున్నగై అనే తమిళ టీవీ షోలో కీలక పాత్ర పోషిస్తున్నారు.